ఈ గ్యారేజ్ లో మెకానిక్ వీక్
రివ్యూ: జనతా గ్యారేజ్ రేటింగ్: 2.5/5 తారాగణం: ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్యా మీనన్, తదితరులు సంగీతం: దేవిశ్రీప్రసాద్ నిర్మాత: నవీన్, రవి శంకర్, సి.వి. మోహన్ దర్శకత్వం: కొరటాల శివ ఎట్టకేలకు జనతా గ్యారేజి వచ్చేసింది. అయితే వాహనాలకి కాకుండా మన బుర్రలకి రిపేర్ చేసే పనిలో దిగింది. కథలో కొత్తదనం లేక ఒకేసారి నాలుగైదు సినిమాలు చూసిన ఫీలింగ్ కలిగించింది. రకరకాల కంపెనీల స్పేర్‌పార్ట్స్ కలిపి బెంజ్ కారుని తయారు చేయాలనుకున్నారు కానీ మంచి టైర్లు వేయడం మరిచిపోయేసరికి నత్తనడకన సాగింది.
రివ్యూ: జనతా గ్యారేజ్
రేటింగ్: 2.5/5
తారాగణం: ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్యా మీనన్, తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: నవీన్, రవి శంకర్, సి.వి. మోహన్
దర్శకత్వం: కొరటాల శివ
ఎట్టకేలకు జనతా గ్యారేజి వచ్చేసింది. అయితే వాహనాలకి కాకుండా మన బుర్రలకి రిపేర్ చేసే పనిలో దిగింది. కథలో కొత్తదనం లేక ఒకేసారి నాలుగైదు సినిమాలు చూసిన ఫీలింగ్ కలిగించింది. రకరకాల కంపెనీల స్పేర్‌పార్ట్స్ కలిపి బెంజ్ కారుని తయారు చేయాలనుకున్నారు కానీ మంచి టైర్లు వేయడం మరిచిపోయేసరికి నత్తనడకన సాగింది.
గాడ్‌ఫాదర్ నవలని మేరియోపూజో ఏ ముహుర్తాన రాసాడో కానీ దాని ప్రభావం అంతా ఇంతా కాదు. ఒక అమ్మాయి అన్యాయంగా రేప్‌కి గురైతే, పోలీసులు న్యాయం చేయలేకపోతే వాళ్ళను చంపి మోహన్‌లాల్ న్యాయం చేస్తాడు. ఇది మొదటిసీన్ (గాడ్ ఫాదర్‌లో కూడా ఇదే). దీనికి ప్రతీకారంగా మోహన్‌లాల్ తమ్ముడు, మరదల్ని చంపేస్తారు (గాడ్ ఫాదర్‌లో కొడుకుని చంపేస్తారు). తమ్ముడు కొడుకు హీరో ఎన్టీఆర్.దూరంగా ముంబయిలో పెరుగుతాడు. అతనికి ప్రకృతి అంటే ఇష్టం. దాన్ని కాపాడాలనేది సిద్ధాంతం.
మోహన్‌లాల్‌కి ఒక కొడుకుంటాడు. అతనికి తండ్రంటే నచ్చడు. విలన్‌తో చేతులు కలుపుతాడు. ముంబైలో వున్న హీరో హైదరాబాద్ వస్తాడు. ఒక సందర్భంలో మోహన్‌లాల్ కొడుకుని హీరో ఎదిరిస్తాడు. హీరో ధైర్యం, నిజాయితీ చూసి అతనికి మెహన్‌లాల్ జనతా గ్యారేజిని అప్పగిస్తాడు.
సెకెండాఫ్ లో గ్యాంగ్‌లీడర్ కథ నడిచి, చివరికి కొండవీటి సింహంగా ముగుస్తుంది. పాతకథకి కొత్త రేపర్ చుట్టాననే భ్రమలో కొరటాల శివ ఈ సినిమాని మనకు అందించాడు. ఇంతకూ అతనేం చెప్పదలచుకున్నాడో సరిగా అర్థం కాకుండానే మనం బయటికొస్తాం.
