నేడు జాతీయ పార్టీల కీలక సమావేశం
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు విడివిడిగా కీలక సమావేశాలను నిర్వహించనున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు జాతీయస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో నేడు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. లోక్ […]
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు విడివిడిగా కీలక సమావేశాలను నిర్వహించనున్నాయి.
లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు జాతీయస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో నేడు సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. లోక్ సభ, రాజ్యసభ సమావేశాలలో నిర్వహించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు.
బిజెపి నుంచి లోక్ సభకు ఎన్నికైన సభ్యుల్లో ఎక్కువమంది కొత్త వారే కావడంతో సభలో ఎలా ప్రవర్తించాలో, ప్రతిపక్షాలను ఎలా ఇరుకున పెట్టాలో వారికి బోధిస్తారు. ఇదే సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి, పార్లమెంట్ సభ్యులుగా అక్కడ అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై కూడా నరేంద్ర మోడీ దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు.
వివిధ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న వారితో ఎలా మెలగాలో చెబుతూనే ఆయా రాష్ట్రాల్లో పార్టీ పటిష్టత కోసం ఏం చేయాలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఏఐసిసి కార్యవర్గ సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి శాసనసభ, లోక్ సభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సమావేశం కానుంది. పార్టీ అధ్యక్ష పదవి బాధ్యత నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగాలంటూ ఇప్పటికే అనేకమంది రాజీనామాలు చేశారు.
ఇలాంటి కీలక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓ సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగడంతో పాటు రానున్న అయిదేళ్లలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కూడా చర్చించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపైన కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సమావేశం ఒక విధంగా రానున్న ఐదేళ్లలో ఆ పార్టీ పనితీరును, కార్యక్రమాలను రూపకల్పన చేస్తుంది.
ఇదే సమావేశంలో పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వంటి పదవులపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.