ఇసుక మాఫియా రాజకీయాలకు... ఈ నెలాఖరుతో స్వస్తి

ఏపీని రాజకీయ ఇసుక తుఫాను చుట్టుముట్టింది. ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుంటుపడిదంటూ రాజకీయ ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి, అక్రమాలు లేకుండా ప్రజలకు సులువుగా ఇసుక సరఫరా చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టడంలో భాగంగా ఇసుక తవ్వకాలు నిలిపివేయగా అదే సమయంలో వరదలు ముంచెత్తడం సమస్యకు కారణమయ్యింది. ఇందులో ప్రభుత్వ వైఫల్యం లేదనే చెప్పాలి. ప్రజలకు మేలు చేసేందుకు మెరుగైన విధానం కోసం ప్రయత్నించే క్రమంలో కొంత జాప్యం జరిగింది… ఆ తరువాత వరదలు […]

Advertisement
Update:2019-11-05 05:35 IST

ఏపీని రాజకీయ ఇసుక తుఫాను చుట్టుముట్టింది. ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుంటుపడిదంటూ రాజకీయ ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి, అక్రమాలు లేకుండా ప్రజలకు సులువుగా ఇసుక సరఫరా చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టడంలో భాగంగా ఇసుక తవ్వకాలు నిలిపివేయగా అదే సమయంలో వరదలు ముంచెత్తడం సమస్యకు కారణమయ్యింది.

ఇందులో ప్రభుత్వ వైఫల్యం లేదనే చెప్పాలి. ప్రజలకు మేలు చేసేందుకు మెరుగైన విధానం కోసం ప్రయత్నించే క్రమంలో కొంత జాప్యం జరిగింది… ఆ తరువాత వరదలు ముంచెత్తడం వల్ల ఇసుక కొరత ఎదురయ్యింది. ఇది దాదాపు తాత్కాలికం. వరదలు తగ్గగానే ఇసుక సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ పక్షాలు ప్రధానంగా తెలుగుదేశం, జనసేన ప్రజాందోళన రంగు పూస్తున్నాయి.

నిజానికి గత మూడు నెలుగా కొనసాగుతున్న వరద వల్ల రాష్ట్రం ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉండడంతో పాటు భవిష్యత్తులో ఇసుక కొరత లేనివిధంగా వేలకొద్ది టన్నుల ఇసుక ప్రతీ ప్రాంతానికి తరలివచ్చింది.

ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సులభంగా ఇసుకను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం వికటించి చివరకు రాజకీయంగా ప్రభుత్వానికి సమస్య, సవాలుగా మారింది.

అక్రమాలను అదుపు చేసి ప్రజలకు తక్కువ ధరకు లభించే విధానం తీసుకురావాలనే ప్రయత్నం ఆచరణలో జాప్యం కావడంతో పాటు అందుకు ఊహించని విధంగా మూడు నెలల పాటు వరదలు ప్రధాన నదుల్లో కొనసాగడంతో అసలు ఇసుకే లభించని పరిస్థితి తలెత్తి మొత్తం ప్రభుత్వం ఇసుక సమస్యలో కూరుకుపోయినట్లయ్యింది.

చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రజలకు మేలు చేయాలనే ప్రయత్నం ఓవైపు…. కొందరు అధికారులు, మంత్రుల నిర్లిప్తత…. మరోవైపు ప్రకృతి సహకరించకపోవడం కలిసి చివరకు రాజకీయ సమస్యగా మారింది. ఈ ఇసుక తుఫాను సుడిగుండంలో ప్రభుత్వం ఇరుక్కుంటుందా? లేక టీ కప్పులో తుఫానులాగా సద్దుమణుగుతుందా? చూడాలి.

తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక మాఫియా

వాస్తవానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక విక్రయాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. వారికి ఇసుక పెద్ద ఆదాయ వనరుగా మారింది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేల వరకు ఇసుక అక్రమ వ్యాపారంలో భాగస్వాములుగా వున్నారని నాటి ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వారు రహస్య నివేదిక అందించారు కూడా. ఇసుక అక్రమార్కుల పాలిట వరంగా వినియోగదారుల పాలిట శాపంగా మారింది.

గ్రామ నాయకుల నుంచి చంద్రబాబు తనయుడు లోకేష్ వరకు అక్రమ దందాతో సంబంధాలున్నట్లు పలుమార్లు వెల్లడయింది. కొందరైతే మాఫియా తరహాలో ఇసుకను అక్రమంగా టన్ను ధరను వేల రూపాయల వరకు ధర పలికేలా చేసి మొత్తం ఇసుక వ్యాపారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొన్నారు. అప్పట్లో ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా విక్రయాలు, ఉచితంగా ఇసుక అంటూ విధానాలు ప్రకటించినప్పటికీ ప్రజలకు అందింది మాత్రం శూన్యం. ఇసుక బకాసురులుగా నాటి తెలుగుదేశం నేతలు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు.

