తనను అమ్మకానికి పెడుతున్న వారితో జగన్ ప్రయాణం
ఆ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భద్రత విషయంలో అనుమానం వ్యక్తం చేశారు. తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని అనుమానించి పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు. తనకు భద్రతగా వచ్చిన ఏపీ పోలీసులను వెనక్కు పంపించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్‌ను చూసి కొందరు నవ్వుకున్నారు. మరీ ఇంతగా భయపడిపోతే ఎలా అని ఎద్దేవా చేశారు. జగన్‌పై హత్యాయత్నం తర్వాత గతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే వైసీపీ అప్రమత్తత కంటే పవన్ కల్యాణ్ ఇంటెలిజెన్సే బలంగా […]
ఆ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భద్రత విషయంలో అనుమానం వ్యక్తం చేశారు. తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని అనుమానించి పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు. తనకు భద్రతగా వచ్చిన ఏపీ పోలీసులను వెనక్కు పంపించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్‌ను చూసి కొందరు నవ్వుకున్నారు. మరీ ఇంతగా భయపడిపోతే ఎలా అని ఎద్దేవా చేశారు.
జగన్‌పై హత్యాయత్నం తర్వాత గతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే వైసీపీ అప్రమత్తత కంటే పవన్ కల్యాణ్ ఇంటెలిజెన్సే బలంగా ఉన్నట్టు అర్థమవుతోంది. తనకు ఎలాంటి క్లూస్ లేకున్నా తనకు ఏదో ఇబ్బంది రాబోతోందని పవన్ అనుమానించగలిగారు. కానీ ఏపీలో ప్రతిపక్ష నేతపై దాడి జరగబోతోందని మూడు నెలల క్రితమే ఆపరేషన్ గరుడ ఆర్టిస్ట్ శివాజీ చెప్పారు.
ఇప్పటికే ప్రతిపక్ష నేతపై దాడి కోసం గుంటూరు, హైదరాబాద్‌లో రెక్కీ కూడా జరిగిందని చెప్పారు. అంత నేరుగా ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని శివాజీ చెప్పినప్పుడు కూడా వైసీపీ నుంచి కనీస స్పందన లేదు. ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని చెప్పిన శివాజీని అరెస్ట్ చేయాలని ఇప్పుడు వైసీపీ డిమాండ్ చేస్తోందే గానీ మూడు నెలల క్రితం ఆ మాత్రం ఆలోచన ఆ పార్టీకి ఎందుకు రాలేదు.
బహుశా ఒకరిద్దరు ఆ డిమాండ్ అప్పట్లోచేసి ఉండవచ్చు. కానీ ఒక పార్టీ అధినేతను హత్య చేసేందుకు ప్లాన్ జరుగుతోందని ఒక వ్యక్తి చెప్పిన తర్వాత కూడా వైసీపీ మాత్రం అత్యంత నిర్లక్ష్యంతోనే వ్యవహరించింది. జగన్ ప్రాణాల జోలికి వచ్చేంత ధైర్యం టీడీపీకి ఉందా అన్నట్టు అతివిశ్వాసంతో వ్యవహరించారు.
ఈ విషయంలోనే కాదు చాలా విషయాల్లో వైసీపీ ప్రమాదకర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. జగన్ టీంలో ప్రాణాలు ఇచ్చే వ్యక్తులతో పాటు పనికిమాలిన మనుషులు కూడా చేరారన్నది ఆ పార్టీలో చాలా కాలంగా వినిపిస్తున్న మాటే. జగన్ పాదయాత్ర చేస్తుంటే కొన్ని నెలలుగా భార్య పిల్లలను వదిలేసి కొందరు యాత్రను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇదే అదనుగా కొందరు జగన్ టీంలోకి చొరబడ్డారు. అక్కడ ఏం జరిగేది, ఏం జరగబోయేది వివరంగా అందించాల్సిన వాళ్ళకు అందిస్తున్నారు.
పాదయాత్రలో కీలకమైన ఒక వ్యక్తి ప్రతిరోజూ రిపోర్టును ఒక టాప్ ఏపీ ఇంటలిజెన్స్ అధికారికి నమ్మకంగా అందజేస్తున్నాడని జగన్ అభిమానులు కొందరు గగ్గోలు పెడుతున్నారు.
కొందరు ఈ పాదయాత్రను క్యాష్ చేసుకుంటున్నారు. జగన్‌ను కలవడానికి వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. జగన్‌ను కలవడానికి ఒకరేటు.. కలిసిన తర్వాత ఆ వార్త మీడియాలో రావాలంటే ఒక రేటు పెట్టి జగన్‌ను అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ విషయం పై కొందరు వైసీపీ నేతలే నేరుగా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. కానీ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు.
జగన్ సంస్థల్లోకి కూడా చాలా మంది చంద్రబాబు అభిమానులు చొచ్చుకెళ్లి చాలా కాలమే అయింది. పై స్థాయిల్లో ఉండి ఒళ్లంతా నిర్లక్ష్యాన్ని నింపుకున్న వారిని, డబ్బు కోసం ఏ గడ్డి అయినా తినేందుకు వెనుకాడని వ్యక్తులను, రాజకీయ ఎత్తుగడలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులను కొందరిని జగన్ తన చుట్టూ చేర్చుకుని, తన భవిష్యత్తును అలాంటి వారి చేతుల్లో పెట్టి రాజకీయం చేస్తున్నారు.
జగన్ రాజకీయం, జగన్ సంస్థలు ఆయన ఇష్టం కదా అని ప్రశ్నిస్తే ఒక జగన్ వీరాభిమాని అయిన వైసీపీ నేత” అలా అయితే అది పార్టీ ఎలా అవుతుంది. ప్రైవేట్ సంస్థ అవుతుంది. కొందరు వ్యక్తుల వల్లే జగన్‌కు ఏమైనా జరిగినా, పార్టీకి ఇబ్బంది వచ్చినా నష్టపోయేది జగన్ ఒక్కరే కాదు. లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నేతలు, కోట్లాది మంది ప్రజలు. కాబట్టి ముందు మూర్ఖపు ఆలోచనలను వదిలేసి. చురుగ్గా ఆలోచించే వ్యవస్థను పార్టీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది” అని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని శివాజీ మూడు నెలల ముందే టీవీల ముందుకొచ్చి ప్రకటించినా దానిపై ఆందోళన వ్యక్తం చేయలేకపోయామంటే తమ పార్టీ ఎంతగా వెనుకబడింది అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. అప్పుడే శివాజీ వ్యాఖ్యలపై రచ్చ చేసి విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేసి ఉంటే కత్తి జగన్ కంఠం వరకు వచ్చేది కాదని సదరు నేత అభిప్రాయపడ్డారు.