ఆనంద రహస్యం
జీవితమొక రహస్యం. ఎప్పటికీ అంతుచిక్కని రహస్యం. అర్థవంతంగా జీవించడం అందరికీ సాధ్యం కదు. అలా జీవించేవాళ్ళని రుషులనవచ్చు. సన్యాసులనవచ్చు. వాళ్ళు ఎక్కడో అరణ్యాలలో వుండరు. మనమధ్యే వుంటారు.
జీవితమొక రహస్యం. ఎప్పటికీ అంతుచిక్కని రహస్యం. అర్థవంతంగా జీవించడం అందరికీ సాధ్యం కదు. అలా జీవించేవాళ్ళని రుషులనవచ్చు. సన్యాసులనవచ్చు. వాళ్ళు ఎక్కడో అరణ్యాలలో వుండరు. మనమధ్యే వుంటారు. మనుషుల్ని పరిశీలిస్తే మనకు మానవోత్తములు కనిపిస్తారు. కొందరు ముఖాలు వేలాడేసుకుని వుంటారు. కొందరు ఎప్పుడూ చిరునవ్వుతో వుంటారు. కొందరిలో సంతృప్తి కనిపిస్తుంది. కొందరిలో అసంతృప్తి కనిపిస్తుంది. ఎట్లాంటి సందర్భంలోనైనా జీవితాన్ని ఆనందిస్తూ, ఆమోదిస్తూ, ఆహ్లాదంగా గడిపేవాళ్ళు కొద్దిమందే కనిపిస్తారు. వాళ్ళకు మాత్రమే జీవితరహస్యం తెలుస్తుంది. జీవిత రహస్యం తెలుసు గనకే వాళ్ళు సంతోషంగా వుంటారు.
ఒక వ్యక్తి వుండేవాడు. ఎప్పుడూ వుల్లాసంగావుండేవాడు, ద్ణుఖంగా వుండేవాడు కాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ వుండేవాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం వేసేది. అందరికీ వున్నట్లు అతనికి సమస్యలున్నాయి. బాధలున్నాయి, కష్టాలున్నాయి. వాటిని పట్టనట్లు ఎట్లా ప్రశాంతంగా వుండగలుగుతున్నాడో అంతుపట్టేది కాదు. పైగా ఆ సమస్యల్ని ఆయన తప్పించుకు పారిపోవడం చేసేవాడు కాదు. వాటిని సూటిగా ఎదుర్కొనేవాడు.
అతనెంత చురుగ్గా వుండేవాడంటే పసిపిల్లలతో కలిసి ఆట్లాడేవాడు, మధ్య వయసువాళ్ళతో మాటామంతీ కలిపేవాడు. అతనికి తొంభయి ఏళ్ళ వయసు. ఎవరూ అతను ముసలివాడు కదా! అతన్తో మనకేమిటిలే అని తప్పించుకుపోయే వాళ్ళు కారు. అతన్తో మాట్లాడితే ఎంతో ఆనందం కలిగేది. కథలు చెప్పేవాడు, కబుర్లు చెప్పేవాడు. విసిగించేవాడు కాదు.
ఆయన తొంభయ్యో ఏట జన్మదినాన్ని ఘనంగా జరపాలని బంధు మిత్రులంతా సంకల్పించారు. దూర ప్రాంతాల నించీ కూడా మిత్రులు, బంధువులు సమావేశమయ్యాడు. యిల్లంతా కోలాహలంగా వుంది. పిల్లల కేరింతలు అంతా హడావుడి. అతను మంచి బట్టలు వేసుకుని అందర్నీ పలకరిస్తూ వుత్సాహంగా వున్నాడు.
కేకును సిద్ధంచేశారు. అందరూ హాల్లో సమావేశమయ్యారు. కేకు కటింగ్ జరిగింది. కరతాళధ్వనుల మధ్య 'హ్యాపీ బర్త్ డే టూయూ' అని పాటపాడారు. అప్పుడు ఆయనకేసి ఆశ్చర్యంగా చూస్తున్న ఒక వ్యక్తి 'మీరు ఈ వయసులోనూ యింత వుల్లాసంగావున్నారు. అంతేకాదు ఎప్పుడూ దిగులుగా లేరు. నా చిన్నతనం నించీ మీరు దిగులుగా వుండడం చూడలేదు. దీనిలో రహస్యమేమిటి? చెప్పండి' అన్నాడు.
ఆయన నవ్వి ' నేను ప్రతి రోజూ వుదయాన్నే నిద్ర లేస్తే మొదట యిలా అనుకునేవాణ్ణి. నీ ముందు ద్ణుఖంవుంది, ఆనందం వుంది. దేన్ని ఎన్నుకుంటావు?' నేను ప్రతిరోజూ ఆనందాన్నే ఎన్నుకునేవాణ్ణి. యిప్పటికీ అదేపని చేస్తున్నా అన్నాడు.
– సౌభాగ్య