కోవిడ్ కట్టడికి జగన్ త్రిముఖ వ్యూహం

(ఎస్వీ రావు) ఆంధ్రప్రదేశ్ లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా ను  ప్రజల్లో మరింతగా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు  ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకెళుతోంది. రాష్ట్రంలో స్తంభించిన వ్య‌వ‌సాయ‌, గ్రామీణ ఉత్ప‌త్తులు, పారిశ్రామిక‌, వాణిజ్య రంగాల‌ను తిరిగి గాడిన పెట్టాలంటే ఈ వ్యాధిని పూర్తిగా అదుపు చేయ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌కు తాజాగా ద‌శ‌దిశ నిర్దేశించారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయ‌ని విధంగా అంత‌ర్జాతీయ స్థాయికి త‌గ్గ‌ట్టుగా […]

Advertisement
Update:2020-04-22 05:39 IST

(ఎస్వీ రావు)

ఆంధ్రప్రదేశ్ లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా ను ప్రజల్లో మరింతగా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకెళుతోంది. రాష్ట్రంలో స్తంభించిన వ్య‌వ‌సాయ‌, గ్రామీణ ఉత్ప‌త్తులు, పారిశ్రామిక‌, వాణిజ్య రంగాల‌ను తిరిగి గాడిన పెట్టాలంటే ఈ వ్యాధిని పూర్తిగా అదుపు చేయ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌కు తాజాగా ద‌శ‌దిశ నిర్దేశించారు.

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయ‌ని విధంగా అంత‌ర్జాతీయ స్థాయికి త‌గ్గ‌ట్టుగా రాపిడ్ టెస్టింగ్ ను విస్త‌రించ‌డంతోపాటు వ్యాధి సోకిన‌వారికి స‌మ‌ర్ధ‌మైన చికిత్స అందించి త్వ‌రిత‌గ‌తిన కోలుకునేలా చేయడ‌మే ప్రథమ లక్ష్యంగా పెట్టుకుంది. దానితో పాటు కరోనా పేషెంట్, వారి కుటుంబ స‌భ్యుల‌కు బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం, మాన‌సిక స్థైర్యం క‌ల్పించ‌డం ఈ వ్యూహంలో ప్ర‌ధాన అంశాలు.

అదే స‌మ‌యంలో వైద్య ఆరోగ్య శాఖ‌ను అంటే ప్ర‌జారోగ్య విధానాన్ని ప్ర‌భుత్వ రంగంలో ప‌టిష్ట‌ప‌ర‌చ‌డం ద్వారా పై వాటిని సాధ్యం చేయాల‌నేది ల‌క్ష్యం. అలాగే ఉపాధి కోల్పోయిన వారికి ముఖ్యంగా పేద‌లు, వ‌ల‌స కార్మికుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం మ‌రో ప్ర‌ధాన ఉద్దేశం.

ఏపీలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌టిష్ట విధానాల వ‌ల్ల వ్యాధి వ్యాప్తి, మ‌ర‌ణాల రేటు జాతీయ స్థాయితో పోల్చితే బాగా తక్కువ గా వుంటున్న‌ది. వ్యాధి వ్యాప్తి జాతీయ స్థాయిలో ప్ర‌తి ఏడున్న‌ర రోజుల‌కు రెట్టింపు అవుతుంటే ఏపీలో 17 రోజుల‌కు రెట్టింపు అవుతోంది. దీన్నిబ‌ట్టి చూస్తే ఇక్క‌‌డ వ్యాప్తి త‌క్కువ‌గా వుంది. కేర‌ళ‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌ల‌లో వ్యాప్తి మ‌రీ త‌క్కువ‌గా వుండ‌గా ఆ త‌రువాత స్థానంలో ఏపీ వుంది.

