“దేశం” నేతలూ... ఏమిటీ ఆగడాలు? ప్రశ్నిస్తున్న ప్రజలు...!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ నాయకుల, అభ్యర్థుల బెదిరింపులు, హెచ్చరికలు, దాడులు చేయండి అంటూ కార్యకర్తలకు ఇస్తున్న సూచనలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో మెల్లిమెల్లిగా ప్రతి జిల్లాకు వ్యాపిస్తోంది అని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో పరాజయం తప్పదని అనుమానమో… లేదూ అధికారంలోకి తప్పకుండా వస్తామన్న ఆత్మవిశ్వాసమో కాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల బెదిరింపులు, హెచ్చరికలు మాత్రం నానాటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా బలహీనులు అనుకున్న […]

Advertisement
Update:2019-03-28 02:22 IST

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ నాయకుల, అభ్యర్థుల బెదిరింపులు, హెచ్చరికలు, దాడులు చేయండి అంటూ కార్యకర్తలకు ఇస్తున్న సూచనలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో మెల్లిమెల్లిగా ప్రతి జిల్లాకు వ్యాపిస్తోంది అని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో పరాజయం తప్పదని అనుమానమో… లేదూ అధికారంలోకి తప్పకుండా వస్తామన్న ఆత్మవిశ్వాసమో కాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల బెదిరింపులు, హెచ్చరికలు మాత్రం నానాటికీ పెరుగుతున్నాయి.

ముఖ్యంగా బలహీనులు అనుకున్న సామాజిక వర్గాల పైనా… అనుకూలంగా లేరు అనుకుంటున్న మీడియా పైనా తెలుగుదేశం నాయకులు ఎక్కువ బెదిరింపులకు పాల్పడుతున్నారంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా ఓ చానల్ ప్రతినిధులపై రాయడానికి వీలులేని భాషలో తిట్ల వర్షం కురిపించారు. “మీ చేతుల్లో ఉన్నాం రా మేము? బాంబులు వేస్తా. నరికేస్తా” అంటూ ఆ విలేకరులపై చేయి చేసుకున్నంత పని చేశారు. అంతవరకు ఆ విలేకరులు షూట్ చేసిన ఉదంతాన్ని కెమెరాల నుంచి తొలగించాలంటూ బెదిరించారు.

ఇక విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమ ఓ సామాజిక వర్గానికి చెందిన వైద్యుడిపై నానా దుర్భాషలు ఆడారు. “వాళ్ళకు ఓట్లు వేస్తారా. మీ సామాజిక వర్గం ఓట్లు వేస్తే వాడు గెలుస్తాడా. మీ సామాజిక వర్గం వారి తోలు తీస్తా” అంటూ మార్నింగ్ వాక్ కు వచ్చిన వందలాది మంది ముందు తీవ్రస్థాయిలో బెదిరించారు.

విజయవాడ సత్యనారాయణ పురంలో జరిగిన ఈ బెదిరింపు ఘటన అక్కడ ఎక్కువగా నివసిస్తున్న ఓ సామాజిక వర్గం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపించింది అంటున్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతం అని చెబుతున్నారు.

మరోవైపు కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఒకరు తన అనుచరులను కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేయండి అంటూ బహిరంగంగానే ప్రోత్సహించారు. “ పోలీసులతో నేను మాట్లాడతాను. ఎన్నికల వరకు ఏ ఒక్కరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. మనకు వ్యతిరేక వర్గం అయిన వారిని కొట్టండి. అవసరమైతే చంపేయండి” అంటూ తీవ్ర స్థాయిలో తమ కార్యకర్తలను ప్రోత్సహించారు. ఇలాంటివే మరెన్నో సంఘటనలు.

ఇంత జరుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు మాత్రం తమ నాయకులను కట్టడి చేసే ప్రయత్నాలు చేయటం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాపోతున్నారు. ఈ బెదిరింపు రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు అని భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News