మూడో విడత ఎవరిని ముంచుతుందో ?
దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లోక్ సభ స్థానాలలో పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకూ రెండు విడతలుగా జరిగిన లోక్ సభ ఎన్నికలలో 186 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఈ మూడో దశ పోలింగ్ లో 116 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ […]
దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లోక్ సభ స్థానాలలో పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకూ రెండు విడతలుగా జరిగిన లోక్ సభ ఎన్నికలలో 186 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఈ మూడో దశ పోలింగ్ లో 116 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని 26 లోక్ సభ నియోజకవర్గాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది. కేరళలో 20 నియోజక వర్గాలు, మహారాష్ట్రలో 14, కర్ణాటకలో 14, చత్తీస్ ఘఢ్ లో 7, ఒడిసాలో 6, బిహార్ లో 6, బెంగాల్ లో 5, అసోంలో 4, గోవాలో రెండు నియోజకవర్గాలకు ఈ మూడో దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఇవి కాక జమ్మూ కాశ్మీర్, దాదానగర్, హవేలీ, డయ్యూ డామన్ లలో ఒక్కో నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఒక నియోజకవర్గం, తమిళనాడులోని వేలూరు నియోజకవర్గంలోను వాయిదా పడిన పోలింగ్ ను కూడా ఈ మూడో దశ లోనే నిర్వహిస్తున్నారు.
తొలి రెండు దశలలో ను అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు కూడా దక్కవని వార్తలు వచ్చాయి. మూడో దశలో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ లో మాత్రమే భారతీయ జనతా పార్టీకి అనుకూలించే అవకాశం ఉందంటున్నారు. దక్షిణాదిలో కర్ణాటక, కేరళలలో మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాలలోనూ భారతీయ జనతా పార్టీకి అంతోఇంతో కలిసి వచ్చేది కర్ణాటకలో మాత్రమే అంటున్నారు. కేరళలో వామపక్ష పార్టీ మరోసారి ఆధిపత్యాన్ని చూపించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మూడో దశ పోలింగ్ జరుగుతున్న 116 స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసొచ్చే స్థానాలు కొన్ని ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ఒడిసా, బీహార్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో దశ పోలింగ్ ఎవరికి అనుకూలిస్తుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.