భరతుడు
రామలక్ష్మణుల తోడపుట్టిన వాళ్లే భరత శతృఘ్నులు. మొత్తం నలుగురు అన్నదమ్ములు. మూడవ వాడే భరతుడు. దశరథ మహారాజుకూ కైకేయికీ పుట్టిన సంతానమే భరతుడు. రామలక్ష్మణుల్లానే భరత శతృఘ్నులు కలిసిమెలసి ఉండేవారు. జనకుడు సీతాదేవిని శ్రీరామునికిచ్చి వివాహం చేసినప్పుడే జనకుని సోదరుడు తన కుమార్తె మాండవిని భరతునికిచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత భరత శతృఘ్నులు మేనమామ ఇంటికి వెళ్లిపోయారు. దశరథ మహారాజు పెద్దకొడుకు శ్రీరామునికి యువరాజ్య పట్టాభిషేకం జరపాలని నిశ్చయించే సమయానికి భరతుడు లేడు. అయితే కైకేయి […]
Advertisement
రామలక్ష్మణుల తోడపుట్టిన వాళ్లే భరత శతృఘ్నులు. మొత్తం నలుగురు అన్నదమ్ములు. మూడవ వాడే భరతుడు.
దశరథ మహారాజుకూ కైకేయికీ పుట్టిన సంతానమే భరతుడు. రామలక్ష్మణుల్లానే భరత శతృఘ్నులు కలిసిమెలసి ఉండేవారు.
జనకుడు సీతాదేవిని శ్రీరామునికిచ్చి వివాహం చేసినప్పుడే జనకుని సోదరుడు తన కుమార్తె మాండవిని భరతునికిచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత భరత శతృఘ్నులు మేనమామ ఇంటికి వెళ్లిపోయారు. దశరథ మహారాజు పెద్దకొడుకు శ్రీరామునికి యువరాజ్య పట్టాభిషేకం జరపాలని నిశ్చయించే సమయానికి భరతుడు లేడు. అయితే కైకేయి తన కొడుకు భరతునికి పట్టాభిషేకం జరిపించాలని పట్టుపట్టింది. అలాగే రాముడు అరణ్యవాసం చేయాలని కోరింది. కైకేయి కోరిన కోరికకు ఇచ్చిన మాటను నెరవేర్చక తప్పని స్థితిలో దశరథుడు తలవంచాడు. పితృవాక్య పరిపాలకుడై అండవులకేగాడు రాముడు.
దుఃఖంతో ప్రాణాలొదిలిన దశరథుని మరణ వార్త విని భరత శతృఘ్నులు ఇంటికి వచ్చారు. భరతుడు తన పట్టాభిషేకానికి సంతోషపడలేదు. తండ్రి దశరథుని మరణానికీ రాముడు అరణ్య వాసానికీ తల్లి కైకేయినే నిందించాడు. తండ్రికి దహన సంస్కారాలు చేసి, అన్న రామయ్యని వెదుకులాడుతూ వెళ్లాడు భరతుడు.
భరతుడు గంగానదిని సమీపించే సరికి గుహుడు చూశాడు. శ్రీరామునితో యుద్ధానికే భరతుడు వెళుతున్నాడని అనుకున్నాడు. దాంతో నదిని దాటనీయనని అన్నాడు. శ్రీరాముని తిరిగి అయోధ్యకు తీసుకెళ్లాడానికే వచ్చానని చెప్పడంతో దారి విడిచాడు.
చిత్రకూటము దగ్గర రాముణ్ణి చూసిన భరతుడు దుఃఖంతో అన్నయ్యను పట్టుకుని ఏడ్చి – పాదాల మీద పడి – తిరిగి రాజ్యానికొచ్చి ఏలుకొమ్మని కోరాడు. తండ్రి మాట నెరవేర్చక తప్పదన్న రాముడు భరతునినే రాజ్యాన్ని పరిపాలించమని చెబుతాడు. రాముని పాదుకలు తెచ్చి సింహాసనం మీద పెట్టి రాముడు లేకపోయినా ఉన్నట్టే భావించాడు భరతుడు.
రావణుని యుద్ధంలో గెలిచి అయోధ్యకు తిరిగి వచ్చిన రామునికి ఎదురువెళ్లి స్వాగతం పలికాడు భరతుడు. రాజ్యాన్ని కూడా తిరిగి అప్పగించాడు. రాజ్య భారాన్ని వదిలించుకోవడం ద్వారా మనసులో భారాన్ని దించుకున్నాడు!
భరతునికి ఇద్దరు కొడుకులు. దక్షుడు, పుష్కలుడు. కొడుకులతో కలిసి భరతుడు రాముని ఆజ్ఞతో గార్గ్యుని వెంట గీకయరాజు మద్దతుగా వెళ్లాడు. గంధర్వ శైలూష పుత్రులను సంహరించి కొడుకులకు పుట్టముగట్టి తిరిగి అయోధ్యకు వచ్చేశాడు భరతుడు.
లక్ష్మణుని మరణానంతరం రామునితో ఉండి చివరకు సరయూ నదికి వెళ్లి తనువు చాలించాడు భరతుడు. విష్ణుమూర్తి శంకు చక్రాలే భరత శతృఘ్నులని పెద్దలు చెబుతారు.
– బమ్మిడి జగదీశ్వరరావు
Advertisement