భారీగా కేసులు నమోదు... ఏపీ అంత ప్రమాదకరంగా ఉందా?

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ఆ తర్వాత యూరోప్ దేశాలను తాకి అమెరికా చేరింది. ప్రపంచంలోని అన్ని దేశాలలో కరోనా విలయతాండవం చేస్తోంది. కాని ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇండియా కరోనా విషయంలో కాస్త విజయం సాధించిందనే చెప్పవచ్చు. అయితే ఈ విజయానికి మొదటి అర్హులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయడంతో కరోనా వ్యాప్తి వేగాన్ని తగ్గించగలిగాయి. ముఖ్యంగా దక్షిణాదిన […]

Advertisement
Update:2020-05-03 02:20 IST

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ఆ తర్వాత యూరోప్ దేశాలను తాకి అమెరికా చేరింది. ప్రపంచంలోని అన్ని దేశాలలో కరోనా విలయతాండవం చేస్తోంది. కాని ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇండియా కరోనా విషయంలో కాస్త విజయం సాధించిందనే చెప్పవచ్చు.

అయితే ఈ విజయానికి మొదటి అర్హులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయడంతో కరోనా వ్యాప్తి వేగాన్ని తగ్గించగలిగాయి. ముఖ్యంగా దక్షిణాదిన కేరళ, తెలంగాణ, ఏపీ కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోవడంతో సహజంగానే తెలంగాణ, ఏపీకి కరోనా కట్టడి విషయంలో పోలికలు వెతుకుతున్నారు. తెలంగాణలో భారీగా కేసులు నమోదవుతున్న సమయంలో కూడా ఏపీలో కరోనా తక్కువగానే ఉంది.

లాక్‌డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు ఏపీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకుంది. దీంతో ఎప్పటికప్పుడు కరోనా బాధితులను వెతికిపట్టుకుంది. కాగా, మర్కజ్ ప్రార్థనల తర్వాత తెలంగాణతో పాటు ఏపీలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగాయి.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లిఘీ జమాత్ మర్కజ్‌లో సంబంధాలు బయటపడడానికి ముందు వరకు తెలుగు రాష్ట్రాలు రెండూ కరోనాను కాస్తో కూస్తో కట్టడిచేశాయి. ఏప్రిల్ రెండో వారం మధ్యలో తెలుగు రాష్ట్రాలకు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు కరోనా తాకిడి పెరిగింది. మార్చి 31నాటికి 44 పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి.

ఇక ఏప్రిల్ నెలలో ఏపీలో భారీగా కేసులు నమోదయ్యాయి. దీనికి మొదటి కారణం మర్కజ్ కాగా, రెండో కారణం పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయడం. గ్రామ/వార్డు వాలంటీర్లు, ఆశావర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది కలసి ఇప్పటి వరకు రెండు సార్లు రాష్ట్రమంతా సర్వే చేశారు. అనంతరం అనుమానం వచ్చిన ప్రాంతాల్లో కరోనా టెస్టులు నిర్వహించారు.

దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాల్లో కేవలం కోవిడ్-19 లక్షణాలు కనపడితేనే పరీక్షలు చేశారు. కానీ ఏపీలో మే 2వ తేదీ నాటికి 1,08,403 కరోనా టెస్టులు నిర్వహించారు. మిగతా రాష్ట్రాల్లో ఇంత భారీగా టెస్టులు నిర్వహించకపోవడం వల్ల కేసులను గుర్తించడం కష్టమవుతోంది.

అయితే ఏపీలో ప్రస్తుత పరిస్థితి ప్రమాదకరంగా ఏమీ లేదని.. కంటైన్మెంట్ జోన్లలో కఠిన నిబంధనలు అమలులోనే ఉన్నాయని.. ఒకవేళ మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లకు సడలింపులు ఇచ్చినా నిబంధనలు మాత్రం అమలులో ఉండటం వల్ల కరోనా వ్యాప్తి పెరగదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీ సీఎం ఇప్పటికే రాష్ట్రానికి వచ్చే వారికోసం లక్ష బెడ్లు సిద్దం చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ 50 కుటుంబాలకు కేటాయించిన వాలంటీర్లు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. దీనికి తోడు ప్రతీ కుటుంబం నుంచి ఒకరికి కరోనా టెస్టు చేయాలని నిర్ణయించడం శుభపరిణామం అని నిపుణులు చెబుతున్నారు.

అలా చేయడం వల్ల మరిన్ని పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉంది. కానీ అంతిమంగా ఏపీలో కరోనా బాధితుల కచ్చితమైన సంఖ్య బయటకు వస్తుంది. ఎలాగో క్వారంటైన్ సెంటర్లు సిద్దం చేస్తుండటంతో చికిత్స చేయడం కూడా సులువు అవుతుందని అంటున్నారు.

ప్రస్తుతం ఏపీ నుంచి వెలువడుతున్న గణాంకాలను చూసి భయాందోళనలు చెందవద్దని అధికారులు అంటున్నారు. రేపు సడలింపులు ఎత్తేసినా ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉండటం ద్వారా కరోనాను విజయవంతంగా కట్టడి చేయవచ్చని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News