కేంద్రంతో కేసీఆర్‌ ఢీ

తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య భూముల విషయంలో అంతర్యుద్ధం నడుస్తోంది. కొత్త సచివాలయం నిర్మాణం కోసం తాము అడిగిన రక్షణ శాఖ భూమిని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కేసీఆర్‌ గుర్రుగా ఉన్నారు. 44వ నంబరు జాతీయ రహదారి (హైదరాబాద్‌-నాగ్‌పుర్‌)పై స్కైవే నిర్మించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానం, రక్షణ శాఖకు చెందిన 200 ఎకరాల భూమిని ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ మంత్రులు, ఎంపీలు పలుమార్లు […]

Advertisement
Update:2019-07-22 04:52 IST

తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య భూముల విషయంలో అంతర్యుద్ధం నడుస్తోంది. కొత్త సచివాలయం నిర్మాణం కోసం తాము అడిగిన రక్షణ శాఖ భూమిని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కేసీఆర్‌ గుర్రుగా ఉన్నారు. 44వ నంబరు జాతీయ రహదారి (హైదరాబాద్‌-నాగ్‌పుర్‌)పై స్కైవే నిర్మించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానం, రక్షణ శాఖకు చెందిన 200 ఎకరాల భూమిని ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

తెలంగాణ మంత్రులు, ఎంపీలు పలుమార్లు కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినా ఈ భూములను అప్పగించేందుకు కేంద్రం సుముఖంగా కనిపించడం లేదు. దాంతో కేసీఆర్‌ కూడా కేంద్ర ప్రాజెక్టులకు తెలంగాణలో భూముల కేటాయింపును పెండింగ్‌లో పెట్టేశారు.

వికారాబాద్‌ దామగుండం వద్ద రాడార్‌ సమాచార కేంద్రం స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల క్రితం 2934 ఎకరాల అటవీ భూమిని నౌకాదళానికి సూత్రప్రాయంగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేంద్రం నిధులు కూడా కేటాయించింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన భూములను రక్షణ శాఖ కేటాయించేందుకు విముఖంగా ఉన్న నేపథ్యంలో రాడార్‌ కేంద్రానికి భూముల కేటాయింపును తెలంగాణ ప్రభుత్వం పక్కనపెట్టింది. భూముల అంశంపై ఇటీవల నేవీ అధికారులు… రాష్ట్ర అధికారులను కలిసినప్పుడు వారు అసలు విషయం వివరించారు.

సమస్య క్లిష్టంగా మారడంతో ఈస్టర్న్‌ నేవీ వైస్‌ అడ్మిరల్‌ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలిసేందుకు సమయం కోరారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని, నిరసనను సీఎస్ స్పష్టంగా తెలియజేయనున్నారు.

రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించకపోవడం వల్లే తాము ఈ వైఖరి తీసుకున్నామని కేంద్రానికి అర్ధమయ్యేలా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాడార్‌ కేంద్రానికి సంబంధించిన భూముల కేటాయింపే కాకుండా… కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మరో ఎనిమిది భూ కేటాయింపుల ప్రతిపాదనలను కూడా తెలంగాణ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడికి కేంద్రం దిగివస్తుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News