జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దేశంలో సరికొత్త అధ్యాయానికి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారని బీసీ సంఘాల నాయకుడు, మాజీ శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. “దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది” అని కృష్ణయ్య కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులతో పాటు వివిధ కాంట్రాక్టులలో 50 శాతం రిజర్వేషన్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ, మహిళలకు […]

Advertisement
Update:2019-07-24 03:01 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దేశంలో సరికొత్త అధ్యాయానికి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారని బీసీ సంఘాల నాయకుడు, మాజీ శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు.

“దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది” అని కృష్ణయ్య కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులతో పాటు వివిధ కాంట్రాక్టులలో 50 శాతం రిజర్వేషన్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ, మహిళలకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టింది.

ఈ అంశంపై ఓ చానల్ నిర్వహించిన చర్చాగోష్టిలో బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, మహిళలు ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధార పడ్డారని, ఆ సంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చరమగీతం పాడారని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుతో బీసీలలో మరింత చైతన్యం వస్తుందని కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బిల్లును తెలుగుదేశం పార్టీతో సహా కొందరు వ్యతిరేకించడాన్ని ఆర్.కృష్ణయ్య ఖండించారు.

“బిల్లును ఎలా అమలు చేయాలో సలహాలు ఇవ్వాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దాలి. అంతే కానీ ఈ బిల్లును వ్యతిరేకించడం వెనుకబడిన వర్గాలను అవమానించడమే” అని ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.

చర్చలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నేత కోట సాయి కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులు సక్రమంగా అమలు చేయాలని ఆకాంక్షించారు.

“ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు నామినేటెడ్ పదవులలోను, కాంట్రాక్టులలోను 50 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది. ఇది ఆయా వర్గాలకు ఎంతో మేలు చేస్తుంది” అని బిజెపి నేత కోట సాయి కృష్ణ అభిప్రాయపడ్డారు.

స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు చెందిన వారు అధికారాన్ని చేపట్టినా రిమోట్ కంట్రోల్ మాత్రం వేరే వారి చేతుల్లో ఉంటోందని, దానిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక నామినేటెడ్ పోస్టులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని బిజెపి నాయకుడు కోట సాయి కృష్ణ సూచించారు. చర్చలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయుడు వాసిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బిల్లును సక్రమంగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ బిల్లు దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు.

ముఖ్యంగా మహిళలకు కేటాయించిన పదవులు కానీ, పనులు కానీ వారి పేరుతో మరొకరు అనుభవించే అవకాశం ఉందని వాసిరెడ్డి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News