ఇలా అయితే.... తెలుగు రాష్ట్రాలను కరువు కబళించడం ఖాయం !

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను కరువు ముంచనున్నదా..? వ్యవసాయ పనులు ప్రారంభించి నెలరోజుల పైనే అయినా వర్షపు జాడ లేకపోవడంతో రెండు రాష్ట్రాలలోను వ్యవసాయపు పనులు ముందుకు సాగడంలేదు. దుక్కి దున్నిన తెలుగు రైతు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్న సందర్భం. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించాల్సిన రైతులు వర్షాలు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో చాలా జిల్లాలలోను తగినంత వర్షపాతం లేదు. ఇది రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం నాడు […]

Advertisement
Update:2019-07-21 08:04 IST

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను కరువు ముంచనున్నదా..? వ్యవసాయ పనులు ప్రారంభించి నెలరోజుల పైనే అయినా వర్షపు జాడ లేకపోవడంతో రెండు రాష్ట్రాలలోను వ్యవసాయపు పనులు ముందుకు సాగడంలేదు.

దుక్కి దున్నిన తెలుగు రైతు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్న సందర్భం. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించాల్సిన రైతులు వర్షాలు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాలలో చాలా జిల్లాలలోను తగినంత వర్షపాతం లేదు. ఇది రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం నాడు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో చురుకుగా కదులుతున్నాయంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ వర్షం కురిసింది. అయితే ఈ వర్షం నేల తడిసేందుకు కూడా సరిపోదని రైతులు అంటున్నారు.

తెలంగాణలోని అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఇప్పటికే కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. వారం రోజుల పాటు తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు పడితేనే ఈ ఏడాది గట్టెక్కుతామని రైతులు చెబుతున్నారు.

మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా కరువు వాతావరణమే నెలకొంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో కనీస వర్షపాతం కంటే అత్యల్ప వర్షపాతం నమోదైనట్టు విశాఖపట్నం వాతావరణ శాఖ పేర్కొంది.

ఉభయ గోదావరి జిల్లాలలోను ఎండలు మండిపోతున్నాయి తప్ప వర్షమే లేదు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఇప్పటికే పంట వేసిన రైతులు వర్షాలు లేక వాటర్ ట్యాంకులతో తమ పొలాలకు నీరు అందిస్తున్నారు.

రాయలసీమ జిల్లాలలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని చోట్ల కనీసం వ్యవసాయ పనులే చేపట్టలేదని చెబుతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.

ఈ పరిస్ధితి ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాలను కరువు కబళించడం ఖాయమని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News