సిడ్నీ వన్డేలో రికార్డుల మోత

100 వికెట్ల భువీ, 10 వేల పరుగుల ధోనీ, 22 శతకాల రోహిత్ ఆస్ట్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ ను…రెండోర్యాంకర్ టీమిండియా ఓటమితో మొదలు పెట్టింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ముగిసిన పోటీలో ఆతిథ్య ఆస్ట్రేలియా ….34 పరుగులతో టీమిండియాను కంగు తినిపించి..1-0 ఆధిక్యత సంపాదించింది. హాండ్స్ కోంబ్ టాప్ …. ఈ మ్యాచ్ లో ముందుగా కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న కంగారూ టీమ్…50 ఓవర్లలో 5 వికెట్లకు 288 పరుగులు సాధించింది. వన్ […]

Advertisement
Update:2019-01-13 03:06 IST
  • 100 వికెట్ల భువీ, 10 వేల పరుగుల ధోనీ, 22 శతకాల రోహిత్

ఆస్ట్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ ను…రెండోర్యాంకర్ టీమిండియా ఓటమితో మొదలు పెట్టింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ముగిసిన పోటీలో ఆతిథ్య ఆస్ట్రేలియా ….34 పరుగులతో టీమిండియాను కంగు తినిపించి..1-0 ఆధిక్యత సంపాదించింది.

హాండ్స్ కోంబ్ టాప్ ….

ఈ మ్యాచ్ లో ముందుగా కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న కంగారూ టీమ్…50 ఓవర్లలో 5 వికెట్లకు 288 పరుగులు సాధించింది. వన్ డౌన్ క్వాజా, రెండో డౌన్ షాన్ మార్ష్, మూడో డౌన్ ఆటగాడు హాండ్స్ కోంబ్ హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా తమజట్టుకు మ్యాచ్ విన్నింగ్ స్కోరు అందించారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, కుల్దీప్ చెరో రెండువికెట్లు పడగొట్టారు.

టాపార్డర్ టపటపా

సమాధానంగా 289 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా ఒకదశలో 4 పరుగులకే ఓపెనర్ శిఖర్ ధావన్, వన్ డౌన్ విరాట్ కొహ్లీ, రెండో డౌన్ అంబటి రాయుడు వికెట్లు కోల్పోయి ఎదురీత ప్రారంభించింది. రోహిత్ శర్మ, ధోనీ…4వ వికెట్ కు 137 పరుగుల భాగస్వామ్యంతో పరిస్థితి చక్కదిద్దినా…ఓటమి తప్పలేదు.

రోహిత్ శర్మ 133, ధోనీ 51 పరుగులు మినహా మిగిలిన టాపార్డర్ ఆటగాళ్లు తేలిపోయారు. ఆస్ట్రేలియా యువఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్స్ సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని రెండో వన్డే ఈనెల 15న అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతుంది.

రోహిత్ 22వ శతకం…

289 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా 254 పరుగులు మాత్రమే చేసినా…ఓపెనర్ రోహిత్ మాత్రం తన కెరియర్ లో 22వ శతకం నమోదు చేశాడు.

2019 సీజన్ ను సెంచరీతో మొదలు పెట్టాడు. ఓ వైపు వికెట్లు టపటపా రాలుతున్నా…రోహిత్ ఒంటరిపోరాటమే చేశాడు. ఒకదశలో టీమిండియా 4 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు కోల్పోయినా…. రోహిత్ సంయమనంతో ఆడాడు. ధోనీతో కలసి నాలుగో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.

తన కెరియర్ లో 194వ మ్యాచ్…188వ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ మొత్తం…110 బాల్స్ లో 4 సిక్సర్లు, 7 బౌండ్రీలతో 22వ వన్డే శతకం పూర్తి చేశాడు.చివరకు 133 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. రోహిత్ పోరాడి సెంచరీ సాధించినా టీమిండియా… సిరీస్ లో తొలివిజయం నమోదు చేయలేకపోయింది.

2017 తర్వాత ధోనీ తొలి అర్థశతకం…

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ..2017 సీజన్ తర్వాత…వన్డేల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ సాధించాడు.

