సిమ్లా... హనీ స్ప్రింగ్
సిమ్లా పట్టణం ప్రకృతి సిగలో తురిమిన నెలవంకలా ఉంటుంది. పట్టణం మొత్తం అర్ధచంద్రాకారపు పర్వత సానువులపై విస్తరించి ఉంటుంది. దేవదార్, పైన్ చెట్లు ఆకాశాన్నంటుకోవడానికి పెరుగుతున్నట్లుంటాయి. మంచు కొండల్లో కొమ్మలు పక్కలకు విస్తరించవు. నేరుగా పైకి పెరుగుతాయి. కేక్ మీద ఐస్ టాపింగ్ చేసినట్లుంటంది ఆకుల మీద మంచు. ఎటు చూసినా గడ్డకట్టిన మంచు, తెల్లగా రాసిపోసినట్లుంటుంది. హనీమూన్ కపుల్ మంచును చేత్తో తీసి పార్టనర్ మీద చల్లాలని సరదా పడినా సరే చేతికి రానంత గట్టిగా […]
సిమ్లా పట్టణం ప్రకృతి సిగలో తురిమిన నెలవంకలా ఉంటుంది. పట్టణం మొత్తం అర్ధచంద్రాకారపు పర్వత సానువులపై విస్తరించి ఉంటుంది. దేవదార్, పైన్ చెట్లు ఆకాశాన్నంటుకోవడానికి పెరుగుతున్నట్లుంటాయి. మంచు కొండల్లో కొమ్మలు పక్కలకు విస్తరించవు. నేరుగా పైకి పెరుగుతాయి.
కేక్ మీద ఐస్ టాపింగ్ చేసినట్లుంటంది ఆకుల మీద మంచు. ఎటు చూసినా గడ్డకట్టిన మంచు, తెల్లగా రాసిపోసినట్లుంటుంది. హనీమూన్ కపుల్ మంచును చేత్తో తీసి పార్టనర్ మీద చల్లాలని సరదా పడినా సరే చేతికి రానంత గట్టిగా రాయిలా ఉంటుంది. అంత మంచు పొరలను చీల్చుకుంటూ హాట్ స్ప్రింగ్ ఉంటుంది. దాని పేరు తత్తపాని హాట్ స్ర్పింగ్.
కల్కా నుంచే థ్రిల్ మొదలు
సిమ్లా ప్రయాణంలో కల్కా నుంచే ఆనందం మొదలవుతుంది. ఇక్కడి నుంచి నారోగేజ్ రూట్. టాయ్ ట్రైన్‌లో ప్రయాణం. కాలం కరిగిపోతున్నా దారి కరిగి పోకుండా ప్రయాణం సాగడం సాధారణంగా బోర్ కొడుతుంది కానీ కొత్త దంతపులకు, ప్రేమికులకు ప్రతి క్షణం ఎంజాయ్‌బుల్‌గా ఉంటుంది. ఎటు చూసినా హిమాలయ పర్వత శ్రేణులు, అడుడగుడునా బ్రిడ్జిలు, టన్నెల్‌ల మధ్య సాగుతుంది జర్నీ.
ఇంకా ప్రయాణం చాలా దూరం ఉంది కదా అని కళ్లు మూసుకుని ఐదు నిమిషాల తర్వాత తెరిస్తే కళ్ల ముందు చిమ్మ చీకటి భయపెడుతుంది. అప్పుడు ట్రైన్ టన్నెల్ గుండా వెళ్తుందన్న మాట. సిమ్లా- కల్కాల మధ్య 103 టన్నెళ్లు, 87 బ్రిడ్జిలు ఉన్నాయి. గ్రేటెస్ట్ నారో గేజ్ ఇంజనీరింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియా గా గిన్నెస్ బుక్‌లో రికార్డయిన రైలు మార్గం ఇది. ముందే తెలుసుకుని ప్రయాణం మొదలు పెడితే… ఇలాంటి వివరాలన్నీ పార్టనర్‌కి చెబుతూ గొప్పగా పోజు కొట్టవచ్చు కూడా. ఈ రూట్‌లో చాలా నదులుంటాయి.
ప్రయాణం కొండ పక్కగా కొంతసేపు సాగుతుంది, మరికొంత సేపు సొరంగంలో, కిటికీ లో నుంచి ఓపెన్‌గా కనిపించిందంటే… కిందకు చూస్తే నది ఉంటుంది. అందుకే ఈ ప్రయాణంలో ప్రతి నిమిషమూ అపురూపమైనదే. కొంతదూరం కొండల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ, కొన్ని కొండల కడుపును చీల్చుకుంటూ సాగే ప్రయాణం ఇది.
వేసవిలోనే కాదు వింటర్ విడిది కూడా
సిమ్లాను వేసవి విడిదిగా చూస్తారు, కానీ వింటర్లో సిమ్లా సౌందర్యం ఇనుమడిస్తుంది. ఈ పట్టణం ద్వైపాక్షిక ఒప్పందాలకు కూడా సాక్షి. ఇండియా నుంచి పాకిస్థాన్ వేరుపడడానికి జరిగిన ఒప్పందం, కాశ్మీర్ సమస్య మీద చర్చ ఇక్కడి వైస్‌రాయల్స్ భవనంలో జరిగాయి. పట్టణం మొత్తం కొండవాలులో విస్తరించి ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇళ్లు ఒకదాని మీద ఒకటి ఉన్నట్లు కనిపిస్తాయి.
సిమ్లాకి వెళ్లిన వాళ్లు మొదటగా మాల్ రోడ్‌కెళ్తుంటారు. షాపింగ్ చేసినా, చేయకపోయినా మాల్ అంతా తిరిగి చూడడం బాగుంటుంది. న్యూలీ మ్యారీడ్ కపుల్ గుర్రమెక్కి మాల్ అంతా చుట్టి, ఒక ఫొటో తీసుకుంటే జీవితకాలమంతా ఆ మధుర క్షణాలు గుర్తుండిపోతాయి. మాల్‌లో ఉలెన్ దుస్తులు చవగ్గా దొరుకుతాయి. మిగిలినవన్నీ తాకితే చెయ్యి కాలేటట్లు ఉంటాయి.
యాపిల్ పండ్ల సిమ్లా
సిమ్లా చుట్టు పక్కల యాపిల్ తోటలు ఎక్కువ. పర్యాటకులు ఎన్ని పండ్లను కోసుకున్నా ఏమీ అనరు స్థానికులు. అయితే పచ్చి కాయను మాత్రం ముట్టుకోనివ్వరు. ఈ టూర్‌లో స్కాండల్ పాయింట్‌ని మిస్ కాకూడదు. ఆ పాయింట్ నుంచి హిమాలయ పర్వతాలు అందంగా కనిపిస్తాయి. ఇక చర్చి, లైబ్రరీ, లక్కర్ బజార్ కూడా చూడాలి. లక్కర్ బజార్‌లో కొయ్యతో చేసిన హస్తకళాకృతులు ఉంటాయి. ఇక్కడ డ్రైఫ్రూట్స్ కూడా చవకే.
శ్యామల… సిమ్లా
టాక్సీలు కూడా ఉంటాయి. తత్తపాని హాట్ స్ప్రింగ్‌లో స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయని చెబుతారు. ఇక్కడ మరో సంగతి… మనం ఎప్పుడో పుస్తకాల్లో చదువుకుని మరిచిపోయిన బార్టర్ సిస్టమ్ సిమ్లాలో ఇంకా కొనసాగుతోంది. పర్యటన ఆద్యంతం తేనెలూరే చెలమను తలపిస్తుంది.
-మంజీర