మోహన్ లాల్, ఎన్టీఆర్ లాంటి అద్భుతమైన నటులున్నారు. సమంతా నిత్యామీనన్ లాంటి గ్లామరస్ హీరోయిన్లున్నారు. మరి ఏమిటి లోపమంటే దర్శకుడు చేంతాడంత కథ రాసుకుని, అనేక ట్రాక్‌లు వేసుకున్నాడు. అనవసరమైన లగేజిని పెంచుకుని దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక రెండు గంటల నలభైనిముషాల సినిమా తీసేసాడు.
ప్రకృతి ప్రేమికుడుగా, మొక్కలను ఇష్టపడే వ్యక్తిగా హీరోకి కొత్త క్యారెక్టర్‌ని సృష్టించాడు. ఇదే అంతరాత్మగా సినిమాని నడిపివుంటే డైరెక్టర్ సక్సెసయ్యేవాడు. గాడ్‌ఫాదర్‌గా మోహన్‌లాల్‌ని ఎస్టాబ్లిష్ చేసేసరికి పావుసినిమా అయిపోయింది. మోహన్‌లాల్‌తో పాటు హీరో ట్రాక్‌ని సమాంతరంగా నడిపేసరికి ఫీల్‌పోయింది.
సెకెంట్ ఆఫ్‌లో విలన్ కూతుర్ని మోహన్‌లాల్ కొడుకు పెళ్ళి చేసుకుని అదే ఇంట్లో వుండేసరికి గ్యాంగ్ లీడర్ గుర్తుకొచ్చింది. అసలే కథ ఎటుపోతూవుందో అర్థంకాకుండా ప్రేక్షకుడు వుంటే ముఖ్యమంత్రిని దించడానికి బాంచ్ బ్లాస్ట్స్, అజయ్‌మర్డర్ అదనపు లగేజి. ఇంత పేలవంగా కొరటాల శిర క్లైమాక్స్‌ని తీస్తాడని ఎవరూ వూహించలేదు.
సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అసలు లేదు. ఇద్దరు హీరోయిన్లు ఎందుకున్నారో అర్థం కాదు. వాళ్ళని చూస్తే బ్రహ్మోత్సవం గుర్తుకొచ్చింది. దాంట్లో కూడా పర్పస్‌లెస్‌గా వుంటారు.
శ్రీమంతుడు తీసిన దర్శకుడు ఇలా తీసాడేమిటా అనే బాధని పక్కన పెడితే ప్లస్ పాయింట్లు కూడా చాలా వున్నాయి. ఫొటోగ్రఫి చాలా బావుంది. కొన్నిసీన్లలో ఎమోషన్ పండింది. ఒకటిరెండు పాటలు బావున్నాయి. సినిమా సీరియస్‌గా సాగుతున్నపుడు కాజల్ ఐటెంసాంగ్ కూడా వుంది. సాయికుమార్ ఎస్‌పిగా బాగా నటించాడు. ఆయనకి ఎన్టీఆర్‌కి మధ్య జరిగే సంభాషణ దళపతి సినిమాని గుర్తుకు తెస్తుంది. కొరటాల డైలాగ్స్ చాలా బావున్నాయి. కానీ ప్రతి డైలాగ్‌ని అంత బరువుగా మాట్లాడితే కష్టం. సీనియర్ నటుడు మోహన్‌లాల్‌కి ఏమీ తగ్గకుండా ఎన్టీఆర్ మెచ్యూర్డ్‌గా చేశాడు.
స్లోగా స్టార్టయిన సినిమా వేగం పుంజుకుంటుందని మనం ఆశపడతాం. కానీ నిదానంగానే సినిమా అయిపోతుంది. ఎంత గొప్ప మెకానిక్ అయినా టూల్స్ లేకపోతే చిన్న బోల్ట్‌ని కూడా విప్పలేడు. సినిమా కథలో కొత్తదనం లేకపోయినా అంతే. బెంజికారుకైనా ఒక రోడ్డుండాలి. ముఖ్యంగా స్టీరింగ్ ఉండాలి. జనతా గ్యారేజి నుంచి అందమైన వాహనాన్ని ఊహిస్తే అనవసరమైన లగేజంతా మోసుకుని ట్రాలీ ఆటో వచ్చింది.
-జి ఆర్. మహర్షి