క్రీడారంగంలోనూ భారత మహిళల జోరు

దేశానికే గర్వకారణం భారత మహిళా మణులు క్రికెట్ నుంచి టీటీ వరకూ, బ్యాడ్మింటన్ నుంచి బాక్సింగ్ వరకూ హోరు పురుషుల కంటే మహిళలు నెగ్గిన స్వర్ణాలే ఎక్కువ                       మహిళ.. ప్రేమ, దయ, మాతృత్వానికి ప్రతీక. కుటుంబం కోసం అహరహం శ్రమించే మానవతామూర్తి. అందరికీ ఓ రోజు ఉన్నట్లే మహిళకు సైతం… ప్రపంచ మహిళా దినోత్సవం పేరుతో ఓ రోజంటూ ఉంది. ప్రతి ఏడాది మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుకగా […]

Advertisement
Update:2019-03-08 00:32 IST
  • దేశానికే గర్వకారణం భారత మహిళా మణులు
  • క్రికెట్ నుంచి టీటీ వరకూ, బ్యాడ్మింటన్ నుంచి బాక్సింగ్ వరకూ హోరు
  • పురుషుల కంటే మహిళలు నెగ్గిన స్వర్ణాలే ఎక్కువ

మహిళ.. ప్రేమ, దయ, మాతృత్వానికి ప్రతీక. కుటుంబం కోసం అహరహం శ్రమించే మానవతామూర్తి. అందరికీ ఓ రోజు ఉన్నట్లే మహిళకు సైతం… ప్రపంచ మహిళా దినోత్సవం పేరుతో ఓ రోజంటూ ఉంది.

ప్రతి ఏడాది మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోడం ఆనవాయితీగా వస్తోంది. రంగం ఏదైనా పురుషులతో సమానంగా మహిళలూ రాణిస్తూ… ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు.

భారత మహిళల జోరు…

మహిళలు వంటింటికే పరిమితమయ్యే రోజులు పోయాయి. రంగం ఏదైనా పురుషులతో సమానంగా రాణిస్తూ మహిళలా .. మజాకానా! అనుకొనే రోజులు వచ్చాయి. భారత మహిళలు క్రీడారంగంలో సైతం అబ్బురపరచే విజయాలు సాధిస్తూ దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు.

క్రికెట్ నుంచి టేబుల్ టెన్నిస్ వరకూ….బ్యాడ్మింటన్ నుంచి బాక్సింగ్ వరకూ వివిధ క్రీడాంశాలలో అసాధారణంగా రాణిస్తూ తమకు తామే సాటిగా నిలుస్తున్నారు.

పురుషులను మించిన మహిళలు….

ఒలింపిక్స్, ఆసియాక్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ యూత్ గేమ్స్, క్రికెట్ ప్రపంచకప్…ఇలా పలు రకాల అంతర్జాతీయ క్రీడల్లో భారత మహిళలు అంచనాలకు మించి రాణిస్తూ వారేవ్వా! అనిపించుకొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత మహిళల ఉనికిని చాటుచెబుతున్నారు.

బలమైన కుటుంబవ్యవస్థ, సాంప్రదాయాలు, కట్టుబాట్లకు మరో పేరైన భారత్ లో…మహిళలు వివిధ రంగాలతో పాటు క్రీడారంగంలో సైతం కళ్లు చెదిరే విజయాలు సాధిస్తున్నారు.

మహిళలకు తగిన ప్రోత్సాహం అందిస్తే పురుషులతో సమానంగా రాణించగలరని గత ఏడాది ముగిసిన పలు అంతర్జాతీయ క్రీడల్లో పతకాల మోత మోగించడం ద్వారా నిరూపించుకొన్నారు.

ఇద్దరూ ఇద్దరే….

అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళలు నిలకడగా రాణిస్తున్న క్రీడల్లో బ్యాడ్మింటన్ గురించే ముందుగా చెప్పుకోవాలి. ఒలింపిక్ మెడలిస్టులు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఒకరికి ఒకరు తీసిపోని విధంగా రాణిస్తూ దేశానికి పతకాల పంట పండిస్తున్నారు.

భారత మహిళా బ్యాడ్మింటన్ తొలి సూపర్ స్టార్, వెటరన్ సైనా నెహ్వాల్…గాయాల నుంచి తేరుకొని…ప్రతికూల పరిస్థితులను అధిగమించడమే కాదు… ఏకంగా కామన్వెల్త్ క్రీడల స్వర్ణంతో పాటు…ఆసియాక్రీడల కాంస్య పతకాన్ని సైతం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది.