రాపిడ్ టెస్ట్ లతో కరోనా గుర్తింపు

అత్య‌ధిక సంఖ్య‌లో రాపిడ్ టెస్టులు చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే రాష్ట్రంలో వ్యాధి అస‌లు తీవ్ర‌త‌ బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వుంది. ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే మ‌న దేశంలోనూ, అనేక రాష్ట్రల్లోనూ ఆశించిన స్థాయిలో ప్ర‌భుత్వాలు టెస్టులు నిర్వ‌హించ‌డం లేదు, వ్యాధి తీవ్ర‌మైతే త‌ప్ప.

సాధార‌ణంగా ఈ వ్యాధి సోకిన‌వారిలో 80 శాతం మందికి దానంత‌ట‌దే రోగం న‌యమ‌వుతుంద‌ని వైద్యులు చెబుతుండ‌టంతో ప‌రిస్థితి చేయి దాటిన వారికి మిన‌హా సామాన్య వ్యాధిగ్ర‌స్తుల ప‌ట్ల ప్ర‌భుత్వాలు శ్ర‌ద్ధ చూప‌డంలేద‌నే విమ‌ర్శ వుంది.

ఈ ప‌రిస్థితుల్లో ఏపీ ప్ర‌భుత్వం ఆ భ‌యాల‌ను లెక్క చేయ‌కుండా కోవిడ్ ప‌రీక్ష‌ల వేగాన్ని గణ‌నీయంగా పెంచింది. ప్ర‌తి మిలియ‌న్ జనాభాకు చేస్తున్న ప‌రీక్ష‌ల సంఖ్య‌లో దేశంలో ఏపీ రెండ‌వ స్థానంలో వుంది. దీనిని మొద‌టి స్థానానికి తీసుకువెళ్ళాల‌నేది ఏపీ ముఖ్య‌మంత్రి ల‌క్ష్యం.

మిలియ‌న్‌కు దేశంలో 247 మందికి ప‌రీక్ష‌లు చేస్తుండ‌గా (ఇది ఆసియాలోనే తక్కువ‌) ఏప్రిల్ 21 నాటికి రాష్ట్రంలో ఇది 715గా వుంది. రాష్ట్రంలో 35,755 మందికి రాపిడ్ టెస్టులు నిర్వ‌హించారు. రాజ‌స్థాన్ త‌రువాత (ఆ రాష్ట్రంలో అది 830) ఏపీ రెండ‌వ స్థానంలో వుంది.

ఫిబ్ర‌వ‌రి 1 నుంచి ప్ర‌భుత్వం ప‌రీక్ష‌లు చేస్తున్నా మార్చి 2వ వారంలో రాష్ట్రంలో కేసులు బ‌య‌ట ప‌డిన త‌రువాత ప్ర‌భుత్వం దూకుడు పెంచింది. వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌లో రాపిడ్ టెస్టులే కీల‌క‌మ‌ని భావించిన ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న విధానం వ‌ల‌న రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవ‌కాశం వుంది. ఇది భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసినా, అంతిమంగా వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌ధాన మార్గంగా ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది.

లాక్‌డౌన్ వున్న‌ప్ప‌టికీ..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తూ సామాజిక దూరం పాటిస్తున్న‌ప్ప‌టికీ ఆందోళ‌న‌క‌ర స్థాయిలోనే క‌రోనా విజృంభిస్తున్న‌ది. ఏప్రిల్ 20 నాటికి 17,304 కేసుల‌కు చేరుకోగా అందులో 1,580 గ‌డ‌చిన 24 గంటల్లోను (ఏప్రిల్ 19 నుంచి 20 వ‌ర‌కు) రికార్డు అయ్యాయి. మొత్తం మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్ 722 కేసుల‌తో 9వ స్థానంలో వుంది.

ఇత‌ర రాష్ర్టాల‌తో పోలిస్తే ఏపీలో వ్యాధిగ్ర‌స్తుల‌ను గుర్తించ‌డంతోపాటు వ్యాప్తిని తెలుసుకునేందుకు నిర్వ‌హిస్తున్న ప‌రీక్ష‌ల‌లో ఏపీ ముందునే వుంటున్న‌ది. మ‌హారాష్ట్ర, రాజస్థాన్‌, త‌మిళ‌నాడు రాష్ట్రల త‌రువాత ఏపీ వుంది.

