అవసరం వచ్చినపుడు
మథురానగరంలో వాసవదత్త అన్న నర్తకి వుండేది. ఆమె అపురూప సౌందర్యరాశి. ఆమె కీర్తి దేశ దేశాలు వ్యాపించింది. ఆమె కళా కౌశలంతో అపార సంపద ఆమె వశమయింది. ఆమెకు అందరూ అడుగులకు మడుగు లత్తేవాళ్ళు, ఆమె కనుసన్నల్లో మెలిగేవాళ్ళు. ఆమె కటాక్ష వీక్షణాలకోసం ఎందరో సంపన్నులు ఎదురుచూసే వాళ్ళు. సామాన్యులకు ఆమె దర్శనమే కష్ట సాధ్యమయిన విషయం. వయసుతో, అభినయంతో, ఐశ్వర్యంతో ఆమె ఆకర్షణీయంగా వుండేది. ఒకరోజు ఆమె సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్ళతో తలస్నానం చేసి […]
మథురానగరంలో వాసవదత్త అన్న నర్తకి వుండేది. ఆమె అపురూప సౌందర్యరాశి. ఆమె కీర్తి దేశ దేశాలు వ్యాపించింది. ఆమె కళా కౌశలంతో అపార సంపద ఆమె వశమయింది. ఆమెకు అందరూ అడుగులకు మడుగు లత్తేవాళ్ళు, ఆమె కనుసన్నల్లో మెలిగేవాళ్ళు.
ఆమె కటాక్ష వీక్షణాలకోసం ఎందరో సంపన్నులు ఎదురుచూసే వాళ్ళు. సామాన్యులకు ఆమె దర్శనమే కష్ట సాధ్యమయిన విషయం. వయసుతో, అభినయంతో, ఐశ్వర్యంతో ఆమె ఆకర్షణీయంగా వుండేది.
ఒకరోజు ఆమె సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్ళతో తలస్నానం చేసి మేడపై తల ఆరబోసుకుంటోంది. పై నించీ సూర్యకిరణాలు ఆమె శిరోజాలపై పడి వెండిమెరుపులు మెరిపిస్తున్నాయి. దేవకన్య ఆకాశం నించీ దిగివచ్చినట్లుంది. ఎండవున్నా చల్లని గాలి వీస్తోంది. ఆమె మనసు ఉల్లాసంగా వుంది. అంతలో ఆమె చూపు వీధిలో వెళుతున్న ఒక వ్యక్తిపై పడింది.
అతను ఉపగుప్తుడు. బౌద్ధ సన్యాసి. కాషాయ వస్త్రాలు ధరించాడు. అతను సర్వసంగపరిత్యాగి. కానీ అతను గొప్ప అందగాడు. అతన్ని చూసి ప్రేమించని స్త్రీ పురుషులుండరు. అతని గంభీర ఆకారం, పెదాలపయి చిరునవ్వు చూసి అందరూ ముగ్ధులయ్యేవాళ్ళు. వాసవదత్త అతని గురించివిన్నది. ఎప్పటికయినా ఉపగుప్తుణ్ణి చూడాలని ఆమెకు గాఢమయిన కోరికవుంది. అట్లాంటిది ఉపగుప్తుణ్ణి కళ్ళ ఎదుట చూసి ఆమె కదిలిపోయింది.
అంతే! తనని తాను మరచిపోయి మెట్లు దిగి పరిగెత్తుకుంటూ ఉపగుప్తునికి ఎదురుగా వెళ్ళి ‘స్వామీ! మిమ్మల్ని చూడడం నా పూర్వజన్మ పుణ్యం. ఈ కనిపించే భవనం, నా సకలసంపదలు, ఈ అపూర్వ సౌందర్యం నిండిన నా శరీరం అన్నీ మీవే. దయచేసి నా యింటికి రండి. నా అణువణువూ మీ కోసం అల్లాడుతోంది’ అంది.
