తుస్సుమన్న చంద్రబాబు పోల్‌ మేనేజ్‌మెంట్‌

అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగినా ఉత్కంఠ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే స్థాయిలో ఉంది. నంద్యాల ఉప ఎన్నికల్లో తన పోల్ మేనేజ్‌మెంట్ కారణంగా పార్టీ విజయం సాధించిందని బహిరంగంగానే చెప్పుకున్న చంద్రబాబు… పోల్ మేనేజ్‌మెంట్‌పై పుస్తకాన్ని కూడా రాసి దాన్ని శ్రేణులను పంచిపెడతా అని చెప్పారు. నిజానికి చాలా మందికి చంద్రబాబు పాలన మీద కంటే ఆయన చేస్తారనుకుంటున్న పోల్‌ మేనేజ్‌మెంట్‌పైనే నమ్మకం ఎక్కువ. ఏపీలో ప్రతిపక్షానికి కూడా చంద్రబాబు పోల్‌ మేనేజ్‌మెంట్‌ పట్లే కాస్త భయం […]

Advertisement
Update:2018-12-13 06:53 IST

అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగినా ఉత్కంఠ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే స్థాయిలో ఉంది. నంద్యాల ఉప ఎన్నికల్లో తన పోల్ మేనేజ్‌మెంట్ కారణంగా పార్టీ విజయం సాధించిందని బహిరంగంగానే చెప్పుకున్న చంద్రబాబు… పోల్ మేనేజ్‌మెంట్‌పై పుస్తకాన్ని కూడా రాసి దాన్ని శ్రేణులను పంచిపెడతా అని చెప్పారు.

నిజానికి చాలా మందికి చంద్రబాబు పాలన మీద కంటే ఆయన చేస్తారనుకుంటున్న పోల్‌ మేనేజ్‌మెంట్‌పైనే నమ్మకం ఎక్కువ. ఏపీలో ప్రతిపక్షానికి కూడా చంద్రబాబు పోల్‌ మేనేజ్‌మెంట్‌ పట్లే కాస్త భయం ఉంది. ఎన్నికలు సజావుగా జరిగితే ఏపీలో ప్రజలు చంద్రబాబుకు ఓటు వేయరు కానీ… పోల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా ఫలితాలను తారు మారు చేస్తారేమో అన్న ఆందోళన వైసీపీలో ఉండేది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైసీపీలో ఉత్సాహాన్ని నింపాయన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు.

2019లో ఏపీలో ప్రయోగిస్తారనుకున్న పోల్‌ మేనేజ్‌మెంట్‌ను చంద్రబాబు … ముందుగానే తెలంగాణలో ప్రయోగించారు. దీంతో ఆయన పోల్‌ మేనేజ్‌మెంట్‌ స్టామినా ఎంతో ముందుగానే అర్థమైపోయింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి కూటమిని తెలంగాణలో తానే లీడ్ చేశారు.

పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే పత్రికలు, టీవీల్లో దాదాపు 15 రోజుల నుంచే భారీ ప్రకటనలతో అదర గొట్టారు. దాదాపు వెయ్యి కోట్లను చంద్రబాబు కూటమికి సరఫరా చేశారని కూడా చెబుతున్నారు. అసెంబ్లీని రద్దు చేసిన సమయంలో టీఆర్‌ఎస్‌కు వన్‌సైడ్‌గా ఉన్న వాతావరణం…. తీరా పోలింగ్ సమయానికి వచ్చే సరికి పూర్తిగా మారిపోయిందని టీఆర్‌ఎస్ నేతలు కూడా లోలోన భయపడే పరిస్థితిని చంద్రబాబు అండ్ టీం కృత్రిమంగా మీడియా సాయంతో సృష్టించగలిగింది.

అంతలోనే లగడపాటిని తెరపైకి తెచ్చి ఊగిసలాటలో ఉన్న ఓటర్లను మహాకూటమి వైపు మళ్లించేందుకు ప్రయత్నించారు. ఇన్ని చేసినా ఫలితం వన్‌సైడ్‌గా వచ్చేసింది. ఒకవేళ చంద్రబాబు అండ్ టీం అమలు చేసిన వ్యూహామే ఫలించి ఉంటే…. ఇక టీడీపీ నేతలు ఏపీలో మరింత దూకుడు పెంచేవారు. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తేనే తెలంగాణలో ఫలితం తారుమారు అయి ఉంటే… ఇక ఏపీలో అధికారం కోసం కొన్ని వేల కోట్లకు ఖర్చు పెట్టేందుకైనా టీడీపీ పెద్దలు సిద్ధపడేవారు.

టీడీపీ అభ్యర్థులు కూడా చంద్రబాబు పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఖచ్చితంగా ఫలిస్తుందన్న ఆలోచనతో ఒక్కో నియోజకవర్గంలో భారీగా డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధపడేవారు. తనకున్న మీడియా బలాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీపై విరుచుకుపడేవారు. ఒకవేళ తెలంగాణలో చంద్రబాబు చేసిన మహావ్యూహం ఫలించి ఉంటే వైసీపీ శ్రేణుల ఆత్మసైర్థ్యం కూడా దెబ్బతిని ఉండేది. అదే సమయంలో చంద్రబాబు తన వ్యూహాలకు తిరుగులేదని మరింత ధాటిగా వైసీపీని టార్గెట్‌ చేసి ఉండేవారు.

మహాకూటమి గెలిచి ఉంటే హైదరాబాద్‌ను కూడా బేస్‌ క్యాంప్‌ చేసుకుని వైసీపీపై టీడీపీ దాడి ఉండేది. మహాకూటమి గెలిచి ఉంటే చంద్రబాబును ఎన్నికల మాంత్రికుడిగా గుర్తించి జాతీయ పార్టీలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి. కానీ ఇప్పుడు మహాకూటమి ఘోరంగా ఓడిపోవడం, ఆ ఘోర ఓటమికి చంద్రబాబే కారణమని విమర్శలు వస్తుండడం ఇది నిజంగా చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసే పరిణామమే. ఇకపై జాతీయ పార్టీల వద్దకు చంద్రబాబు తలెత్తుకుని వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు.

నిన్ను నేను ప్రధానిని చేస్తా అంటూ రాహుల్‌ను చేయి పట్టుకుని నడిపించే దృశ్యాలు ఇక కనిపించకపోవచ్చు. గతంలో కంటే చంద్రబాబుతో కలిసిన తర్వాతే కాంగ్రెస్‌ పరిస్థితి తెలంగాణలో దారుణంగా తయారైందన్న అంశం తెలుసుకున్న తర్వాత రాహుల్‌ కూడా చంద్రబాబుపై నమ్మకాన్ని కోల్పోవచ్చు.

మహాకూటమి చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడంతో పాటు, తన పోల్ మేనేజ్‌మెంట్‌ విన్యాసాలకు షాక్‌ తగిలింది. జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పే పరిస్థితి లేకుండాపోయింది. ఇలా చంద్రబాబు పలు విధాలుగా మహాకూటమిలోకి దిగి దెబ్బతిన్నారు. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీకి కొండంత ఊరటే.

Tags:    
Advertisement

Similar News