ఏపీలో 35,755 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా అందులో 757 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ప‌క్క‌నే వున్న తెలంగాణ రాష్ట్రంలో 14,962 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 858 కేసులు, త‌మిళ‌నాడులో 40,876 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 1,520 కేసులు పాజిటివ్ గా న‌మోద‌య్యాయి… అంటే మిగిలిన రాష్ట్రల‌తో పోలిస్తే ఏపీ ప‌రీక్ష‌లు పెద్ద సంఖ్య‌లోనే నిర్వ‌హిస్తున్న‌ది.

కేర‌ళ త‌రువాత ఏపీలోనే

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కేర‌ళ త‌రువాత ఏపీలోనే శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో ప్ర‌జా సంక్షేమం ల‌క్ష్యంగా క‌రోనాను ఎదుర్కొనే చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయి. ఏపీ క‌న్నా కేర‌ళ అగ్ర‌భాగంలో వుంది. అక్క‌డ జ‌న‌వరి నుంచే ప్ర‌ణాళికాబ‌ద్ధంగా చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా ఏపీలో మార్చి మొద‌టి వారం త‌రువాతే ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌యింది.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అన‌తి కాలంలోనే ప్ర‌భుత్వం దాదాపు 4.5 ల‌క్ష‌ల మంది వాలంటీర్ల‌తో… గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో స‌ర్వే చేయించారు. ఇందులో ఆశావ‌ర్క‌ర్లు, ఎఎన్ ఎంలు కూడా వున్నారు. రెండు ద‌శ‌ల్లో 11,158 గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లోని 3,786 వార్డుల్లోను ఈ కార్యక్ర‌మం నిర్వ‌హించ‌డం ద్వారా గ్రామాల్లో ఆరోగ్య ప‌రిస్థితి ముఖ్యంగా రోగ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని గుర్తించ‌డం సుల‌భ‌మ‌యింది. అదే స‌మ‌యంలో లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలోకి తిరిగి వ‌చ్చిన 13,301 ఎన్నారైల‌ను గుర్తించి వారిలో 11,026 మందిని ఇళ్ల‌ల్లోనే ఐసొలేష‌న్‌లో వుంచారు.

మూడ‌వ‌వారం నుంచే మొద‌లు

ఏపీలో క‌రోనా ప్రారంభ ద‌శ నుంచీ ఇప్ప‌టికి గ‌డ‌చిన 6 వారాలు వ్యాప్తి తీరును ప‌రిశీలిస్తే మొద‌టి రెండు వారాలు చెప్పుకోద‌గ్గ స్థాయిలో కేసులు వ్యాప్తి చెంద‌లేదు. అయితే 3వ వారంలో 11 కేసుల‌తో మొద‌లై 6వ వారం ముగిసే నాటికి 722 కేసుల‌కు చేరింది. రాష్ట్రంలో క‌ర్నూలు, గుంటూరు, కృష్ణ‌, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అధికంగా వ్యాప్తి చెందింది.

శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎటువంటి కేసులూ న‌మోదు కాక‌పోవ‌డం ద్వారా దేశంలో అస‌లు కేసులు న‌మోదు కాని జిల్లాల జాబితాలోకి చేరాయి. రాష్ట్రంలోని 722 కేసుల‌ను అధ్య‌య‌నం చేస్తే ప్రైమ‌రీ కాంటాక్ట్ ద్వారా 222, సెకండ‌రీ కాంటాక్ట్ ద్వారా 85 న‌మోదు అయ్యాయి. వీటిల్లో 103 కేసులు ఉన్న ప్రాంతాల‌ను కంటైన్‌మెంట్ క్ల‌స్ట‌ర్లుగా గుర్తించారు.