మరోవైపు…..తెలుగు తేజం పీవీ సింధు మాత్రం సిల్వర్ క్వీన్ స్థాయి నుంచి గోల్డెన్ స్టార్ స్థాయికి చేరుకోగలిగింది. గత ఏడాది పొడుగునా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలతో పాటు.. పలు సూపర్ సిరీస్ టోర్నీల్లో ఏకంగా ఐదు రజత పతకాలు సాధించింది. అంతేకాదు…చైనా వేదికగా ముగిసిన సీజన్ ముగింపు ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీలో సింధు విశ్వరూపమే ప్రదర్శించింది.

గ్రూప్ లీగ్ నుంచి..ఫైనల్స్ వరకూ తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా బంగారు పతకం అందుకొంది. ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్ ప్లేయర్ గా సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది.

ప్రపంచ నంబర్ వన్ తాయ్ జు ఇంగ్, జపాన్ జోడీ నజోమీ ఒకుహర, యమగుచి, ప్రపంచ మాజీ చాంపియన్ ఇంటానెన్ రచనోక్ లాంటి ప్రపంచ మేటి ప్లేయర్లను మట్టికరిపించి…తానేమిటో నిరూపించుకొంది. ఫైనల్ ఫోబియాను అధిగమించడమే కాదు…. విజేతగా స్వర్ణ పతకమూ అందుకోగలనని తొలిసారిగా సింధు చాటి చెప్పింది.

మేరీ గోల్డ్….

ముష్ఠిఘాతాల క్రీడ బాక్సింగ్ అనగానే…భారత బాక్సింగ్ ఎవర్ గ్రీన్ క్వీన్ మేరీకోమ్ మాత్రమే ముందుగా గుర్తుకు వస్తుంది. ముగ్గురు బిడ్డల తల్లిగా ఓ వైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే …మరోవైపు ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ లో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

భారత మహిళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మేరీకోమ్ గురించి ఎంత చెప్పుకొన్నా అదితక్కువే అవుతుంది. ప్రపంచ అమెచ్యూర్ మహిళా బాక్సింగ్ లో ఆరుసార్లు విశ్వవిజేతగా బంగారు పతకాలు సాధించిన ఘనత మేరీకోమ్ కు మాత్రమే దక్కుతుంది.

వరుసగా ఏడు ప్రపంచకప్ పోటీల్లో ఆరు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించిన అరుదైన, అసాధారణ రికార్డు కూడా మేరీకోమ్ కు మాత్రమే సొంతం న్యూఢిల్లీ వేదికగా ముగిసిన 2018 మహిళా ప్రపంచ బాక్సింగ్ మహిళల 48 కిలోల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్ బాక్సర్ హన్నాను 5-0తో చిత్తు చేయటం ద్వారా…మేరీ ఆరో బంగారు పతకం సొంతం చేసుకొంది.

ప్రపంచ మహిళా బాక్సింగ్ చరిత్రలోనే ఆరు ప్రపంచ స్వర్ణాలు, ఓ రజతంతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించిన ఏకైక.. ఒకే ఒక్క బాక్సర్ గా రికార్డు నెలకొల్పింది.

క్రికెట్లో భారత మహిళా పవర్…

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో సైతం భారత మహిళలు చెలరేగిపోతున్నారు. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అన్న తేడాలేకుండా రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులు సాధించడం ద్వారా తమ సత్తాను చాటి చెప్పారు.

కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన టీ-20 మహిళా ప్రపంచకప్ టోర్నీలో శతకం సాధించిన భారత తొలిమహిళగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్- బీ ప్రారంభలీగ్ పోటీలో…న్యూజిలాండ్ బౌలర్లను హర్మన్ ప్రీత్ ఓ ఆటాడుకొంది.

వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్ లో 171 పరుగులు సాధించిన హర్మన్ ప్రీత్…2018 టీ-20 ప్రపంచకప్ లో సైతం శతకం బాదడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

ఇక…భారత ఎవర్ గ్రీన్ క్రికెటర్ మిథాలీ రాజ్…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలను అధిగమించి… టీ-20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచింది.

భారత వెటరన్ క్రికెటర్ మిథాలీ రాజ్… ధూమ్ ధామ్ టీ-20, వన్డే ఫార్మాట్లలో రికార్డుల మోత మోగిస్తే… వన్డే క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సైతం భారత మహిళలు టాప్ ర్యాంకులు సాధించారు.

మరోవైపు… మహిళా క్రికెట్ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ లో సైతం భారత మహిళలే అగ్రస్థానంలో నిలిచారు. వన్డే బ్యాటింగ్ విభాగంలో భారత టీ-20 కెప్టెన్ స్మృతి మంథానా, బౌలింగ్ విభాగంలో వెటరన్ జులన్ గోస్వామి టాప్ ర్యాంకర్లుగా ఉన్నారు.

