టీఆర్ఎస్ తడబడుతోందా ?
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాంటి పాత్ర పోషించబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫెడరల్ ఫ్రంట్ స్థాపించి కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ భావిస్తున్నప్పటికీ, ఆ ప్రయత్నాలేవీ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీంతో గులాబీ దళపతి డోలాయమానంలో పడిపోయారని చెబుతున్నారు. కేసీఆర్ ప్రతిపాదనల మీద దక్షిణాది నేతలలోనే సయోధ్య కుదరడం లేదు. ఇక ఉత్తరాది నేతలు కలిసివస్తారనే నమ్మకం కూడా కనిపించడం లేదని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు జాతీయ […]
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాంటి పాత్ర పోషించబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫెడరల్ ఫ్రంట్ స్థాపించి కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ భావిస్తున్నప్పటికీ, ఆ ప్రయత్నాలేవీ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
దీంతో గులాబీ దళపతి డోలాయమానంలో పడిపోయారని చెబుతున్నారు. కేసీఆర్ ప్రతిపాదనల మీద దక్షిణాది నేతలలోనే సయోధ్య కుదరడం లేదు. ఇక ఉత్తరాది నేతలు కలిసివస్తారనే నమ్మకం కూడా కనిపించడం లేదని చెబుతున్నారు.
ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీలకు అనుకూలంగా రాకపోతేనే ప్రాంతీయ పార్టీలు తృతీయ ప్రత్యామ్నాయాల వైపు చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అప్పుడు కూడా కేసీఆర్ తో ఎన్ని పార్టీలు కలిసి వస్తాయో అనుమానమేనని చెబుతున్నారు.
అందుకే ఆయన ఈ మధ్య కాలంలో అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు సమాన దూరం పాటిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోయే అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. అందుబాటులో ఉన్న ఓ సమాచారం ప్రకారం.. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ అత్యధికంగా ఎంపీ సీట్లు గెలుచుకునే పరిస్థితులు ఉన్నాయని దాదాపుగా అన్ని సర్వేలు సూచిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కేసీఆర్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.
మరోవైపు బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించకపోవడంతో కేసీఆర్ కాంగ్రెస్ కు స్నేహ హస్తం చాచారనే వార్తలూ వస్తున్నాయి. కేసీఆర్ తమతో ఉంటే జగన్ కూడా తమ వైపే వస్తారని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. తెర వెనుక ఏం జరుగుతోందో తెలియడం లేదుగానీ, కేసీఆర్ మాత్రం దేశ పర్యటనకు బయలుదేరి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఏదేమైనా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఆయా అంశాల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీ మాత్రం ఇంకా టీఆర్ఎస్ ను తన మిత్రపక్షంగానే భావిస్తోంది. బీజేపీ జాతీయ నాయకుల మాటల్లో ఈ విషయం ఎప్పటికప్పుడు తేలిపోతూనే ఉంది. వాటిని ఖండించకుండా టీఆర్ఎస్ కూడా జాగ్రత్తలు పాటిస్తూనే ఉంది.
మొత్తానికి జాతీయ రాజకీయాలలో ఆ పార్టీ అడుగులు తడబడుతున్నాయనడంలో సందేహం లేదని పరిశీలకులు చెబుతున్న మాట.