ఆంజనేయుడు

ఆంజనేయుడ్ని చూస్తే భలే హాశ్చర్యం వేస్తుంది కదూ? అతని శక్తి సామర్ధ్యాల గురించి ఎన్నిసార్లు విన్నా యింకా వినాలనిపిస్తోంది కదూ?! ఆ రూపం కళ్ళు మూసుకున్నా చూడగలరు కదూ? నిజమే, బూరెల్లాంటి బుగ్గలు. సువర్ణరేఖ మామిడి పళ్ళలాంటి ఎర్రని పెదాలు. వెనకాల పొడవాటితోక. ఆతోకతో కొడితే తొంభైమైళ్ళు వెళ్ళి పడాల్సిందే. అంతేనా?, చిటికెలో చీమంత అవగలిగి, మరుక్షణంలో మదపుటేనుగంత ఎత్తుకి… ఆకాశం తలకు తగిలేంత ఎత్తుకి ఎదిగి పోవడం… ఎంత ఎదిగినా రాముని పాదాలు చెంత భక్తితో […]

Advertisement
Update:2018-10-27 08:30 IST

ఆంజనేయుడ్ని చూస్తే భలే హాశ్చర్యం వేస్తుంది కదూ? అతని శక్తి సామర్ధ్యాల గురించి ఎన్నిసార్లు విన్నా యింకా వినాలనిపిస్తోంది కదూ?! ఆ రూపం కళ్ళు మూసుకున్నా చూడగలరు కదూ? నిజమే, బూరెల్లాంటి బుగ్గలు. సువర్ణరేఖ మామిడి పళ్ళలాంటి ఎర్రని పెదాలు. వెనకాల పొడవాటితోక. ఆతోకతో కొడితే తొంభైమైళ్ళు వెళ్ళి పడాల్సిందే. అంతేనా?, చిటికెలో చీమంత అవగలిగి, మరుక్షణంలో మదపుటేనుగంత ఎత్తుకి… ఆకాశం తలకు తగిలేంత ఎత్తుకి ఎదిగి పోవడం… ఎంత ఎదిగినా రాముని పాదాలు చెంత భక్తితో ఒదిగిపోవడం అబ్బుర పరుస్తుంది!
వాయువేగంతో గాల్లో తేలిపోయి ఎగురుతూ వెళ్ళగల ఆంజనేయుడు నిజంగా వాయుదేవుని అనుగ్రహం వల్ల పుట్టిన వాడే. అందుకే వాయుపుత్రుడనీ-అంజనీదేవికి జన్మించడం వల్ల అంజనీ పుత్రుడని కూడా అంటారు. హనుమంతుడన్నా ఆయనే. హనుమాన్‌ చాలీసా విన్నారు కదా?
గాల్లో దూది పింజలా తేలే ఆంజనేయుడ్ని చూసే సూపర్‌మేన్‌ను సృష్టించినట్టున్నారు. అలా గాల్లోకి ఎగిరిపోవడం ఆంజనేయుడి బాల్యంలోనే మొదలయింది. ఉదయించే ఎర్రని సూర్యుణ్ని చూసి పండనుకొని ఎగిరి వెళ్ళాడు. ఆ వేళ గ్రహణమట. రాహువు సూర్యుని దగ్గరకు వెళ్ళబోతూ ఆంజనేయుణ్ని చూసి మరొక రాహువనుకున్నాడు. బెంబేలు పడి ఇంద్రునికి ఫిర్యాదు చేసాడు. ఇంద్రుడు వజ్రాయుధం చేతబట్టి ఐరావతం ఎక్కి వచ్చాడు. ఐరావతాన్ని కూడా పండనుకున్నాడు ఆంజనేయుడు. పట్టుకోబోతే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. కొడుకు స్పృహ తప్పి పడిపోవడంతో వాయుదేవునికి కోపంవచ్చింది. దాంతో ముల్లోకాలను గాలి ఆడకుండా స్తంభింపజేసాడు. అప్పుడు దేవతలంతా దిగి వచ్చారు. ఆంజనేయునికి ఎన్నో వరాలు యిచ్చారు. ఆ శక్తి యుక్తులతో విద్యనేర్పే గురువులను ఆటపట్టించి వారి ఆగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు, తన శక్తి యుక్తులు తానే మరచిపోయేలా శపించి, ఎవరైనా ‘నీ అంతటి వాడు లేడని’ గుర్తు చేస్తే చాలు శాప ఉపశమనం కలుగుతుందని వాక్కిచ్చారు.
సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయాక రాముడు వెతుక్కుంటూ వెళతాడు. సీతమ్మ తన ఆనవాళ్ళుగా జార విడిచిన ఆభరణాలను ఆంజనేయుడే రాముని కందించి ప్రీతి పాత్రమైనాడు. అది మొదలు ఆంజనేయుడు రామునికి నమ్మినబంటయిపోయాడు. సీతమ్మ జాడ వెతుకుతూ లంకలో అడుగుపెట్టాడు. సీతను కనిపెట్టాడు. రాముని ఉంగరాన్ని సీతమ్మకిచ్చి సీత ఆనవాళ్ళుగా రామునికోసం ఉంగరం తీసుకున్నాడు. ఆంజనేయుడ్ని బంధిస్తే, నిండు సభలో అగౌరవ పరిస్తే తన తోకనే చుట్టబెట్టి కొండలాంటి సింహాసనం మీద కూర్చుంటాడు. మూర్ఖులైన రాక్షసులను ఒక ఆట ఆడిస్తాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడన్న సామెత ఆంజనేయుడ్ని ఉద్దేశించి అన్నదే. మొత్తానికి వెళ్ళినపని ముగించుకు వచ్చాడు. సీత ఉంగరాన్ని రామునికిచ్చి ఆనంద పరిచాడు. వారధి కట్టడంలో, లంకను చేరడంలో రామునికి సాయపడ్డాడు.
రామ రావణ యుద్ధమప్పుడు రామలక్ష్మణులు సొమ్మసిల్లి పడిపోతే ఆంజనేయుడు ఏకంగా సంజీవనీ పర్వతాన్నే మోసుకొచ్చాడు. రాముణ్ని ప్రాణంగా కొలవడమే కాదు, తమ్ముడి ప్రాణాల్నీ నిలిపాడు.
ఎంతో బలిశాలి అయిన భీముడు సయితం ఆంజనేయుడి తోకను కదపలేక పోయాడని చెపుతారు. దారి కడ్డంగా తోకను పరచుకొని కూర్చున్న కోతి రూపంలో వున్న ఆంజనేయుడ్ని తోక తియ్యమని భీముడు అంటాడు. ముసలివాణ్ని… లేవ లేను, తోక జరుపుకొని వెళ్ళమంటుంది కోతి. ఆపని భీముని వల్లకాలేదు. అంతటి బలశాలి ఆయన.
ఆంజనేయుడు బహు పరాక్రమ శాలి. అందుకే భయం వేసినప్పుడు ధైర్యం కోసం ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం..’ అంటూ దండకం చదువుతారు. అంటే ఆయన ధైర్య సాహసాలు తలచుకుంటే మనకూ ధైర్యం వస్తుందన్నమాట!
–బమ్మిడి జగదీశ్వర రావు

Tags:    
Advertisement

Similar News