ఈ క్రమంలో అడ్డు వచ్చిన అధికారులను బదిలీలు చేయించడం, దాడులు చేయించడం జరిగాయి. నాటి అధికార పార్టీకి చెందిన చింతమనేని ప్రభాకర్ ఏకంగా తహసీల్దార్ వనజాక్షి ని ఈడ్చి కొట్టడం, ఈ ఘటనను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకేసుకు రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన విషయం తెలిసిందే.

కొత్త ప్రభుత్వం ఇసుక పాలసీ వివాదం…

కొత్త ఇసుక పాలసీ శుభపరిణామమే… అయితే హఠాత్తుగా ఇసుక సరఫరాను పూర్తిగా రద్దుచేయడంతో ఒక్కసారిగా భవన నిర్మాణాలు ఆగిపోయి ఆ రంగంలో పని చేస్తున్న లక్షలాది కార్మికులకు పనిలేకుండా పోయింది. ఆ తర్వాత ఎన్నడూ లేనివిధంగా వానలు కురవడంతో వంకలు, వాగులు, నదులు పొంగి ప్రవహించాయి. దీంతో కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

ఇదే అదునుగా టీడీపీ, జనసేన పార్టీలు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇసుక మీద రచ్చ చేయడం ప్రారంభించాయి. వ్యక్తిగత కారణాలు, కుటుంబ సమస్యలతో కూడా ఆత్మహత్యలకు పాల్పడిన వారిని ఇసుక ఆత్మహత్యలుగా చిత్రీకరించి ఆందోళనల పేరుతో గొడవలు చేయడం ప్రారంభించారు. దీనికి తోడు పచ్చ మీడియా అండ ఎటూ వుండనే వుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ త్వరగా అమలయితే అధికారుల ప్రమేయం తగ్గడం, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా పోవడం జరిగి ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు గతం కంటే చౌకగా ఇసుక లభిస్తుంది.

ఇసుక ప్రస్తుత పరిస్థితి

267 ఇసుక రీచులలో 207 రీచులు (దాదాపు 80 శాతం) భారీ వరదల కారణంగా నీటిలో మునిగి ఉన్నాయి. కేవలం 60 రీచుల నుండి మాత్రమే ఇసుక దొరుకుతోంది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరిలో 40 రోజులుగా భారీ వరద కొనసాగుతుంది. వాగులు, వంకలు నదులు ఉప్పొంగి 4200 టీఎమ్ సీ ల నీళ్లు సముద్రంలో కలిసాయి. గత ప్రభుత్వ హయాంలో కరువు, వానలు లేవు కాబట్టి ఇసుక ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేది.

అక్రమ రవాణాపై చర్యలు…..

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ద్వారా పారదర్శకంగా వినియోగదారులకు ఇసుకను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని కొందరు ఆన్ లైన్ మోసం ద్వారా పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు.

ఆన్ లైన్ లో బల్క్ బుకింగ్ లలో పలువురు బ్రోకర్లు వేర్వేరు అడ్రస్ లతో ఇసుకను బుక్ చేస్తూ.. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రకంగా నకిలీ ఐడిలతో ఇసుకను బుకింగ్ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిపై పోలీస్, మైనింగ్ అధికారులు జరిపిన విచారణలో గుంటూరు కేంద్రంగా కిషోర్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడయ్యింది.

సుమారు 1.27 లక్షల రూపాయల విలువైన ఇసుకను కిషోర్ నకిలీ ఐడిలతో బుక్ చేసినట్లు గుర్తించారు. కిషోర్ అక్రమంగా తరలించేందుకు సిద్దం చేసిన 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్ లను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు.

అలాగే గన్నవరంకు చెందిన దుర్గారావు అనే వ్యక్తిని కూడా గుర్తించారు. బినామీ పేర్లతో 3.80 లక్షల రూపాయల విలువైన ఇసుకను దుర్గారావు ఆన్ లైన్ లో బుక్ చేశారు. మీసేవ ఆపరేటర్ గా పనిచేస్తున్న దుర్గారావు బ్రోకర్లతో కుమ్మకై ఈ మేరకు మోసానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. దీనిపై కిషోర్, దుర్గారావులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ఆన్ లైన్ ద్వారా వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ఐపిలను గుర్తించడం ద్వారా ఇటువంటి మోసాలకు చెక్ పెట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు.

భవిష్యత్తులో ఇసుకకు కొరత లేదు…

తాజా వరదల కారణంగా నదుల్లో దాదాపు పది కోట్ల టన్నుల ఇసుక మేట వేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారని అన్నారు. అంటే మరో అయిదేళ్లకు సరిపడ్డ ఇసుక నిల్వలు రాష్ట్రంలో వున్నాయని తెలిపారు.

ఇప్పటికే 1295 మంది బల్క్ కన్స్యూమర్ లకు అయిదు లక్షల టన్నుల ఇసుకను అందించామని తెలిపారు. మరో పదిహేను రోజుల్లో వరదలు కూడా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని, ఇసుక రీచ్ ల నుంచి వరదనీరు తగ్గగానే కావాల్సినంత ఇసుకను వినియోగదారులకు అందచేస్తామని వెల్లడించారు.

ఇప్పటివరకు 1.70 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేయడం జరిగిందని వెల్లడించారు. ఇసుక కావలసినవారు sand.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News