చంద్రబాబు చేసింది తక్కువ... చెప్పుకున్నది ఎక్కువ " ప్రొఫెసర్ నాగేశ్వర్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పాలనలో చేసింది తక్కువ… చెప్పుకున్నది ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. “ చంద్రబాబు నాయుడు తన పాలనలో ఏం చేశారో చెప్పడం కంటే… ప్రతిపక్షాన్ని విమర్శించడానికే సమయం అంతా కేటాయించారని… అదే ఆయన ఓటమికి కారణం అయ్యింది” అని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషించారు. బుధవారం ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి ఓటమితో […]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పాలనలో చేసింది తక్కువ… చెప్పుకున్నది ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. “ చంద్రబాబు నాయుడు తన పాలనలో ఏం చేశారో చెప్పడం కంటే… ప్రతిపక్షాన్ని విమర్శించడానికే సమయం అంతా కేటాయించారని… అదే ఆయన ఓటమికి కారణం అయ్యింది” అని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషించారు.
బుధవారం ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి ఓటమితో పాటు జాతీయ స్థాయిలో బీజేపీ విజయాన్ని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ సమీక్షించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నారని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఎన్నికల్లో అది ఏమి పనికి రాలేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలు భవిష్యత్ రాజకీయాలకు ఉపకరిస్తాయని ఆయన తెలిపారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఓటింగ్ సరళిని మార్చేసిందని, కొన్ని రాష్ట్రాలలో కంచుకోటగా ఉన్న కొన్ని పార్టీలను కూడా ఆ ఓటింగ్ సరళి దెబ్బ తీసిందని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు. “కమ్యూనిస్టులు బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. ఇదే బీజేపీ ఓటింగ్ సరళికి నిదర్శనం” అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రోజురోజుకు బల పడుతుంటే మిగిలిన ప్రతిపక్షాలు మాత్రం బలహీన పడుతున్నాయని నాగేశ్వరరావు చెప్పారు. గత భారతీయ జనతా పార్టీకి, నేటి బీజేపీకి ఎక్కడా పోలికలు లేవని, ఆ పార్టీ కొత్త వ్యూహాలు రూపొందిస్తూ ముందుకు వెళుతోందని నాగేశ్వర్ స్పష్టం చేశారు.