మళ్లీ బజారునపడ్డ ప్రొద్దుటూరు టీడీపీ

కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో మరోసారి రచ్చ రేగింది. తొలి నుంచి కూడా అడ్డుఅదుపులేకుండా ఇక్కడ టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారే కింగ్‌ అన్నట్టుగా ఇక్కడ వ్యవహారం ఉంది. ఇప్పుడు టీడీపీ వర్గపోరు ముదిరి ఏకంగా 21 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. వారితో పాటు ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు కూడా పదవులకు రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పోరును భరించలేకే తాము రాజీనామా చేసినట్టు వారు తెలిపారు. ఆదినారాయణరెడ్డి టీడీపీలో […]

Advertisement
Update:2018-10-01 12:26 IST

కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో మరోసారి రచ్చ రేగింది. తొలి నుంచి కూడా అడ్డుఅదుపులేకుండా ఇక్కడ టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారే కింగ్‌ అన్నట్టుగా ఇక్కడ వ్యవహారం ఉంది. ఇప్పుడు టీడీపీ వర్గపోరు ముదిరి ఏకంగా 21 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు.

వారితో పాటు ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు కూడా పదవులకు రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పోరును భరించలేకే తాము రాజీనామా చేసినట్టు వారు తెలిపారు. ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత కడప జిల్లాలో టీడీపీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గానికి మంత్రి ఆదినారాయణరెడ్డి, మరో వర్గానికి ఎంపీ సీఎం రమేష్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రొద్దుటూరు లో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి అండగా మంత్రి ఉన్నారు.

అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి సీఎం రమేష్ అండ ఉంది. అతి కష్టం మీద ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకోగా.. వరదరాజుల రెడ్డి మనిషిని చైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి మున్సిపాలిటీపై వరదరాజుల రెడ్డి ఆధిపత్యం నడుస్తోంది.

లింగారెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో తన మనుషులను ఇన్‌చార్జ్‌లుగా వరదరాజులరెడ్డి నియమించుకున్నారు. వారి ద్వారానే పనులు చేయిస్తున్నారు. కౌన్సిలర్లకు తెలియకుండానే వార్డుల్లో అధికారులను వెంటేసుకుని పర్యటిస్తున్నారు.

పైగా ఇటీవల పాతబస్టాండ్‌ను కూల్చకూడదని కౌన్సిలర్లు అంతా తీర్మానం చేయగా.. వరదరాజుల రెడ్డి తన మనుషులతో వెళ్లి దాన్ని కూల్చేశారు. శివాలయాన్ని మూసివేయించారు. ఇదంతా మంత్రి ఆదినారాయణరెడ్డి అండతోనే వరదరాజుల రెడ్డి చేస్తున్నారన్నది సీఎం రమేష్ వర్గం ఆరోపణ. ఈనేపథ్యంలో వరదరాజుల రెడ్డి, అతడు నియమించిన చైర్మన్‌కు వ్యతిరేకంగా 21 మంది టీడీపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. వరదరాజుల రెడ్డి ఒక శాడిస్ట్‌గా మారారని…అవమానాలు భరించలేకే రాజీనామా చేశామని కౌన్సిలర్లు మీడియాతో చెప్పారు.

Advertisement

Similar News