ఆసియా క్రీడల్లో భారత మహిళలా…. మజాకానా….

బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్ క్రీడల్లో మాత్రమే కాదు… ఆసియాక్రీడల్లోనూ భారత మహిళలు పతకాలు సాధించి…దేశప్రతిష్టను ఇనుమడింపు చేశారు. పురుషుల కంటే తామే నయమని చాటుకొన్నారు.

జకార్తా ఆసియాక్రీడల్లో భారత్ సాధించిన మొత్తం 15 స్వర్ణ పతకాలలో….అధిక భాగం…అసోం, బెంగాల్, ఒడిషా, హర్యానా, గుజరాత్, పంజాబ్, కేరళ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా అథ్లెట్లే సాధించడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్ గురికి చెందిన స్వప్న బర్మన్…ఏడు అంశాల సమాహారమైన హెప్టాథ్లాన్ లో బంగారు పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత క్రీడా చరిత్రలోనే ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా నిలిచింది.

ఇక…అసోం రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల రన్నర్ హిమ దాస్…మహిళల 400 మీటర్ల పరుగులో రజతం, మిక్సిడ్ రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల రిలేలో బంగారు పతకాలు సాధించి సంచలనం సృష్టించింది. ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన హిమా దాస్ ఏకంగా మూడు పతకాలతో దేశానికే వన్నె తెచ్చింది.

ఒడిషా రాష్ట్రంలోని ఓ చేనేత కుటుంబానికి చెందిన ద్యుతీ చంద్ సైతం…మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు అంశాలలో రజత పతకాలు సాధించడం ద్వారా తనవంతు పాత్ర నిర్వర్తించింది. 20 సంవత్సరాల తర్వాత 100, 200 మీటర్ల పరుగులో భారత్ కు జంట రజతాలు సాధించి పెట్టింది.

షూటింగ్ లో బంగారు గురి…

షూటింగ్ రైఫిల్, పిస్టల్ విభాగాలలోనూ భారత మహిళలు బంగారు గురితో దూసుకుపోతున్నారు. దేశానికి పతకాల పంట పండిస్తున్నారు.

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ మహిళల షూటింగ్ 10 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ షూటింగ్ లో స్వర్ణ పతకం సాధించిన మను బాకర్ వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే.

గాడల్ జరాలో ముగిసిన ప్రపంచ షూటింగ్ పోటీల టీమ్, వ్యక్తిగత విభాగాలలో బంగారు పతకాలు సాధించడం ద్వారా…భారత సీనియర్ షూటింగ్ జట్టులోకి దూసుకొచ్చిన మను బాకర్… 2018 కామన్వెల్త్ గేమ్స్ వ్యక్తిగత విభాగంలో సైతం స్వర్ణ పతకం సాధించి తనకు తానేసాటిగా నిలిచింది. ప్రపంచ షూటింగ్ పోటీలలో సైతం సరికొత్త రికార్డు నమోదు చేసింది.

టీటీ క్వీన్ మనీకా బాత్రా….

భారత మహిళా టేబుల్ టెన్నిస్ క్వీన్ మనీకా బాత్రా రికార్డుల మోత మోగించింది. ప్రపంచ మహిళా టీటీ మొదటి 50 మంది అత్యుత్తమ ప్లేయర్ల జాబితాలో చోటు సంపాదించింది.

ప్రపంచ టీటీ సమాఖ్య ప్రకటించిన అంతేకాదు…గోల్డ్ కోస్ట్ వేదికగా గత ఏడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో మనీకా బాత్రా ఏకంగా నాలుగు పతకాలు సాధించింది. ఇందులో మహిళల సింగిల్స్, టీమ్ విభాగాల బంగారు పతకాలు సైతం ఉన్నాయి.

జకార్తా ఆసియా క్రీడల్లో సైతం మనీకా మిక్సిడ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సంపాదించింది. తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ తో కలసి జంటగా మిక్సిడ్ డబుల్స్ బరిలోకి దిగిన మనీకా బ్రాంజ్ మెడల్ అందుకొంది.

పరిమిత అవకాశాలు…. అపరిమిత విజయాలు….

జనాభా పరంగా… ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లో సగం మంది మహిళలే ఉన్నారు. జనాభాకు తగ్గట్టుగా ప్రోత్సాహం, అవకాశాలు లేకపోయినా… పరిమిత అవకాశాలను సద్వినియోగం చేసుకొని… అపరిమిత విజయాలు సాధించిన సైనా,సింధు, మిథాలీ, మేరీ కోమ్, మను బాకర్ లాంటి మహిళా మణులకు… ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుగ్లోబల్.. హృదయపూర్వక అభినందనలు చెబుతోంది.

Tags:    
Advertisement

Similar News