పరీక్షల నిర్వహణే పరీక్ష !

కరోనా పెడుతున్న తిప్పలు, దానికారణంగా జనం పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. కరోనా బారిన పడకుండా సమర్ధవంతంగా తమ పనులు తాము చేసుకుంటూ జీవించడం అనేది అందరికీ పరీక్షలాగే ఉంది. ఇది ఇలా ఉంటే కొన్నాళ్లుగా అన్నిరకాల డిగ్రీ, పీజీ ఆఖరి సెమిస్టర్ (ఫైనల్ ఇయర్) విద్యార్థుల పరీక్షలను… కరోనా కష్టాలు ఒక ప్రహసనంగా మార్చేశాయి. ఇదిగిదిగో పరీక్షలు రద్దు చేసేశారు… నిర్ణయం తీసేసుకున్నారు…ఇక ముఖ్యమంత్రి ఓకే అనడమే తరువాయి… లాంటి వార్తలు కుప్పలు తెప్పలుగా […]

Advertisement
Update:2020-07-09 15:02 IST

కరోనా పెడుతున్న తిప్పలు, దానికారణంగా జనం పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. కరోనా బారిన పడకుండా సమర్ధవంతంగా తమ పనులు తాము చేసుకుంటూ జీవించడం అనేది అందరికీ పరీక్షలాగే ఉంది. ఇది ఇలా ఉంటే కొన్నాళ్లుగా అన్నిరకాల డిగ్రీ, పీజీ ఆఖరి సెమిస్టర్ (ఫైనల్ ఇయర్) విద్యార్థుల పరీక్షలను… కరోనా కష్టాలు ఒక ప్రహసనంగా మార్చేశాయి. ఇదిగిదిగో పరీక్షలు రద్దు చేసేశారు… నిర్ణయం తీసేసుకున్నారు…ఇక ముఖ్యమంత్రి ఓకే అనడమే తరువాయి… లాంటి వార్తలు కుప్పలు తెప్పలుగా కనబడుతున్నా… విషయం అక్కడే ఉంది.

విద్యార్థుల్లో పరీక్షలు ఎలా రాయాలనే ఒత్తిడికంటే ముందు అసలు పరీక్షలు జరుగుతాయా లేదా అనే ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావటం కష్టమే కావచ్చు. కానీ ఆలస్యం మాత్రం భరించలేనిది. తాజాగా ఇప్పుడు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం పరీక్షలు తప్పనిసరి అని, అవి ఆగస్టులో ఉంటాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) పరీక్షలు నిర్వహిస్తే వచ్చే ప్రమాదాల గురించి…. పరీక్షలకు ముందే సమీక్షించమంటూ అన్ని యూనివర్శిటీలకు, కాలేజీలకు… ఉత్తర్వులు జారీ చేసింది.

యుజిసి ఈ విషయంలో అడుగుతున్న ప్రశ్నలు…. పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకు ప్రశ్నాపత్రంలో ఇచ్చే ప్రశ్నలకంటే ఎక్కువే ఉన్నాయి. అది జారీ చేసిన ప్రామాణిక నిర్వహణా విధానాల ఉత్తర్వుల్లో ఉన్న అంశాలను చూస్తుంటే… పరీక్షల నిర్వహణ కంటే దానిముందు చేయాల్సిన కసరత్తే మరింత కష్టమని అనిపిస్తోంది.

  • పరీక్షలను ఆన్ లైన్ లో కాకుండా నేరుగా నిర్వహిస్తే ఎలాంటి ప్రమాదావకాశాలు ఉన్నాయి. సమీక్షించండి.
  • నాన్ రెసిడెన్షియల్ విద్యార్థులకు రిస్క్ మరింతగా ఉంటుంది కనుక…. అలాగే పూర్తి రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్, పాక్షిక రెసిడెన్షియల్… వీటి పరంగా ఎదురయ్యే రిస్క్ తో పాటు దానిని నివారించే చర్యలు సైతం భిన్నంగా ఉంటాయి కనుక… రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ విద్యార్థులను వేరువేరుగా పరిగణిస్తూ రిస్క్ ని సమీక్షించాలి.
  • నాన్ రెసిడెన్షియల్స్ విషయంలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఉత్తర్వుల్లో యుజిసి పేర్కొంది.
  • యూనివర్శిటీలు, కాలేజీలు…. తమ ఫ్యాకల్టీ సభ్యులు, కౌన్సెలర్లు, టెక్నికల్, నాన్ టీచింగ్ సిబ్బంది… లాంటివారి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పరీక్షల నిర్వహణా ప్రాంతాలను శానిటైజ్ చేయటం, మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, థర్మల్ స్క్రీనింగ్ …. లాంటి చర్యలు అమలు అయ్యేలా చూడాలి.
  • ప్రతి డెస్క్ లో ప్రతి ఒక్క విద్యార్థికీ శానిటైజర్ అందుబాటులో ఉండాలి.
  • పరీక్షల నిర్వహణలో పాల్గొనేవారు చేతులకు గ్లౌజులు ధరించాలి. ముఖ్యంగా ప్రశ్నాపత్రాలు ఇచ్చేటప్పుడు. విద్యార్థులు, స్టాఫ్ అందరూ ఆరోగ్యసేతు యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • విద్యార్థులను పరీక్షా గదుల్లో ఎలా కూర్చోబెట్టాలో కూడా యుజిసి చెప్పింది. గదికి 12మంది మాత్రమే విద్యార్థులు ఉంటారు. వారు దగ్గరదగ్గరగా ఉండకుండా ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలి.

ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు తప్పనిసరి అని చెప్పిన యుజిసి ప్రపంచవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్న కొన్ని యూనివర్శిటీలను ఉదాహరణగా పేర్కొంది. కరోనా విపత్తు సమయంలోనే మిట్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలు పరీక్షలు నిర్వహించాయని అంది.

ఇప్పుడు చాలా యూనివర్శిటీలు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లేదా రెండూ కలిపి… పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపింది. ఇంపీరియల్ కాలేజి ఆఫ్ లండన్, యూనివర్శిటీ ఆఫ్ టొరొంటో మొదలైన యూనివర్శిటీలు ఆన్ లైన్ మోడల్ తో పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొంది. ఓపెన్ బుక్, టేక్ హోమ్, ప్రెజెంటేషన్, అసైన్ మెంట్స్, టర్మ్ పేపర్ తదితర విధానాలతో కొన్ని యూనివర్శిటీలు పరీక్షలను నిర్వహిస్తున్నాయని కూడా యూజిసి తెలిపింది.

కరోనా విలయతాండవం స్థాయి, దానిని ఎదుర్కొంటున్న విధానాలు, దానిపైన జనంలో అవగాహన, కరోనా నిర్దారణ పరీక్షలు, చికిత్సలు… ఇవన్నీ దేశానికో తీరుగా, రాష్ట్రానికో విధంగా ఉంటున్న నేపథ్యంలో…. ప్రపంచ స్థాయి యూనివర్శిటీలతో పోలుస్తూ పరీక్షలు నిర్వహించాలని చెప్పటం మాత్రం సమంజసం కాదనిపిస్తోంది. పరీక్షల నిర్వహణే పరీక్షగా మారిన తరుణంలో ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వారు స్పందించడమే ఉత్తమం. ఏదిఏమైనా కరోనా కారణంగా భరిస్తున్న ఒత్తిడితో పాటు విద్యార్థులను ఈ అదనపు ఆందోళనకు గురిచేయటం ఏమాత్రం సముచితంగా లేదు.

Tags:    
Advertisement

Similar News