ఉపగుప్తుడు నిర్మలంగా కళ్ళు ఎత్తి ఆమెను చూసి, ఆమె ఉద్వేగాన్ని చూసి ‘వస్తాను అయితే యిప్పుడు కాదు’ అన్నాడు.
వాసవదత్త ‘మరి యిప్పుడు కాకుంటే ఎప్పుడు’ అంది ఆతృతగా
ఉపగుప్తుడు ‘నా అవసరం వచ్చినపుడు’ అని ముందుకు సాగిపోయాడు.
వాసవదత్త స్థాణువులా వుండిపోయింది. చేతికి చిక్కిన అదృష్టం క్షణంలో మాయమయిపోయినట్లయింది. ఉపగుప్తుని మాటల్ని మననం చేసుకుంటూ ‘వస్తానన్నాడు. కానీ అవసరం వచ్చినపుడు వస్తాననడమేమిటి? ఇక నా అంతటి ఐశ్వర్యవంతురాలికి అవసరమేముంటుంది?’ అనుకుంటూ తన మేడపైకి వెళ్ళింది.
కాలం ఆగదు కదా! కాలం ఎన్నో మార్పులు తెస్తుంది.
వాస్తవదత్త స్మృతి నించీ ఉపగుప్తుడు వెళ్ళిపోయాడు. ఆమె అందాల రాశి. పైగా నర్తకి. ఎందరో సంపన్న యువకులు ఆమె వెంటపడ్డారు. కొందర్ని దగ్గరికి చేర్చింది. కొందర్ని వదిలేసింది. వయసువుడిగిన తరువాత దాదాపు అందరూ ఆమెను వదిలేశారు. క్రమంగా ఆమెను ఐశ్వర్యం కూడా వదిలేసింది. వయసు వుడిగి పోయాకా ఆమె వైపు కన్నెత్తి చూసేవాళ్ళే కరువయ్యారు. వయసులో వున్న అలవాట్లు వయసు వుడిగాకా వదిలిపెట్టవు. ఆమె మద్యపానానికి, యితరమైన వాటికి అలవాటయి వున్న ఆస్థినంతా హారతి కర్పూరంలా ఖర్చు పెట్టింది.
ఆమె చివరిదశలో ఆమెకు యిల్లు లేదు. రోగాలతో శరీరం అందవికారంగా తయారయింది. తిండి కోసం ప్రతిపూటా యింటింటికీ తిరిగి బిచ్చమెత్తుకునేది. ఒకరోజు కుంటుకుంటూ బిచ్చమెత్తుకుంటూ వుంటే రాయి తగిలి కిందపడింది. ఒళ్ళంతా గాయాలయ్యాయి. బాధతో కన్నీళ్ళు తుడిచేవాళ్ళే కరువయ్యారు.
అప్పుడే ఆ దారంట వెళుతున్న ఒక బౌద్ధ భిక్షువు ఆమెను చూశాడు. అతను ఉపగుప్తుడు. అతను వాస్తవదత్తను గుర్తుపెట్టాడు. కానీ ఆమె గుర్తుపట్టలేదు. కింద కూర్చుని ఆమె గాయాన్ని కడిగి, మొఖం కడిగి, ఆమెను నడిపించి ఒక రచ్చబండ మీద కుర్చోబెట్టి ఆమెకు నీళ్ళు తాపారు.
ఆమె కృతజ్ఞతగా ‘స్వామీ! ఎవరు మీరు. యిప్పటిదాకా నన్ను యింత దయగా చూసినవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు మీరు నా పట్ల యింత జాలి చూపారు’ అంది.
ఉపగుప్తుడు ‘అమ్మా! మీరు నన్ను గుర్తుపట్టలేదు. ముప్పయి సంవత్సరాల క్రితం మీ యింటికి నన్ను ఆహ్వానించారు. కానీ నేను ‘అవసరం వచ్చినపుడు వస్తాను’ అన్నాను. ఆ ఉపగుప్తుణ్ణే నేను’ అన్నాడు.
వాసవదత్త కన్నీళ్ళతో ఉపగుప్తుని పాదాలు తాకింది.
– సౌభాగ్య