నితీశ్ ముచ్చట కోసం బాలలకు అష్టకష్టాలు
విద్యార్థులకు చారిత్రక విశేషాలు తెలియజేయడం కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ”దర్శన్ యోజన” ప్రారంభించారు. తూర్పు చంపారన్ లోని కొత్వా బ్లాకు మాధ్యమిక పాఠశాల విద్యార్థులను దర్శన్ యోజన కోసం పట్నా తీసుకొచ్చారు. వారికి పట్నాలోని చారిత్రక కట్టడాలు చూపించారు. ఇందులో అభ్యంతర పెట్టవలసింది ఏమీ లేదు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత విద్యార్థులను వెనక్కి తీసుకెళ్లడానికి ఏర్పాటు చేసిన బస్సు చెడిపోయింది. అందువల్ల ఆ రాత్రి విద్యార్థులు జంతు ప్రదర్శన శాల గేటు […]
విద్యార్థులకు చారిత్రక విశేషాలు తెలియజేయడం కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ”దర్శన్ యోజన” ప్రారంభించారు. తూర్పు చంపారన్ లోని కొత్వా బ్లాకు మాధ్యమిక పాఠశాల విద్యార్థులను దర్శన్ యోజన కోసం పట్నా తీసుకొచ్చారు. వారికి పట్నాలోని చారిత్రక కట్టడాలు చూపించారు.
ఇందులో అభ్యంతర పెట్టవలసింది ఏమీ లేదు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత విద్యార్థులను వెనక్కి తీసుకెళ్లడానికి ఏర్పాటు చేసిన బస్సు చెడిపోయింది. అందువల్ల ఆ రాత్రి విద్యార్థులు జంతు ప్రదర్శన శాల గేటు వెలుపల ఫుట్ పాత్ మీదే పడుకోవలసి వచ్చింది.
ఈ జంతు ప్రదర్శన శాల బైలీ రోడ్డులో ఉంది. ఆ ప్రాంతంలోనే మంత్రుల ఇళ్లు ఉంటాయి. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారుల నివాసాలూ ఉన్నాయి. ముఖ్యమంత్రి, గవర్నర్ ఉండేదీ ఆ పరిసరాల్లోనే. అవన్నీ విశాలమైన భవనాలేనని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.
స్వస్థలాలకు వెళ్లే సదుపాయం లేక పట్నాలో చిక్కుకు పోయిన విద్యార్థులకు ఆ విశాల భవంతుల్లో ఎక్కడో ఒక చోట తలదాచుకునే ఏర్పాటు చేయవచ్చునన్న ధ్యాసే నితీశ్ ప్రభుత్వానికి రాలేదు. నితీశ్ ముచ్చట తీర్చడానికి పాపం ఆ విద్యార్థులు ప్రమాదాలకు ఆలవాలమైన బెయిలీ రోడ్డు ఫుట్ పాత్ మీదే ఆ రాత్రి గడప వలసి వచ్చింది. ఏరు దాటే దాకా ఓడ మల్లాన్న, దాటాక బోడి మల్లన్న అన్న నానుడి ఇలాంటి సందర్భంలోనే వాడుకలోకి వచ్చి ఉంటుంది.