జీరో ఎఫ్‌ఐఆర్‌కు ఏపీ నిర్ణయం... జీరో ఎఫ్‌ఐఆర్‌ అంటే...

ఏపీ ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్యురాలి హత్యోదంతం నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌ను స్వీకరించాల్సిందిగా అన్ని పోలీస్‌ స్టేషన్లకు ఆదేశాలు ఇచ్చినట్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు. సాధారణంగా కిడ్నాప్‌ గానీ, యాక్సిడెంట్‌ గానీ, ఏదైనా దాడి గానీ జరిగిన వెంటనే బాధితులు దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటారు. కానీ ఘటన జరిగిన చోటు తమ స్టేషన్‌ పరిధిలోకి రాదు […]

Advertisement
Update:2019-12-02 14:44 IST

ఏపీ ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్యురాలి హత్యోదంతం నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌ను స్వీకరించాల్సిందిగా అన్ని పోలీస్‌ స్టేషన్లకు ఆదేశాలు ఇచ్చినట్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు.

సాధారణంగా కిడ్నాప్‌ గానీ, యాక్సిడెంట్‌ గానీ, ఏదైనా దాడి గానీ జరిగిన వెంటనే బాధితులు దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటారు. కానీ ఘటన జరిగిన చోటు తమ స్టేషన్‌ పరిధిలోకి రాదు అంటూ ఫిర్యాదును తీసుకోకుండా పోలీసులు నిరాకరిస్తుంటారు. దాంతో బాధితులు మరో స్టేషన్‌కు పరుగులు తీయాల్సిన పరిస్థితి.

ముఖ్యంగా సిటీల్లో, సరిహద్దుల్లో, కొత్త ప్రాంతాలకు వెళ్లిన సమయంలో నేరాలు జరిగినప్పుడు ఆ ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్‌ కిందకు వస్తుందో చెప్పలేని స్థితి. దాంతో ఏదో ఒక స్టేషన్‌కు బాధితులు వెళ్తుంటారు. అక్కడ పోలీసులు మాత్రం నేరం జరిగిన ప్రాంతం తమస్టేషన్ పరిధిలో లేదంటూ తిప్పిపంపుతుంటారు.

ఇలా తమ పరిధిలోకి నేరం జరిగిన ప్రాంతం రాదు అంటూ పోలీసులు తిరస్కరించడం, బాధితులు పలు పోలీస్ స్టేషన్లకు తిరిగే లోపే నేరస్తులు తప్పించుకుపోతుంటారు. హైదరాబాద్‌లో వైద్యురాలు మిస్సింగ్ వ్యవహారంలో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు కూడా నేరం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదు అంటూ తిప్పిపంపారు. ఈ ఆలస్యం కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న విమర్శ బలంగా ఉంది.

ఈ నేపథ్యంలో జీరో ఎఫ్‌ఐఆర్‌కు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలు చేస్తే ఏ స్టేషన్లోనైనా బాధితులు ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఒకవేళ తమ పరిధిలోకి రాదు అని పోలీసులు అంటే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా కోరవచ్చు.

జీరో ఎఫ్‌ఐఆర్‌కు విజ్ఞప్తి చేస్తే వెంటనే తప్పనిసరిగా ఫిర్యాదును స్వీకరించి… ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదును బదిలీ చేస్తారు. దీన్ని వల్ల సకాలంలో బాధితులకు అండ లభించేందుకు అవకాశం ఉంటుంది. జీరో ఎఫ్‌ఐఆర్‌ను ఢిల్లీ, ముంబాయిలో ఇప్పటికే పక్కాగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో వైద్యురాలి హత్య నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జీరో ఎఫ్‌ఐఆర్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News