శ్రమజీవి రొట్టెలు
కష్టపడి సంపాదించింది ఎప్పుడూ విలువైందే. అక్రమంగా అర్జించింది ఎప్పుడూ అన్యాయమైందే. మన శ్రమతో సంపాదించిన ఏదయినా మనకు సంతృప్తి నిస్తుంది. యితరుల్నించి దోచుకున్న దెపుడూ మనశ్శాంతి నివ్వదు. పేదవాళ్ళున్నంత నిర్మలంగా సంపన్నులుండరు. గురునానక్ వున్న రోజుల్లో పంజాబ్‌లోని ఎమ్ముబాద్‌లో ఒక సంపన్నుడు వుండేవాడు. అతను ఉన్నత వంశంలో జన్మించాడు. అతను ఆ ప్రాంతానికి మంత్రిగా పనిచేశాడు. ఎన్నో యితర పదవుల్ని నిర్వహించాడు. గొప్ప గౌరవాన్ని పొందాడు. అతని పేరు మాలిక్‌భాగో. అతను ప్రతి సంవత్సరం తన తండ్రి […]
కష్టపడి సంపాదించింది ఎప్పుడూ విలువైందే. అక్రమంగా అర్జించింది ఎప్పుడూ అన్యాయమైందే. మన శ్రమతో సంపాదించిన ఏదయినా మనకు సంతృప్తి నిస్తుంది. యితరుల్నించి దోచుకున్న దెపుడూ మనశ్శాంతి నివ్వదు. పేదవాళ్ళున్నంత నిర్మలంగా సంపన్నులుండరు.
గురునానక్ వున్న రోజుల్లో పంజాబ్‌లోని ఎమ్ముబాద్‌లో ఒక సంపన్నుడు వుండేవాడు. అతను ఉన్నత వంశంలో జన్మించాడు. అతను ఆ ప్రాంతానికి మంత్రిగా పనిచేశాడు. ఎన్నో యితర పదవుల్ని నిర్వహించాడు. గొప్ప గౌరవాన్ని పొందాడు. అతని పేరు మాలిక్‌భాగో. అతను ప్రతి సంవత్సరం తన తండ్రి మరణించిన రోజు దేశ వ్యాప్తంగా వున్న పండితుల్ని, ఆధ్యాత్మిక వాదుల్ని సమావేశ పరిచేవాడు. ఇతర ప్రసిద్ధ అధికారులు కూడా ఆ సమావేవానికి వచ్చేవారు. ఆ రోజు మాలిక్ ఆహ్వానాన్ని అందుకోవడం గౌరవంగా భావించేవాళ్ళు.
అట్లా ఎప్పటిలాగే ఆ సంవత్సరం తండ్రి సాంవత్సరీకాన్ని ఘనంగా ప్రారంభించాడు. అదే రోజు గురునానక్ ఆ నగరానికి వచ్చాడు. ఒక పేదవాడయిన వడ్రంగి యింటిలో బసచేశాడు. ఆ పేద వడ్రంగి పేరు భాయ్ లాలూ. అంతటి మహాపురుషుడు తనయింటికి ఆతిథ్యానికి వచ్చినందుకు భాయ్‌లాలూ ఎంతో సంతోషించాడు. గురువు పట్ల ఎంతో భక్తి విశ్వాసాన్ని ప్రకటించాడు.
ఈ వార్త మాలిక్ భాగోకు చేరింది. గురునానక్ లాంటి మహాపురుషుడు ఈ ప్రాంతానికి రావడమేమిటి? ఎవడో అనామకునియింట్లో బస చేయడమేమిటి? అనుకున్నాడు. వెంటనే మనుషుల్ని పంపి తనయింటికి ఆహ్వానించాడు. గురునానక్ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ఆ మనుషుల్ని వెనక్కి పంపేశాడు.
మాలిక్ భాగో అసంతృప్తిగా ఆలోచనలో పడ్డాడు. గురునానక్ లాంటి గురువు రానిదే, తన విందు స్వీకరించందే తనవిందు పరిపూర్ణమయినట్లు కాదని భావించాడు. అందువల్ల అభ్యర్ధనతో మళ్ళీ మళ్ళీ మనుషుల్ని పంపాడు.
గురునానక్ తప్పని సరై మాలిక్ యింటికి బయల్దేరాడు. తోడుగా భాయ్‌లాలూని కూడా రమ్మన్నాడు. మొత్తానికి గురునానక్‌ని రప్పించాను కదా అని మాలిక్ గర్వపడ్డాడు. గురునానక్‌ను మాలిక్ ఆహ్వానించాడు.
‘మీలాంటి పవిత్ర వ్యక్తులు మా యింటి విందుకు రాకుండా ఎక్కడో ఒక పేదవాడి యింట్లో బస చేశారు’ అన్నాడు మాలిక్.
గురునానక్ ఆ మాటలకు ఏమీ బదులు యివ్వకుండా ‘సరే వచ్చాను కదా! మీకు నాకు ఏమి ఆహారం పెట్టదలచుకున్నారో అది తీసుకురండి’ అన్నాడు. తన వెనుకనేవున్న భాయ్‌లాలూ వేపు తిరిగి ‘నువ్వు నాకు ఏం పెట్టదలచుకున్నావో ఆ ఆహారాన్నీ పట్టుకురా’ అన్నాడు. మాలిక్ సేవకుల్ని పురమాయించాడు. భాయ్‌లాలూ యింటికి వెళ్ళాడు.
కాసేపటికి యిద్దరి భోజనాలూ సిద్ధమయ్యాయి. ఒక వేపు రకరకాల వంటకాల మాలిక్ భోజనం మరో వేపు ఒక కూర వున్న భాయ్‌లాలూ రొట్టె. లాలూ రొట్టె కొరికాడు గురునానక్. దాంట్లోంచి పాలుకారాయి. తరువాత మాలిక్ ఆహారంలోని రొట్టె కొరికాడు దాంట్లోంచి రక్తం కారింది. నానక్ మాలిక్ వేపు తిరిగి ‘ఎందుకు నీ ఆతిథ్యం తిరస్కరించానో అర్ధమయిందనుకుంటాను. నీ రొట్టెలు పేదవాళ్ళ రక్తంతో తయారయినవి. కానీ లాలూ ఆహారం శ్రమతో సంపాదించింది’ అన్నాడు.
– సౌభాగ్య