ఆరోగ్య శాఖ పై సీఎం ప్రత్యేక శ్రద్ద

రాష్ట్రంలో తొలినుంచీ వైద్య ఆరోగ్య శాఖ‌ను ముఖ్య‌మంత్రి స‌ర్వ స‌న్న‌ద్ధం చేయ‌డం ద్వారా శాస్త్రియ ప‌ద్ధ‌తిలో కేసుల గురించి, క‌రోనా వ్యాప్తి గురించి స‌మగ్రంగా అధ్య‌య‌నం చేయించారు.

ఏప్రిల్ 7వ తేదీ నాటికే 2 ద‌శ‌ల్లో ఇంటింటి స‌ర్వేలు నిర్వ‌హించారు. మొద‌టిద‌శ‌లో 13500000, రెండ‌వ ద‌శ‌లో 14000000 ఇళ్ల‌ను స‌ర్వే చేయించారు. రాష్ట్రంలో 14600000 ఇళ్లు ఉండ‌గా దాదాపు ప్ర‌తి ఇంటినీ రెండేసి సార్లు చొప్పున స‌ర్వే జ‌రిగింది.

ఇవి కాకుండా మ‌రో 3.28 లక్ష‌ల ఇళ్లు స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. 3వ ద‌శ కింద ఏప్రిల్ 20 నాటికి 26,436 గృహాలు మిన‌హా 14661506 గృహాలో నివాసం వుంటున్న‌వారి స‌ర్వే పూర్త‌యింది.

క్వారంటైనే కీల‌కం

ఇక చికిత్స లో రోగుల‌ను ఇత‌రుల‌కు సంబంధం లేకుండా (క్వారంటైన్ / ఐసోలేష‌న్‌) కోవిడ్ చికిత్స విధానంలో కీల‌క‌మైన‌వి. అందుకు త‌గిన విధంగా ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. ఆసుప‌త్రులే కాకుండా హోట‌ల్ గ‌దులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, క‌ళాశాల‌ల వ‌స‌తిగృహాలు, టూరిజం అతిథిగృహాలు మొద‌లైన‌వాటిని కూడా ఈ ప‌రిధిలోకి తెచ్చారు. ఇందుకోసం 34,926 గ‌దులు సిద్ధ‌మ‌య్యాయి. వీటిల్లో 73,257 ప‌డ‌క‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్ప‌టికే జిల్లాల వారీగా 339 ఇటువంటి కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. గుంటూరు, ప‌శ్చిమ‌ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి, విశాఖ‌, క‌ర్నూలు జిల్లాల్లో అధికంగా ఏర్పాటు అయ్యాయి.

వైద్య సిబ్బందికి ర‌క్ష‌ణ

క‌రోనా రోగుల‌కు చికిత్స చేయడం లో వైద్య సిబ్బందికి కూడా అంతే స్థాయిలో వ్యాధి సంక్ర‌మించ‌కుండా ర‌క్ష‌ణ అవ‌స‌రం. అనేక చోట్ల వైద్యులు, వైద్య సిబ్బంది క‌రోనా రోగుల‌కు చికిత్స చేస్తూ మ‌ర‌ణానికి గుర‌వుతున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో వారి ర‌క్ష‌ణ కోసం 2,50,562 పిపిఇ (ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్ష‌న్ ఎక్విప్‌మెంట్‌) సిద్ధం చేశారు. అత్య‌ధికంగా క‌ర్నూలు, గుంటూరు, అనంత‌పురం, విశాఖ‌, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో సిద్ధంగా వున్నాయి. అదే విధంగా వైద్య సిబ్బంది, డాక్ట‌ర్లు చికిత్స స‌మ‌యంలో ఉప‌యోగించే మాస్కులు (ఎన్ 95 మోడ‌ల్‌) 1,53,985 సిద్ధంగా వున్నాయి.

