రోడ్డు రోలరు కింద నలిగిన అభ్యర్థులు
తెలంగాణలో ఇప్పుడు కారుకొచ్చిన కష్టాలే ఓ ఇరవై ఏళ్ల కిందట సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో సైకిల్‌కీ వచ్చాయి. బ్యాలెట్ పేపర్‌లో కారును పోలిన చక్రాల వాహనాల గుర్తులు ఉండడంతో కారు గుర్తుకు ఓటు వేయాలనుకున్న నిరక్షరాస్యులు, చూపు సరిగా ఆనని పెద్దవాళ్లు… ఇతర చక్రాల వాహనాలను కారుగా భ్రమ పడి ఓటేసేశారనేది ఇప్పుడు టీఆర్ ఎస్ వాదన. ఇందులో కొంత నిజం లేకపోలేదు. ఇప్పుడు కారుకు చుక్కలు చూపించిన రోడ్డు రోలరే అప్పట్లో సైకిల్‌కు కూడా బ్రేకులేసింది. అసలేం […]
తెలంగాణలో ఇప్పుడు కారుకొచ్చిన కష్టాలే ఓ ఇరవై ఏళ్ల కిందట సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో సైకిల్‌కీ వచ్చాయి. బ్యాలెట్ పేపర్‌లో కారును పోలిన చక్రాల వాహనాల గుర్తులు ఉండడంతో కారు గుర్తుకు ఓటు వేయాలనుకున్న నిరక్షరాస్యులు, చూపు సరిగా ఆనని పెద్దవాళ్లు… ఇతర చక్రాల వాహనాలను కారుగా భ్రమ పడి ఓటేసేశారనేది ఇప్పుడు టీఆర్ ఎస్ వాదన. ఇందులో కొంత నిజం లేకపోలేదు. ఇప్పుడు కారుకు చుక్కలు చూపించిన రోడ్డు రోలరే అప్పట్లో సైకిల్‌కు కూడా బ్రేకులేసింది.
అసలేం జరిగిందంటే…
అది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టి ఎన్ శేషన్ హవా నడిచిన సమయం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసే ఖర్చు మీద నిఘా ఎక్కువైంది. నిర్దేశిత ఖర్చు కంటే ఒక్క రూపాయి ఎక్కువగా ఖర్చు చేసినట్లు నిర్ధారణ అయినా ఆ అభ్యర్థి గెలుపును డిస్ క్వాలిఫై చేయవచ్చు. అంతకు ముందు కూడా ఆ నియమం ఉన్నప్పటికీ కొరడా ఝళిపించిన ఆఫీసర్ శేషనే. అప్పుడు అభ్యర్థుల వెన్నులో భయం పుట్టుకొచ్చింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చు పెట్టాలంటే కనీసం ప్రతి గ్రామాన్నీ విజిట్ చేయడం కష్టమే.
ఒక పార్లమెంట్ నియోజక వర్గంలో ఏకకాలంలో కనీసం నలభై కార్లు అయినా తిరగాలి, అన్ని కార్లనూ లెక్కలో చూపిస్తూ పోతే ఓ వారం లోనే ఖర్చు పరిమితి దాటి పోతుంది. దాంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమతోపాటు ఓ పది- పదిహేను మంది కార్యకర్తలతో నామినేషన్ వేయించేవారు. వాళ్ల పేరులో లెక్క చూపిస్తూ వాహనాలను తిప్పేవారు. అయితే ఆ వాహనాలకు తమ పార్టీ జెండాలుండవంతే. మనుషులు మాత్రం తన కోసం పని చేసే వారే. ఎన్నికల జాబితాలో మాత్రం వాళ్లంతా స్వతంత్ర అభ్యర్థులుగా నమోదయి ఉంటారు. బ్యాలెట్ పేపర్ల సైజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది అప్పటి నుంచే.
ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా నలభై మంది అభ్యర్థులు రంగంలో ఉండేవాళ్లు. ఇలాంటి క్రమంలో ఎలక్షన్ కమిషన్ సమాజంలో వాడుకలో ఉన్న వస్తువులన్నింటినీ ఎన్నికల గుర్తుల జాబితాలో చేర్చేసింది. అలా వచ్చి పడిందే రోడ్డురోలరు కూడా.
ఎనిమిది వేల ఓట్లు
దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతున్న రోజులవి. పార్లమెంటుకి మధ్యంతరం మీద మధ్యంతరం వచ్చి పడిన పరిస్థితులు. ఒక పార్లమెంట్ నియోజక వర్గంలో రోడ్డు రోలరు గుర్తుకి ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి. అది స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన గుర్తు. నిజానికి అతడు… అప్పుడు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖర్చు లెక్కల కోసం నామినేషన్ వేసిన డమ్మీ అభ్యర్థి. నిజానికి ఆ ఎనిమిది వేల ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు పడాల్సిన ఓట్లే. ఎందుకంటే ఆ ఓట్లు పడింది తెలుగుదేశం అభ్యర్థి సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో. వరుసగా కొన్ని బూత్‌లలో గంప గుత్తగా పడిన ఓట్లవి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో తెలుగుదేశం అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
అప్పుడూ ఇదే సీన్
ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్‌ని కలిసి స్వతంత్ర అభ్యర్థులకు సైకిల్ గుర్తును పోలిన గుర్తులను కేటాయించవద్దని విజ్ఞప్తి చేశారు. రోడ్డు రోలరుతో పాటు మోటారు సైకిల్, చక్రాల బండ్లను మినహాయించాల్సిందిగా కోరారు. అయితే ఇప్పటి తెలంగాణ ఎన్నికల్లాగ అప్పటి ఎనిమిది వేల ఓట్లు తెలుగుదేశం అభ్యర్థి తల రాతను మార్చలేదు. ఎందుకంటే సైకిల్ గుర్తుకి వచ్చిన ఓట్లకు రోడ్డు రోలరుకు పడిన ఎనిమిది వేలు కలుపుకున్నా సరే కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల దరిదాపులకు చేరలేదు. దాంతో అప్పటి తెలుగు దేశం అభ్యర్థిని ఎనిమిది వేల ఓట్లు కలత పెట్టినప్పటికీ కొత్తగా కన్నీళ్లు పెట్టించలేదు.