కాంగ్రెస్ గూటికి జస్వంత్ కుమారుడు

బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ బుధవారం కాంగ్రెస్ లో చేరనున్నారు. రాహుల్ గాంధీ ఇంటికెళ్లి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మానవేంద్ర సింగ్ సెప్టెంబర్ 22న బీజేపీకి రాజీనామా చేశారు. “కమల్ కా ఫూల్, హమారీ భూల్” (కమలం మా పొరపాటు) అని ఆయన ఒక ర్యాలీలో అన్నప్పుడే ఆయన బీజేపీ నుంచి వైదొలగుతారన్న అభిప్రాయం కలిగింది. డిసెంబర్ ఏడవ తేదీన రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు జరగనున్నందువల్ల మానవేంద్ర సింగ్ బీజేపీని […]

Advertisement
Update:2018-10-16 07:15 IST

బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ బుధవారం కాంగ్రెస్ లో చేరనున్నారు. రాహుల్ గాంధీ ఇంటికెళ్లి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మానవేంద్ర సింగ్ సెప్టెంబర్ 22న బీజేపీకి రాజీనామా చేశారు. “కమల్ కా ఫూల్, హమారీ భూల్” (కమలం మా పొరపాటు) అని ఆయన ఒక ర్యాలీలో అన్నప్పుడే ఆయన బీజేపీ నుంచి వైదొలగుతారన్న అభిప్రాయం కలిగింది.

డిసెంబర్ ఏడవ తేదీన రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు జరగనున్నందువల్ల మానవేంద్ర సింగ్ బీజేపీని వీడడం ఆ పార్టీ మీద కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మానవేంద్ర సింగ్ కు కాంగ్రెస్ లో ముఖ్యమైన బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. రాజస్థాన్ పశ్చిమ ప్రాంతంలో జస్వంత సింగ్ కుటుంబానికి రాజపుత్రుల్లో మంచి పట్టు ఉంది. రాజస్థాన్ లోని ఓటర్లలో రాజపుత్రులు ఏడు శాతం ఉన్నారు. రాజపుత్రులు ఇంతవరకు బీజేపీని సమర్థిస్తూ వచ్చారు.

2013లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో మొత్తం 200 సీట్లు ఉంటే 163 నియోజకవర్గాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది బీజేపీ. రాజపుత్రులు, గుజ్జార్లు బీజేపీపై విసిగిపోయి ఉన్నందువల్ల ఈ సారీ ఎన్నికల ఫలితాల్లో భారీ మార్పు ఉండవచ్చునని అంచనా.

జస్వంత్ సింగ్ నాలుగేళ్ల నుంచి కోమాలో (అపస్మారక స్థితి) ఉన్నారు. ఆయన, ఆయన కుమారుడు మానవేంద్ర బీజేపీ వైఖరితో విసిగిపోయారు. 2014లో జస్వంత్ సింగ్ బర్మేర్ నుంచి లోకసభకు పోటీ చేయాలనుకున్నారు. కానీ బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తాను ఇన్నాళ్లుగా అంటిపెట్టుకుని ఉన్న బీజేపీ తనకు ద్రోహం చేసిందని భావించిన జస్వంత్ అప్పుడు కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

1980లో బీజేపీ అవతరించినప్పుడు జస్వంత్ ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. జస్వంత్ ను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. తన తండ్రిని పక్కన పెట్టడంలో ముఖ్యమంత్రి వసుంధరా రాజే హస్తం ఉందని మానవేంద్ర సింగ్ భావిస్తున్నారు.

గత నెల ఆయన బీజేపీకి రాజీనామా చేసినప్పుడు ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “పరిపాలనా సంస్కృతి సవ్యంగా లేదు. అవినీతి రాజ్యం ఏలుతోంది” అని మానవేంద్ర సింగ్ దుయ్యబట్టారు. సైద్ధాంతిక విభేదాల వల్లే తాను బీజేపీ నుంచి తప్పుకున్నానని మానవేంద్ర సింగ్ తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News