నారాయణ... నారాయణ...! బెడిసికొట్టిన మంత్రాంగం!!
ఏపీలో మంత్రి నారాయణ ”చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాను”… అనుకుంటూనే సూప్‌లో పడ్డాడు. తాను తెరవెనుక ఉండి తోడల్లుడు బండి రామ్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్‌సీపీలోకి చేర్చాడు. ”తాము వ్యూహాత్మకంగా మంత్రి తోడల్లుడిని ఆ పార్టీకి దూరం చేస్తున్నాం” అనుకున్నట్లుంది వైఎస్ఆర్‌సీపీ కూడా. ఈ పరిణామం… నెల్లూరు జిల్లానే కాదు… ”ఏకంగా రాష్ట్రం మొత్తాన్ని ఒక్క కుదుపు కుదుపుతుంది” అని భావించింది వైసీపీ. ఈ వ్యూహం రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన మాట వాస్తవమే. తోడల్లుళ్ల మధ్య విభేదాలున్నాయా… అని […]
ఏపీలో మంత్రి నారాయణ ”చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాను”… అనుకుంటూనే సూప్‌లో పడ్డాడు. తాను తెరవెనుక ఉండి తోడల్లుడు బండి రామ్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్‌సీపీలోకి చేర్చాడు. ”తాము వ్యూహాత్మకంగా మంత్రి తోడల్లుడిని ఆ పార్టీకి దూరం చేస్తున్నాం” అనుకున్నట్లుంది వైఎస్ఆర్‌సీపీ కూడా.
ఈ పరిణామం… నెల్లూరు జిల్లానే కాదు… ”ఏకంగా రాష్ట్రం మొత్తాన్ని ఒక్క కుదుపు కుదుపుతుంది” అని భావించింది వైసీపీ. ఈ వ్యూహం రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన మాట వాస్తవమే. తోడల్లుళ్ల మధ్య విభేదాలున్నాయా… అని విశ్లేషకులు భృకుటి ముడివేశారు కూడా.
అయితే… మంత్రి నారాయణ నామినేషన్ వేసే ముందు ఇదే తోడల్లుడి ఇంటికి వెళ్లి, తోడల్లుడిని వెంట పెట్టుకుని మరీ వెళ్లాడు. అది ఆయన సెంటిమెంట్ అని చెబుతున్నారు బంధువులు. అంతటి సెంటిమెంట్ వర్కవుట్ అవుతున్న అనుబంధం వాళ్లది. నారాయణ రెండో భార్య ఇందిర చెల్లెలి భర్త రామ్మోహన్. ఇదీ వాళ్ల బంధుత్వం.
సోమిరెడ్డి బాటలో…
ఒక పార్టీలో పెద్ద హోదాలో ఉన్న నాయకులు… తమ పార్టీ ఎదురీదుతున్న రోజుల్లో తమ బంధుగణాన్ని అధికారంలోకి రాబోయే పార్టీల్లో చేర్చడం అనే వ్యూహాన్ని ఇటీవల అదే జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆచరణలో పెట్టాడు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన బావ కేతిరెడ్డి రామకోటారెడ్డిని ఇటీవల వైఎస్ఆర్‌సీపీలో చేర్చాడు. మంత్రి నారాయణ కూడా దాదాపుగా అలాంటి స్టెప్పే వేయబోయాడు. కానీ అది బెడిసి కొట్టింది.
ఆదాల కదుపుతున్న పావులివి
మంత్రి నారాయణను ఒక్కమాట అనకుండా, ఆయనకు అండగా ఉన్న ఒక్కొక్కరినీ దూరం చేయడం ద్వారా మంత్రిని శక్తి హీనుడిని చేయడానికి కంకణం కట్టుకున్నాడు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి.
ఇంటి బయట నుంచి మొదలు పెట్టడం కంటే ఇంటి లోపలి నుంచి మొదలు పెట్టడమే బెటర్ అనుకున్నట్లున్నాడు ఈ మాజీ మంత్రి. నారాయణ తోడల్లుడి నుంచి పావులు కదిపాడు. ఆ తోడల్లుడి మనసులో తన సొంతూరు మైపాడు గ్రామానికి సర్పంచ్ కావాలనే కోరిక ఉంది. వైఎస్ఆర్‌సీపీ విసిరన వలలో పడినట్లే పడుతూ… మంత్రి నారాయణ అనుమతి తీసుకుని… ”తన సర్పంచ్ కల నెరవేరడానికి అనువుగా మారుతున్నాయి పరిణామాలన్నీ” అనుకుంటూ వైసీపీ కండువా కప్పుకున్నాడు రామ్మోహన్.
మరో సంగతి ఏమిటంటే… రామ్మోహన్ సొంతూరు మైపాడు కోవూరు నియోజకవర్గంలో ఉంది. మంత్రి నారాయణ పోటీ చేస్తున్నది నెల్లూరు పట్టణంలో. కాబట్టి తోడల్లుళ్లిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ నేరుగా విభేదించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడి వరకు ఏ సీన్‌లోనూ మంత్రి నారాయణ పథకం బెడిసికొట్టినట్లు కనిపించడం లేదు. ట్విస్ట్ అంతా తదనంతర పరిణామాల్లోనే ఉంది.
వ్యూహం మీకేనా… మాకు ఉండదా?
మంత్రి నారాయణకు అండగా నిలుస్తున్న వారిలో సంప్రదాయ తెలుగుదేశం నాయకులున్నారు. మంత్రి నారాయణగా వ్యవహారంలోకి వచ్చిన పొంగూరు నారాయణ, నారాయణ విద్యాసంస్థల నారాయణ… ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఆయనకు మద్దతు ఇస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలతోపాటు నెల్లూరు పట్టణం, పరిసర గ్రామాల రెడ్లు కూడా ఉన్నారు. వాళ్లంతా రాజకీయ నేపథ్యం కలిగి దశాబ్దాలుగా వారసత్వ రాజకీయాలు నిర్వహిస్తూ, తమకంటూ సొంత ఓట్ బ్యాంకును కాపాడుకుంటున్న నాయకులే.
మంత్రి నారాయణ తన తోడల్లుడిని వైఎస్ఆర్‌సీపీలోకి చేర్చడంతో వాళ్లంతా ఒకసారి ”మనం కలిసి మాట్లాడుకోవలసిన అవసరం ఉందనే” ఆలోచనకు వచ్చారు. ”మీరేమో గెలిచే పార్టీలో కర్చీఫ్‌లు వేయడమూ, మేమేమో సొంత పార్టీ కోసం త్యాగాలు చేయడమూనా?” అని మంత్రిని నిలదీయడం లేదు. కానీ ఎవరికి వాళ్లు సొంత నిర్ణయాలకు సిద్ధమైపోతున్నారు. వాళ్లకు ఆదాల సెక్రటేరియట్ నుంచి రాయబారాలు మొదలైపోయాయి.
ఈ పరిణామాలన్నీ ఆదాల ప్రభాకర రెడ్డి చాపకింద నీరులా నడిపిస్తున్న వ్యూహంలో భాగమే. ఒకప్పుడు ఫెయిర్‌గా రాజకీయాలు నడిపిన ఆదాల ఇప్పుడు వ్యూహాత్మక రాజకీయానికి తెరతీశారు.