లైవ్ షోలో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జనం
గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నసమయంలో డయల్ యువర్ సీఎం పేరుతో దూరదర్శన్‌లో కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు ఇప్పుడు అలాంటి ప్రయోగమే ఒక టీవీ ఛానల్ ద్వారా చేశారు. తిరుపతి, విజయవాడ, విశాఖ కేంద్రాలుగా సదరు ఛానళ్ల ప్రతినిధులు ముందుగానే కొందరు వ్యక్తులను ఒక చోటకు తీసుకొచ్చారు. స్డూడియో నుంచి చంద్రబాబు వారితో మాట్లాడారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే సిద్ధం చేసుకున్న కార్యక్రమం కావడంతో చాలా మంది మీ పాలన అద్భుతంగా ఉందంటూ పొగిడారు. అయితే లైవ్ షోలో […]
గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నసమయంలో డయల్ యువర్ సీఎం పేరుతో దూరదర్శన్‌లో కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు ఇప్పుడు అలాంటి ప్రయోగమే ఒక టీవీ ఛానల్ ద్వారా చేశారు. తిరుపతి, విజయవాడ, విశాఖ కేంద్రాలుగా సదరు ఛానళ్ల ప్రతినిధులు ముందుగానే కొందరు వ్యక్తులను ఒక చోటకు తీసుకొచ్చారు. స్డూడియో నుంచి చంద్రబాబు వారితో మాట్లాడారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే సిద్ధం చేసుకున్న కార్యక్రమం కావడంతో చాలా మంది మీ పాలన అద్భుతంగా ఉందంటూ పొగిడారు. అయితే లైవ్ షోలో చంద్రబాబుకు కొందరి నుంచి ఊహించని స్పందన వచ్చింది.
తిరుపతి కేంద్రంగా మాట్లాడిన కొందరు మోహమాటపడకుండా అసలు సమస్యలు చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి తీసుకొచ్చిన కొందరు రైతుల నుంచి చంద్రబాబును ఇబ్బంది పెట్టే స్పందన వచ్చింది. తమ నియోజవర్గంలో 800 పంట కుంటలు తవ్వుకుంటే ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని చంద్రబాబుతో నేరుగా చెప్పారు. జూన్‌లో గుంతలు తవ్వుకుంటే ఇప్పటికీ బిల్లులు రాలేదని … లంచాలు ఇచ్చే వారికే బిల్లులు మంజూరు చేస్తున్నారని రైతులు చెప్పారు. ప్రభుత్వమే కూలీ చెల్లిస్తుందంటే నమ్మి కుంటలు తవ్వామని ఇప్పుడు కూలీలు డబ్బు కోసం తమ వెంటపడుతున్నారని వెల్లడించారు. దీంతో సమస్యను పరిష్కరిస్తానంటూ… విశాఖలో సిద్ధం చేసిన జనంతో చంద్రబాబు ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ ఎల్‌ఈడీ లైట్ల విషయంలో చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.
విశాఖలో ఎల్‌ఈడీ బల్బులుపెట్టానని సెన్సార్ల ద్వారా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తున్నామని… ఎన్ని బల్బులు వెలుగుతున్నాయో ఇక్కడి నుంచే చెప్పగలనని అంతకుకొద్ది సేపు ముందు చంద్రబాబు వివరించారు. అయితే విశాఖలో సదరు ఛానల్ తీసుకొచ్చిన జనంలోనూ చాలా మంది చంద్రబాబు పాలన అద్భుతంగా ఉందంటూ పొగిడేశారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఎల్ఈడీ బల్బులు పెట్టామంటున్నారు కానీ అవి పనిచేయడం లేదని ఓపెన్‌గా చెప్పారు. పాడైన బల్బులను తిరిగి అమర్చేందుకు ఎనిమిది రోజులు పడుతోందని చెప్పారు. మీరు ఎల్‌ఈడీ బల్బులకు సెన్సార్లు పెట్టామంటున్నారు గానీ… విశాఖలో అలాంటిదేమీ లేదని ఈ విషయాన్ని అధికారులే చెబుతున్నారని నేరుగా చంద్రబాబుకే చెప్పాడు సదరు వ్యక్తి. దీంతో చంద్రబాబు కాసింత ఇబ్బంది పడ్డారు. వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి సమస్య ఏంటో తెలుసుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఏడు వస్తువులు ఇస్తుంటే ఇప్పుడు మాత్రం మూడు వస్తువులే ఇస్తున్నారని మరో వ్యక్తి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అయితే చంద్రబాబు ప్రణాళికప్రకారం నిర్వహించిన లైవ్ షో సుధీర్ఘంగా సాగినప్పటికీ ప్రత్యేక హోదా అంశం, అవినీతిలో ఏపీ నెంబర్ గా గుర్తింపు పొందడం, నిరుద్యోగ సమస్య, డ్వాక్రా రుణ మాఫీ, రైతుల రుణమాఫీ, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ భృతి, కరువు పరిస్థితులు వంటి కీలకమైన, ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశాలు మాత్రం పెద్దగా ప్రస్తావనకు రాకపోవడం విశేషం. సదరు ఛానల్ తీసుకొచ్చిన జనం కూడా ఏ ఒక్కరు కూడా ఈ సమస్యలపై మాట్లాడలేదు. తనకు కులం అంటగట్టాలనుకోవడం అజ్ఞానమే అవుతుందన్నారు చంద్రబాబు. కార్యక్రమంలో చంద్రబాబు ఎక్కువ సేపు టెక్నాలజీ ప్రాముఖ్యతపైనే మాట్లాడారు. మొత్తం మీద లైవ్ షో కార్యక్రమం చాలా పక్కాగా చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు చేసిన ప్రయత్నం మాత్రం బాగానే ఉంది.
Click on Image to Read: