పతంజలి మాయ... తీసుకున్నది రోగనిరోధక శక్తి పెంచే లైసెన్సు... ప్రచారం మాత్రం కరోనా మందు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాడం చేస్తున్న సమయంలో ప్రజలంతా భయాందోళనలో ఉంటే ఫార్మా కంపెనీలు మాత్రం తమ నిల్వలను అమ్ముకునే పనిలో ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. పాత మందులకే కొవిడ్-19ని తగ్గించే శక్తి ఉందంటూ.. ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ లేకుండా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి ఆయుర్వేద ఔషధ కంపెనీ పతంజలి కూడా చేరింది. దగ్గు, జ్వరం తగ్గించి రోగనిరోధక శక్తి పెంచే ఔషధం తయారు చేస్తున్నామంటూ ఉత్తరాఖండ్ ఆయుష్ శాఖ నుంచి లైసెన్స్ పొందిన ఈ […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాడం చేస్తున్న సమయంలో ప్రజలంతా భయాందోళనలో ఉంటే ఫార్మా కంపెనీలు మాత్రం తమ నిల్వలను అమ్ముకునే పనిలో ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. పాత మందులకే కొవిడ్-19ని తగ్గించే శక్తి ఉందంటూ.. ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ లేకుండా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి ఆయుర్వేద ఔషధ కంపెనీ పతంజలి కూడా చేరింది.
దగ్గు, జ్వరం తగ్గించి రోగనిరోధక శక్తి పెంచే ఔషధం తయారు చేస్తున్నామంటూ ఉత్తరాఖండ్ ఆయుష్ శాఖ నుంచి లైసెన్స్ పొందిన ఈ సంస్థ.. తాజాగా అదే మందును కోవిడ్-19 చికిత్స కోసం అంటూ ‘కరోనిల్’ పేరుతో విడుదల చేసింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతోంది.
బాబా రామ్‌దేవ్ ప్రమోట్ చేస్తున్న పతంజలి సంస్థ గత కొన్నేండ్లుగా ఆయుర్వేద ఔషధాలను మార్కెట్ చేస్తోంది. ఉత్తరాఖండ్‌లో ఈ సంస్థకు తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి. ఇటీవల ఆ సంస్థ కోవిడ్ – 19ని నయం చేసే కిట్ అంటూ మార్కెట్లోకి కొరోనిల్ పేరుతో ఒక ప్రొడక్ట్ విడుదల చేసింది. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ వద్ద కరోనా ఔషధం పేరుతో ఎలాంటి అనుమతులు తీసుకోలేదని.. కేవలం వ్యాధినిరోధక శక్తిని పెంచే ఔషధమంటూ దరఖాస్తు చేసుకున్నారని చెప్పింది. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని పతంజలి సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ మెడిసినల్ లైసెన్స్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ వైఎస్ రావత్ తెలిపారు.
మంగళవారం కరోనిల్ కిట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తూ.. మా ఔషధం కరోనా రోగులపై ప్రయోగించగా 100 శాతం మంచి ఫలితాలు వచ్చాయని ప్రకటించింది. అయితే ఆ క్లినికల్ ట్రయల్స్ ఎక్కడ నిర్వహించారు? ఎంత మంది పై… అనే విషయాలేవి బయటకు చెప్పలేదు. అదే సమయంలో క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించలేదు. ఇలా ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఔషధాలను విడుదల చేయడం డ్రగ్స్ అండ్ కాస్మిటిక్స్ యాక్ట్‌లోని రూల్ 170 ప్రకారం నేరమని వైఎస్ రావత్ స్పష్టం చేశారు.
పతంజలి ఈ ఔషధాన్ని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఈ ఔషధానికి ఎటువంటి ప్రచారం చేయరాదని, కోవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్నట్లు చెప్పరాదని ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఆయుష్ మంత్రి శ్రీపథ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. పతంజలి కోవిడ్-19 విషయంలో తీసుకున్న చొరవ మంచిదే.. కానీ ఈ ఔషధం విడుదల చేయడంలో మరిన్ని ప్రక్రియలు చేపట్టాల్సి ఉందని అన్నారు. దీనిపై రాందేవ్ బాబా స్పందిస్తూ.. ఆయుష్ మంత్రిత్వ శాఖ అడిగిన అన్ని పత్రాలను పతంజలి సంస్థ సమర్పించిందని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడో సమాచార లోపం ఉందని.. అందుకే ఈ గందరగోళం నెలకొందని అన్నారు.
ప్రస్తుతం కొరోనిల్ ఔషధం వల్ల పతంజలికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లినికల్ ట్రయల్స్ కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ రెండు సంస్థలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాయని చెబుతున్నాయి. కానీ మా నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని జైపూర్‌కు చెందిన మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నరోత్తమ్ శర్మ స్పష్టం చేశారు.