రూటు మార్చనున్న కేసీఆర్ ?

కేంద్రం మార్గదర్శకాలు అమలుకు సై ఆదాయం కోల్పోవడంపై మదనం మే 5న కేబినెట్‌లో నిర్ణయం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా మహమ్మారి కట్టడి కోసం భారత ప్రభుత్వం మార్చి 25 నుంచి లాక్‌డౌన్ ప్రకటించింది. కాగా, కరోనా విషయంలో కేంద్రం కంటే ముందే పలు రాష్ట్రాలు మేల్కొన్నాయి. కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు కరోనాపై పోరాటానికి కఠినమైన నిబంధనలు విధించాయి. మోడీ సూచన మేరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన రోజు నుంచే తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ […]

Advertisement
Update:2020-05-03 02:03 IST
  • కేంద్రం మార్గదర్శకాలు అమలుకు సై
  • ఆదాయం కోల్పోవడంపై మదనం
  • మే 5న కేబినెట్‌లో నిర్ణయం

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా మహమ్మారి కట్టడి కోసం భారత ప్రభుత్వం మార్చి 25 నుంచి లాక్‌డౌన్ ప్రకటించింది. కాగా, కరోనా విషయంలో కేంద్రం కంటే ముందే పలు రాష్ట్రాలు మేల్కొన్నాయి. కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు కరోనాపై పోరాటానికి కఠినమైన నిబంధనలు విధించాయి.

మోడీ సూచన మేరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన రోజు నుంచే తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమలవుతోంది. ఇప్పటి వరకు ఎమర్జెన్సీ సర్వీసులు, నిత్యావసరాల దుకాణాలు, వ్యవసాయ రంగం తప్ప వేటికీ సడలింపులు ఇవ్వలేదు. ఆహారం డోర్ డెలివరీ చేసే జోమాటో, స్విగ్గీలను కూడా తాత్కాలికంగా నిషేధించారు.

కేంద్ర ప్రభుత్వం పలుమార్లు సడలింపులు చేసినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం వాటిని రాష్ట్రంలో అమలు చేయలేదు. ఇక కేంద్రం రెండోసారి మే 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మే 7 వరకు లాక్‌డౌన్ విధించారు.

ఈ నేపథ్యంలో మే 4 తర్వాత కేంద్రం ప్రకటించిన సడలింపులు తెలంగాణలో అమలు చేస్తారా? లేదా? అనే దానిపై పలు అనుమానాలు నెలకొన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం జనతా కర్ఫ్యూతో కలిపి వరుసగా 47 రోజులు వరుసగా లాక్‌డౌన్ విధించింది. రాష్ట్రానికి ఆదాయ మార్గాలైన రిజిస్ట్రేషన్లు, వాహనాల అమ్మకాలు, మద్యం అమ్మకాలు, చమురు అమ్మకాల ద్వారా వచ్చే వాణిజ్య పన్నులు ఈ 47 రోజుల పాటు ఆగిపోయాయి.

దీంతో పాటు పలు పరిశ్రమలు తాత్కాలికంగా మూసేయడంతో వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా కోల్పోయింది. గతంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లు రోజుకు 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నాం. ఈ లెక్కన 47 రోజులకు 19 వేల కోట్ల రూపాయలు కోల్పోయినట్లు. ఇదేం చిన్నమొత్తం కాదు. పైగా కరోనాపై పోరాటానికి భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది.

వైద్య పరికరాలు, రక్షణ కవచాలు, ఔషధాలు, టెస్టులకు భారీగా ఖర్చు అవుతోంది. దీనికి తోడు క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వమే పౌష్టికాహారం సరఫరా చేస్తోంది. దీంతో ఒకవైపు ఆదాయం రాక.. మరోవైపు ఖర్చులు పెరిగి ఖజానా ఖాళీ అవుతోంది.

దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే కరోనా కట్టడి చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మే 4 నుంచి కేంద్రం కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. రెడ్ జోన్ల వారిని పూర్తిగా కట్టడి చేసి ఆరెంజ్ , గ్రీన్ జోన్లలో సాధారణ కార్యాకలాపాలకు అనుమతులు ఇవ్వాలని సూచించింది.

దీంతో ఇన్నాళ్లు సొంత నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తే.. కాస్త ఆదాయం రావడంతో పాటు కరోనాను కూడా కట్టడి చేసే వీలుంటుందని భావిస్తున్నారు. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే తమ నివేదికలు సిద్దం చేశారు. ఇవన్నీ సీఎం దృష్టికి రానున్నాయి.

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శాకలు పాటిస్తే పలు రూపాల్లో నిధులు పొందడం, పరిహారం అడగడం వంటివి చేసే అవకాశం ఉంటుంది. అందరితో పాటే లాక్‌డౌన్ మార్గదర్శకాలను అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

గతంలో చేసినట్లు కేంద్రం చెప్పిన డేటుకు నాలుగు రోజులు ఎక్కువ లాక్‌డౌన్ ప్రకటించడం కాకుండా.. దాని రూట్లోనే వెళ్లాలని భావిస్తున్నారు. తద్వారా ఆదాయాన్ని తిరిగి రాబట్టుకోవడంతో పాటు కేంద్రం దృష్టిలో కూడా వ్యతిరేక భావన లేకుండా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో కూలంకషంగా చర్చించి కేంద్ర మార్గదర్శకాలనే అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీ మాదిరిగా ఇక్కడ కూడా సాధారణ కార్యకలాపాలకు వెసులుబాటు లభిస్తుంది. అయితే క్యాబినెట్ సమావేశంలో ఏం నిర్ణయం జరుగుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News