కళ్ళు తెరువు

             పర్ణియాలో రబియా “సుప్రసిద్ధురాలయిన సూఫీ మార్మికురాలు. సత్యాన్ని గ్రహించిన జ్ఞాని”. ఆమెను అందరూ ఎంతగానో గౌరవించే వాళ్ళు.             ఆమె ఒకరోజు దారంటీ వెళుతూ అక్కడ వున్న మరొక సూఫీ అయిన హసన్‌ని చూసింది. అతను మసీదులో దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. పరవశంతో పులకించిపోతూ ప్రార్థించి కదిలిపోతున్నాడు. అతని కళ్ళనించీ జలజలా నీళ్ళు కారుతున్నాయి. చేతులు ఆకాశానికి చాపి ప్రార్థిస్తున్నాడు. ఏడుస్తున్నాడు. తపించిపోతున్నాడు. చేతులు పైకెత్తి “దేవా!రా! తలుపులు తెరువు, […]

Advertisement
Update:2018-09-25 01:31 IST

పర్ణియాలో రబియా “సుప్రసిద్ధురాలయిన సూఫీ మార్మికురాలు. సత్యాన్ని గ్రహించిన జ్ఞాని”. ఆమెను అందరూ ఎంతగానో గౌరవించే వాళ్ళు.

ఆమె ఒకరోజు దారంటీ వెళుతూ అక్కడ వున్న మరొక సూఫీ అయిన హసన్‌ని చూసింది. అతను మసీదులో దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. పరవశంతో పులకించిపోతూ ప్రార్థించి కదిలిపోతున్నాడు. అతని కళ్ళనించీ జలజలా నీళ్ళు కారుతున్నాయి. చేతులు ఆకాశానికి చాపి ప్రార్థిస్తున్నాడు. ఏడుస్తున్నాడు. తపించిపోతున్నాడు. చేతులు పైకెత్తి “దేవా!రా! తలుపులు తెరువు, నన్ను లోపలికి రానీ” అంటున్నాడు.

అతన్ని రబియా ప్రతిరోజూ చూస్తోంది. ఎప్పుడూ అదేస్థితిలో కనిపించేవాడు. రోజూ ఐదుసార్లు ప్రార్థన చేసేవాడు. ప్రతి ప్రార్థనలో అతని పరిస్థితి అలాగే వుండేది. అదంతా ఆషామాషీగా కాదు, నిజాయితీతో నిర్వహించేవాడు. హృదయ పూర్వకంగా చేసేవాడు. కేవలం అది ఆచారంగా, ప్రతిపూటా నిర్వహించే తతంగంలా కాకుండా గొప్ప దైవ భక్తితో నిర్వహించేవాడు.

అతన్లో ఎన్నో మంచి లక్షణాలున్నాయి. రబియా ప్రతిరోజూ అతని పరిస్థితి గమనించేది. అతని ప్రార్థన విన్న ప్రతిసారీ ఆమె చిరునవ్వు చిందించేది. ఒక్కోమారు నవ్వుకునేది, తనదారంటీ తాను వెళ్ళేది.

ఒకరోజు రబియాదారంటీ వెళుతూ అతని ప్రార్థన విన్నది. ఏమనుకుందో ఏమో! అతని దగ్గరికి వెళ్ళింది. అతను కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అతన్ని కుదిపింది. అతన్తో “నువ్విలా ఎంతకాలం ప్రార్థిస్తావు? ఎందుకింత తపిస్తావు! నేను ఒక విషయం చెబుతున్నా. నువ్వు “దేవా!రా! తులపులు తెరువు. నన్ను లోపలికి రానివ్వు” అంటూ ఎన్నాళ్ళగానో, ఎన్నేళ్ళగానో ప్రార్థిస్తున్నావు. తలుపులు తెరిచేవున్నాయి. నువ్వు ఆయన్ని మళ్ళీమళ్ళీ తలుపులు తెరవమని అడగాల్సిన పన్లేదు. “ఎప్పుడు తలుపులు తెరుస్తావని నిలదీయాల్సిన పనిలేదు. తెలివి తక్కువగా ప్రవర్తించకు. చేసింది చాలు యింతవరకూ చేసిన రోదనలు చాలు. తలుపులు తెరిచేవున్నాయి. నువ్వు మొదట చెయ్యాల్సిన పని కళ్ళు తెరువు! నీకు కనిపిస్తుంది” అంది.

రబియా మాటలు ఎంతో అపూర్వమయినవి. అర్థవంతమైనవి సత్యం మన కళ్ళ ముందువుంది. తలుపులు తెరిచేవున్నాయి. మనం గ్రహించలేకపోతున్నాం. అజ్ఞానంతో మన కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు చెయ్యాల్సిన పని కళ్ళు తెరవడం.

జీసెస్‌ “తట్టు, తలుపు తెరుచుకుంటుంది” అన్నాడు.

రబియా “కళ్ళు తెరిచి చూడు, తలుపులు తెరుచుకునే వున్నాయి” అంటోంది!

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News