త‌క్ష‌ణ రిక్రూట్‌మెంట్‌లు

వైద్య సిబ్బంది, డాక్ట‌ర్ల కొర‌త కూడా లేకుండా ప్ర‌భుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేయ‌డంతోపాటు కొత్త‌గా తాత్కాలిక ప్రాతిప‌దిక‌న తీసుకుంది ప్రభుత్వం. మొత్తం 1451 మంది డాక్ట‌ర్ల‌ను ఇందుకోసం సిద్ధం చేశారు. జిల్లా స్థాయి అధికారులు, ఉన్న‌త వైద్యులు క‌లిపి 554 మంది వున్నారు. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెస‌ర్లు వ‌రుస‌గా 554, 1487 మంది అందుబాటులో వున్నారు.

వీరు కాకుండా తాత్కాలిక ప్రాతిప‌దిక‌న 2,595 మంది అదే స్ధాయి వారిని నియ‌మించారు. ఇక జిల్లాల్లో ప్ర‌భుత్వ వైద్యులు వారికి అనుబంధంగా సిబ్బందిని కూడా ఇదే ప‌నుల‌కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో 1,937 మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, పారా మెడిక‌ల్ సిబ్బందితో పాటు ఆశావ‌ర్క‌ర్లు క‌లిపి 70,673 మందిని సిద్ధంగా వుంచారు.

వేగంగా ఏర్పాట్లు

వ్యాధి వ్యాప్తి చెందితే అందుకు త‌గిన విధంగా చికిత్స విస్త్రృత‌ ప‌రిచేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను ప్ర‌భుత్వం చురుగ్గా చేసింది. రాష్ట్ర స్థాయి 4 కోవిడ్ ఆసుప్ర‌తులు విశాఖ‌, నెల్లూరు, కర్నూలు, కృష్ణా, చిత్తురుల‌లో ఏర్పాటు కాగా, ఇందులో నాన్‌-ఐసియు బెడ్‌లు 1680కి గాను 1370 ఏర్పాటు చేసింది. ఐసియు బెడ్‌లు 444 ల‌క్ష్యంగా నిర్ణ‌యిస్తే ఇప్ప‌టికి 332 ఏర్పాటు అయ్యాయి. ప‌రిస్థితి చేయిదాటిపోతున్న వారిని ర‌క్షించ‌డం కోసం ఆ ఆసుపత్రుల్లో 444 వెంటిలేట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించ‌గా ఇప్ప‌టికి 335 సిద్ధం చేశారు.

అలాగే జిల్లా స్థాయి కోవిడ్ ఆసుప‌త్రులు ప్ర‌తి జిల్లా కేంద్రంలోను ఆఖ‌రికి శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోనూ ఏర్పాటు చేశారు. ఇక్క‌డ నాన్ ఐసియు బెడ్‌లు 8,950 ల‌క్ష్యం కాగా, 6,662 ఇప్ప‌టికే ఏర్పాటు అయ్యాయి. ఐసియు బెడ్‌లు, వెంటిలేట‌ర్ల‌తో క‌లిపి 590 ల‌క్ష్యం కాగా, 295 ఏప్రిల్ 20 నాటికి సిద్ధమ‌య్యాయి.

జిల్లా స్థాయి కోవిడ్ ఆసుప‌త్రుల‌ను 6 స్థాయిల్లో అవ‌స‌ర‌మైతే విస్త‌రించాల‌ని నిర్ణ‌యించారు. అంటే ఇప్ప‌టికి ఏర్పాటు చేస్తున్న ఐసియు, నాన్ ఐసియు వెంటిలేట‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెంచుతారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి 6వ ద‌శ నాటికి 23,442 నాన్ ఐసియు బెడ్‌లు, 1867 ఐసియు బెడ్‌లు ఏర్పాటు చేస్తారు. ఇవి కాకుండా 700 వెంటిలేట‌ర్ల‌ను సిద్దం చేయాల‌ని నిర్ణ‌యించారు.

రాష్ట్రంలో 23 ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు, క‌ళాశాల‌లు వున్నాయి. ప్రైవేటు రంగంలో 54 వున్నాయి. ట్ర‌స్టు అధీనంలో 1 వుంది. మొత్తం 78 క‌ళాశాల‌లు, ఆసుప‌త్రుల‌ను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News