సోనియా రాజకీయ అజ్ఞానం.... సంక్షోభంలో కాంగ్రెస్‌

ఈ కాంగ్రెస్ కు ఏమైంది? ఓ వైపు అనారోగ్యంతో సోనియా.. మరోవైపు పట్టించుకోని రాహుల్.. ఇంకోవైపు గోడ దూకేసిన సింధియా. ఇక దుకాణం మూసుకోవలసిందేనా?.. ఇది సరదాకే అనుకున్నా కానీ.. పరిస్థితి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ లో ఇలాగే తయారైంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత విలువలతో రాజకీయం చేయాలనుకునే రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతల నుంచి  తప్పుకొన్నాక… బలవంతంగా సోనియా చేతికే పార్టీని నేతలు మళ్లీ అప్పగించారు. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి కాస్త ఆశాజనకంగానే ఉన్నా… బీజేపీ […]

Advertisement
Update:2020-03-11 13:29 IST

ఈ కాంగ్రెస్ కు ఏమైంది? ఓ వైపు అనారోగ్యంతో సోనియా.. మరోవైపు పట్టించుకోని రాహుల్.. ఇంకోవైపు గోడ దూకేసిన సింధియా. ఇక దుకాణం మూసుకోవలసిందేనా?.. ఇది సరదాకే అనుకున్నా కానీ.. పరిస్థితి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ లో ఇలాగే తయారైంది.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత విలువలతో రాజకీయం చేయాలనుకునే రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొన్నాక… బలవంతంగా సోనియా చేతికే పార్టీని నేతలు మళ్లీ అప్పగించారు. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి కాస్త ఆశాజనకంగానే ఉన్నా… బీజేపీ ఎత్తుల ముందు జాతీయ స్థాయిలో ఆ పార్టీ నానాటికీ తేలిపోతోంది. సమర్థమైన నాయకత్వ లోపం… సరైన దిశానిర్దేశం చేసే నేత కరువవడం… రాహుల్ గాంధీకి మరో ప్రత్యామ్నాయం లేకపోవడం… ఈ పరిస్థితికి దారి తీసింది.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ఎవరూ పార్టీని ముందుకు తీసుకుపోయేవారు లేకుండా పోయారు. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం అయిన తర్వాత గులాం నబీ ఆజాద్ సైలెంట్ అయ్యారు. కోర్టు కేసుల కారణంగా.. చిదంబరం ఎక్కువగా పోరాడలేకపోతున్నారు. దిగ్విజయ్ లాంటి నేతలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. స్వయానా సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఆర్థిక నేర ఆరోపణల్లో ఇరుక్కోవడంతో.. మాట మాట్లాడకుండా ఉన్నారు.

దేశ వ్యాప్తంగా ఎటు చూసినా ఇదే తీరు కనిపిస్తోంది. పైగా.. జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ నాయకుడు.. పార్టీకి ఆశాకిరణంగా ఉంటాడనుకున్న నేత సైతం.. బీజేపీ వైపే అడుగులు వేశారు. ఆయన రాహుల్ గాంధీకి దగ్గరివాడన్న ముద్ర కూడా ప్రభావం చూపించకుండా పోయింది. కమల్ నాథ్ కు దక్కిన ప్రాధాన్యం… సోనియా అహంకారం… సోనియా రాజకీయ అజ్ఞానం… పార్టీలో సింధియాకు ఎదురైన ఘోర అవమానాలు… సింధియాను బీజేపీకి దగ్గరయ్యేలా చేశాయి. కాంగ్రెస్ నాయకత్వం.. ఊహించని ఈ పరిణామంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోవడం ఇతరులకు షాకింగ్ వార్తేమో కానీ… కాంగ్రెస్ నాయకత్వానికి కాదు. నిజానికి సింధియా వెళ్లిపోయాడా? లేక పొమ్మనలేక పొగబెట్టారా? అర్థంకాని పరిస్థితి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన సింధియాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా మొండిచేయి చూపారు. ఆ తరువాత పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రాజ్యసభ సీటు కూడా ఇవ్వమని తేల్చేశారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో సింధియా పార్టీ నుంచి వెళ్లిపోయాడు అంటే సింధియా తప్పా? రాజకీయ అజ్ఞాని సోనియా తప్పా? రాజకీయాల్లో ఇప్పటికీ ఏబీసీడీలు నేర్చుకోకుండా… ఏ ఎన్నికల్లోనూ గెలవలేని మహా నాయకులు కొందరితో పార్టీని నడిపిస్తున్న సోనియా గాంధీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేము.

మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ పైనే బీజేపీ గురి అని గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో.. పార్టీని ఎలా కాపాడుకోవాలన్నదే ఇప్పుడు సోనియా అండ్ కో.. దృష్టి సారించాల్సి ఉంది. ఇంకా.. ప్రియాంక గాంధీ పూర్తి స్థాయిలో నాయకురాలిగా ఎదగని తరుణంలో.. బీజేపీ ఎత్తులకు రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో పై ఎత్తులు వేయలేని పరిస్థితుల్లో.. కాంగ్రెస్ నావ గమనం గందరగోళంగా తయారైంది. ఇది ఎటు దారి తీస్తుందన్నదీ.. దేశ వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ కేడర్ ను అయోమయానికి గురి చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News