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలివన్డేలో ధోనీ…96 బాల్స్ లో 3 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 51 పరుగులు సాధించాడు. టీమిండియా 4 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ….ఓపెనర్ రోహిత్ శర్మతో కలసి నాలుగో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.

తన వన్డే కెరియర్ లో 333వ మ్యాచ్ ఆడిన ధోనీ 282 వ ఇన్నింగ్స్ లో 68వ హాఫ్ సెంచరీ నమోదు చేయటం విశేషం. 2017 సీజన్లో ధర్మశాల వేదికగా శ్రీలంకపై తన చివరి హాఫ్ సెంచరీ సాధించిన ధోనీ…మరో అర్థశతకం కోసం 2019 సీజన్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

100 వికెట్ల క్లబ్ లో భువనేశ్వర్ కుమార్….

టీమిండియా ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్…వన్డే క్రికెట్లో వికెట్ల సెంచరీ సాధించిన బౌలర్లక్లబ్ లో చోటు సంపాదించాడు.

ఆస్ట్రేలియాతో తీన్మార్ సిరీస్ లో భాగంగా సిడ్నీలో ముగిసిన తొలివన్డేలో ..భువనేశ్వర్ ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్, టాప్ స్కోరర్ హ్యాండ్స్ కోంబ్ లను భువీ పడగొట్టాడు.

తన కెరియర్ లో 96వ వన్డే మ్యాచ్ ఆడిన భువనేశ్వర్ ఇప్పటి వరకూ 94 ఇన్నింగ్స్ లో 101వికెట్లు పడగొట్టినట్లయ్యింది. భువీ మొత్తం 10 ఓవర్లలో 66 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు.

10వేల పరుగుల ధోనీ….

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ…వన్డే క్రికెట్ 10వేల పరుగుల క్లబ్ లో చోటు సంపాదించాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన తొలివన్డేలో ధోనీ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో 10 వేల పరుగులు సాధించిన భారత ఐదో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. ధోనీకి ముందే 10వేల పరుగులు సాధించిన భారత క్రికెటర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ,రాహుల్ ద్రావిడ్, విరాట్ కొహ్లీ ఉన్నారు.

ధోనీ మొత్తం 282 ఇన్నింగ్స్ లో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలతో సహా 50 సగటు సంపాదించాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ధోనీ గతంలోనే 10 వేల పరుగులు సాధించాడు.

అయితే…2007లో ఆసియాలెవెన్ జట్టులో సభ్యుడిగా ఆడిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో సాధించిన 174 పరుగులను అప్పట్లో చేర్చలేదు.

ఆ తర్వాత ఐసీసీ మినహాయింపు ఇవ్వడంతో కెరియర్ లో 10వేల పరుగుల రికార్డు సాధించినట్లయ్యింది. భారతజట్టు సభ్యుడిగా ఇప్పుడు 10 వేల పరుగుల రికార్డును పూర్తి చేయడం విశేషం.

సచిన్ 9….రోహిత్ 7

ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా వన్డేల్లో అత్యధికంగా 9 శతకాలు బాదిన రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉంది. అయితే…. టీమిండియా ప్రస్తుత ఓపెనర్ రోహిత్ శర్మ…7 సెంచరీలతో …మాస్టర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

సిడ్నీ వేదికగా ముగిసిన తొలివన్డేలో రోహిత్ శర్మ 133 పరుగులతో సెంచరీ సాధించాడు. కంగారూటీమ్ ప్రత్యర్థిగా రోహిత్ కు ఇది 7వ శతకం కావడం విశేషం.

కంగారూ గడ్డపై 36వ ఓటమి…

ఆస్ట్రేలియా గడ్డపై ..ప్రస్తుత సిడ్నీ వన్డే వరకూ…49 మ్యాచ్ లు ఆడిన టీమిండియాకు ఇది 36వ ఓటమి కావడం విశేషం. కంగారు గడ్డపై టీమిండియా 11 విజయాలు మాత్రమే ఉన్నాయి. మరో రెండుమ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి.

సిడ్నీ వేదికగా 17 మ్యాచ్ లు ఆడిన భారత్ కు ఇది 14వ పరాజయం కాగా… రెండువిజయాలు మాత్రమే ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News