ఎల్వీ బదిలీ వెనుక అసలు కారణాలు....
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకుందన్న దానిపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎల్వీ బదిలీ వెనుక చాలా కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. జగన్ వేగంగా పాలనలో సంస్కరణలు చేయాలనుకుంటుంటే… ఎల్వీ సుబ్రమణ్యం మాత్రం అందుకు తగ్గట్టు వేగంగా స్పందించడంలేదన్న విమర్శ తొలి నుంచీ ఉంది. పైగా ముఖ్యమంత్రి ఆదేశాలనే ప్రశ్నార్థకం చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా […]
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకుందన్న దానిపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎల్వీ బదిలీ వెనుక చాలా కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు.
జగన్ వేగంగా పాలనలో సంస్కరణలు చేయాలనుకుంటుంటే… ఎల్వీ సుబ్రమణ్యం మాత్రం అందుకు తగ్గట్టు వేగంగా స్పందించడంలేదన్న విమర్శ తొలి నుంచీ ఉంది. పైగా ముఖ్యమంత్రి ఆదేశాలనే ప్రశ్నార్థకం చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా చిన్న చిన్న ఫైళ్లను కూడా క్లియర్ చేయకుండా కొర్రి వేస్తుంటారన్న అపవాదు ఎల్వీపై ఉంది.
ఆరోగ్య శాఖలో సంస్కరణకు సంబంధించి ఒక జీవో విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రే కోరినా దానికి విపరీతమైన జాప్యం చేశారని చెబుతున్నారు. సీఎస్ తీరుపై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా విస్మయం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఫైళ్లను వేగంగా ఎందుకు కదపడం లేదన్న ఆవేదన మంత్రుల్లో ఉంది. ఒక విధంగా ముఖ్యమంత్రి అధికారాలనే హేళన చేసేలా ఎల్వీ ప్రవర్తించారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం ఆలోచన విధానాలకు అనుగుణంగా కాకుండా… తన ఆలోచన విధానాలకు అనుగుణంగా అధికారులను నడిపించేందుకు ఎల్వీ ఇష్టపడేవారన్న విమర్శ కూడా వినిపిస్తోంది.
ఉగాది నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చూడాల్సిందిగా ఇటీవల సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశించగా… పక్కనే ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం అంతకంటే ముందు డంపింగ్ యార్డులను గుర్తించేందుకు ప్రాధాన్యత ఇవ్వండి అంటూ కలెక్టర్లను ఆదేశించారు.
దాంతో సీఎం వెంటనే జోక్యం చేసుకుని సుబ్రమణ్యం అన్న చెప్పింది కూడా ముఖ్యమే… కాకపోతే ఇళ్ల స్థలాల ఎంపికకే తొలి ప్రాధాన్యత ఇవ్వండి అంటూ కలెక్టర్లకు మరోసారి ఆదేశించాల్సి వచ్చిందని చెబుతున్నారు.
జీవోల జారీకి ఎల్వీ సుబ్రమణ్యం వద్ద విపరీతమైన జాప్యం జరగడం, దాని వల్ల అనుకున్న సమయానికి నిర్ణయాలు అమలు చేయకపోతున్నామన్న అసంతృప్తితో ముఖ్యమంత్రి ఉన్నారట.
ఇందుకోసమే ప్రవీణ్ ప్రకాశ్ ద్వారా కొన్ని అంశాలపై వేగంగా ముందుకు కదిలేందుకు ప్రయత్నించారు సీఎం. వైఎస్ఆర్ అవార్డు అంశాన్ని కేబినెట్ భేటీకి ముందు సీఎస్, సీఎంవో అధికారుల సమక్షంలోనే ముఖ్యమంత్రి చర్చించారు. కేబినెట్‌లో దాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరగా… అందుకు సీఎస్ కూడా అంగీకరించారని చెబుతున్నారు.
కానీ ఆతర్వాత ఆ ఫైల్‌ను వెనక్కు పంపారు సీఎస్. దీంతో దాన్ని సీఎం ఆదేశాల మేరకు ప్రవీణ్ ప్రకాశ్ నేరుగా దాన్ని కేబినెట్‌లో ప్రవేశపెట్టారు. గ్రామ న్యాయాధికారుల నియామకానికి ఓకే చేసిన ముఖ్యమంత్రి… దానిపై మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కోరారు. దాంతో సీఎంవో ఆ ఫైల్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టింది.
వైఎస్‌ఆర్ అవార్డు ఫైల్‌ను కేబినెట్ ముందు ఉంచడం, న్యాయాధికారుల నియామక పైల్‌ను పెట్టకపోవడంపై ఎల్వీ … ప్రవీణ్ ప్రకాశ్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు చెబుతున్నారు. సీఎం ఆదేశాలతో ప్రవీణ్ ప్రకాశ్ అలా చేశారని తెలిసి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయడం ద్వారా పరోక్షంగా ముఖ్యమంత్రికి ఎల్వీ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు అయింది. దాంతో ఇక పనికాదనుకున్న ప్రభుత్వం ఎల్వీపై బదిలీ వేటు వేసింది.