రాహుల్ సభ... రెండు లక్షలు... కాదు కాదు... రెండు వేలు!

వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీకి జాతీయ అధ్యక్షుడు. కాలం కలిసి వస్తే భావి భారత ప్రధాని. భారత తొలి ప్రధాని ముని మనవడు. దేశాన్ని గడగడలాడించిన ఓ మహిళా నాయకురాలికి మనవడు. ఆయనెవరో తెలిసే ఉంటుంది. అవును… ఆయనే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. త్వరలో జరగనున్న లోక్ స‌భ‌ ఎన్నికలకు తెలంగాణలో పార్టీ వ్యూహాలను, విజయ పథకాలను రూపొందించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో చర్చించేందుకు శనివారం నాడు హైదరాబాద్ […]

Advertisement
Update:2019-03-09 05:09 IST

వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీకి జాతీయ అధ్యక్షుడు. కాలం కలిసి వస్తే భావి భారత ప్రధాని. భారత తొలి ప్రధాని ముని మనవడు. దేశాన్ని గడగడలాడించిన ఓ మహిళా నాయకురాలికి మనవడు. ఆయనెవరో తెలిసే ఉంటుంది. అవును… ఆయనే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. త్వరలో జరగనున్న లోక్ స‌భ‌ ఎన్నికలకు తెలంగాణలో పార్టీ వ్యూహాలను, విజయ పథకాలను రూపొందించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో చర్చించేందుకు శనివారం నాడు హైదరాబాద్ వస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భారీ ఎత్తున పెద్ద సమావేశం నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించారు. శనివారం సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకున్న తర్వాత అక్కడికి సమీపంలోనే ఒక బహిరంగ సభను నిర్వహించాలని కూడా నిర్ణయించారు. దాదాపు రెండు లక్షల మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వ‌హించాల‌నుకున్న ఈ భారీ బహిరంగ సభకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది అంటున్నారు.

తెలంగాణలోని 119 శాసనసభా నియోజకవర్గాల నుంచి, 17 లోక్ సభ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున నాయకులను, కార్యకర్తలను తరలించాలని ముందుగా నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే పరిస్థితి మాత్రం అందుకు అనుకూలంగా లేదు అంటున్నారు. రాహుల్ గాంధీ సభకు భారీగా రావాలంటూ వివిధ జిల్లాలకు చెందిన నాయకులకు తెలంగాణ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

ఇది జరిగి వారం రోజులైనా గురువారం ఉదయం వరకు ఏ ఒక్క నాయకుడు నుంచి సరైన స్పందన రాలేదని చెబుతున్నారు. దీంతో రెండు లక్షల మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించాలనుకున్న భారీ బహిరంగ సమావేశాన్ని రెండు వేలకు కుదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

భారీ బహిరంగ సభ స్థానంలో కేవలం చేవెళ్ల లోక్ స‌భ‌ స్థానం పరిధిలోని నియోజకవర్గాల నుంచి రెండు వేల మంది నాయకులు, కార్యకర్తలను సమావేశ పరిచి రాహుల్ సమక్షంలో తూతూమంత్రంగా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. భారీ సభకు అవసరమైన కార్యకర్తలను తరలించేందుకు తమ వద్ద ఆర్థిక వనరులు లేవని, ఉన్న కాసిన్ని డబ్బులు ఇటీవల జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఖర్చు చేశామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసినట్లు చెప్తున్నారు.

చివరి క్షణంలో తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ సభను కార్యకర్తల సమావేశంగా మార్చేసి చేతులు దులుపుకోవాలని నిర్ణయించుకుందని చెబుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలనే తెలంగాణలోనూ ఎదుర్కొంటోందని, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయే రోజులు త్వరలోనే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News