రాజధానిపై సచివాలయ ఉద్యోగుల సంఘం ఇంప్లీడ్ పిటిషన్

విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొద్దిరోజుల క్రితం అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌లో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ఆరోపణలను అమరావతి పరిరక్షణ సమితి చేసింది. విశాఖకు తరలివెళ్లేందుకు సిద్దంగా ఉండాల్సిందిగా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సూచించిందని… అందుకు సహకరిస్తే ఇంటి రుణాలతో పాటు, మెడికల్ సబ్సిడీ లాంటి తాయిలాలను ఇస్తామంటూ ప్రభుత్వం ఎరవేసిందని పరిరక్షణ సమితి తన పిటిషన్‌లో ఆరోపించింది. ఈమేరకు సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశంలో […]

Advertisement
Update:2020-07-29 04:09 IST

విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొద్దిరోజుల క్రితం అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌లో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ఆరోపణలను అమరావతి పరిరక్షణ సమితి చేసింది. విశాఖకు తరలివెళ్లేందుకు సిద్దంగా ఉండాల్సిందిగా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సూచించిందని… అందుకు సహకరిస్తే ఇంటి రుణాలతో పాటు, మెడికల్ సబ్సిడీ లాంటి తాయిలాలను ఇస్తామంటూ ప్రభుత్వం ఎరవేసిందని పరిరక్షణ సమితి తన పిటిషన్‌లో ఆరోపించింది. ఈమేరకు సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశంలో చర్చ కూడా జరిగిందని పిటిషన్లో వెల్లడించింది.

ఇలా ఉద్యోగులకు తాయిలాలు ఎరగా వేసి సచివాలయాన్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమరావతి పరిరక్షణ సమితి చేసిన ఆరోపణలను సచివాలయ ఉద్యోగుల సంఘం ఖండించింది. ఈ మేరకు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ వేసింది. అమరావతి పరిరక్షణ సమితి సచివాలయ ఉద్యోగులపై అసత్యాలను ప్రచారం చేస్తూ… తప్పుడు సమాచారంతో హైకోర్టులో పిటిషన్‌ వేసిందని ఇంప్లీడ్ పిటిషన్‌లో ఉద్యోగుల సంఘం ఆరోపించింది.

పరిపాలన రాజధానిలో సచివాలయ ఉద్యోగుల పాత్రే కీలకం కాబట్టి తమ వాదనలు వినాలంటూ పిటిషన్ వేశారు. తమకు ప్రభుత్వం తాయిలాలను ఎరగా వేస్తోందన్నది పూర్తిగా అవాస్తవమని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గత ప్రభుత్వ హయాంలోనూ తమను హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారని అప్పుడు కూడా ఎలాంటి తాయిలాలు ఇవ్వలేదని ఉద్యోగుల సంఘం గుర్తు చేసింది.

పూర్తి తప్పుడు సమాచారంతో పిటిషన్ వేసి కోర్టును తప్పుదోవ పట్టించిన అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు జరిమానా కూడా విధించాలని డిమాండ్ చేసింది. అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌లో 90శాతం అవాస్తవాలే ఉన్నాయని, పిటిషన్ నిండా చెత్త ఉందన్నారు. పిటిషన్‌ వేసినందుకు తమకు అభ్యంతరం లేదని… కానీ సచివాలయ ఉద్యోగులపై తప్పుడు ప్రచారం చేసినందుకే తాము ఇంప్లీడ్ పిటిషన్ వేశామన్నారు. మే నెలలోనే రాజధాని తరలిపోతుందని ఉద్యోగులకు ప్రభుత్వం చెప్పిందని పిటిషన్‌లో చెప్పారని… మే నెల కూడా వెళ్లిపోయిందని దీన్ని బట్టి ఆ పిటిషన్‌ అంతా ఊహాజనితం అన్నది అర్థమవుతోందని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాజధాని తరలింపుకు ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని ఒక పనికిమాలిన అభిప్రాయాన్ని కూడా అమరావతి పరిరక్షణ సమితి తన పిటిషన్‌లో వ్యక్తం చేసిందన్నారు. విశాఖలో రెండువేల కోట్ల విలువైన స్థలం ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వబోతున్నదంటూ, 2వేల 500 కోట్లు లోన్లు ఇవ్వబోతున్నదంటూ నోటికొచ్చిన అంశాలపై పిటిషన్ వేశారన్నారు. అందుకే వాటికి సమాధానం ఇవ్వాలనే తాము ఇంప్లీడ్ పిటిషన్ వేశామన్నారు.

రాజధాని తరలింపుకు 70 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. నిర్మాణం విషయంలో చూస్తే అమరావతి ప్రాంతం కంటే విశాఖలో చాలా తక్కువ ఖర్చు అవుతుందన్నారు. అమరావతిలో 70 శాతం పనులు పూర్తయ్యాయని అమరావతి పరిరక్షణ సమితి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించారన్నారు.

రాష్ట్ర రాజధాని అనేది భూములు ఇచ్చిన రైతుల సొంత వ్యవహారం కాదని… అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి హక్కు అని సచివాలయ ఉద్యోగ సంఘం తన పిటిషన్‌లో వ్యాఖ్యానించింది. రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వమే కానీ రైతులు కాదని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు కార్పొరేట్‌ కంపెనీలకు వందల ఎకరాలు కేటాయించారని… అప్పుడు అభ్యంతరం చెప్పని వారు ఇప్పుడు పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మాత్రం పిటిషన్లు వేయడం ఎంతవరకు సమంజసమని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది.

Tags:    
Advertisement

Similar News