కుటుంబ పెద్ద మరణం...నిరాశా నిస్పృహలతో తల్లీ ముగ్గురు పిల్లల ఆత్మహత్య!
పరిస్థితులు, సమస్యలకు భయపడి ఓ కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ పెద్ద మరణించడంతో… మితిమీరిన నిరాశా నిస్పృహలతో తల్లి, ఇద్దరు కుమార్తెలు, కొడుకు కలిసి మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (53) ఆదిలాబాద్ జిల్లా హసీఫాబాద్లో గృహ నిర్మాణ శాఖ ఇనచార్జి డీఈగా […]
పరిస్థితులు, సమస్యలకు భయపడి ఓ కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ పెద్ద మరణించడంతో… మితిమీరిన నిరాశా నిస్పృహలతో తల్లి, ఇద్దరు కుమార్తెలు, కొడుకు కలిసి మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (53) ఆదిలాబాద్ జిల్లా హసీఫాబాద్లో గృహ నిర్మాణ శాఖ ఇనచార్జి డీఈగా పనిచేస్తున్నారు. ఆయన భార్య మీరాతో కలిసి ఆసిఫాబాద్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. పెద్దమ్మాయి స్వాతి (33) బీటెక్ పూర్తి చేసి వరంగల్‌లో అమ్మమ్మతో ఉంటోంది. చిన్నకూతురు నీలిమ (27) ఎంటెక్, కుమారుడు శివరామకృష్ణ (25) బీటెక్ చేస్తూ హైదరాబాద్‌లో హాస్టల్లో ఉంటున్నారు.
సత్యన్నారాయణ ఉద్యోగ జీవితంలో ఎన్నో ఎగుడుదిగుడులు ఉన్నాయి. ఆయన వనపర్తిలో పాలిటెక్నిక్ పూర్తి చేసి చేర్యాలలో హౌసింగ్‌లో వర్క్ ఇనస్పెక్టర్‌గా పనిచేశారు. తరువాత ఏఈగా ప్రమోషన్ పొందినా కొద్దికాలంలోనే సస్పెండయ్యారు. తిరిగి ఉద్యోగంలో చేరి జనగామ, హన్మకొండ, కరీంనగర్ల్లో పనిచేస్తూ మళ్లీ సస్పెండయ్యారు. పదేళ్లు ఉద్యోగం లేక తీవ్రమనోవేదనకు గురయ్యారు. తరువాత మూడేళ్ల కిందట ఆసిఫాబాద్‌లో ఉద్యోగంలో చేరారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో పెద్దకూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరకపోవటం, ఇంట్లో మనస్పర్ధలు… సమస్యలున్నాయి. తమ్ముడి కూతురికి పెళ్లి కావటంతో సత్యన్నారాయణ తమ కుమార్తె పెళ్లి చేయలేకపోయామని మరింతగా కుంగిపోయారు.
ఈ క్రమంలో అనారోగ్యం పాలైన సత్యన్నారాయణను చికిత్సకోసం హైదరాబాద్‌కు తీసుకువెళ్లిన కుటుంబ సబ్యులు తిరిగి కారులో వరంగల్ వస్తున్నారు. మార్గ మధ్యంలో భువనగిరి హోటల్లో భోంచేసిన తల్లీ పిల్లలు…తిరిగి కారు వద్దకు వచ్చేసరికి సత్యన్నారాయణ ఉలుకుపలుకు లేకుండా స్పృహలో లేకపోవటం చూసి ఆందోళనతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు సత్యన్నారాయణ మరణించినట్టుగా చెప్పారు. కుటుంబ పెద్ద మరణంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు గురయిన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పటికే రాత్రి 11 గంటలు అవుతుండటంతో మృతదేహంతో తిరిగి హైదరాబాద్‌వైపు ప్రయాణం మొదలుపెట్టారు. ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద హెచ్‌పీసీఎల్ డిపో సమీపంలో హైవే నుంచి పక్కగా వెళ్లి కారును ఆపారు.
సత్యనారాయణ మృతదేహాన్ని సీట్ బెల్ట్‌తో కట్టి కారులోనే ఉంచి, వారంతా దగ్గరలోని రైలు పట్టాలపైకి వెళ్లి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు.
శనివారం ఉదయాన రైల్వే ట్రాక్‌పై మృతదేహాలున్నాయన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే ట్రాక్‌పై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది. ట్రాక్ సమీపంలోనే పార్క్ చేసివున్న కారులో సత్యనారాయణ మృతదేహాన్ని, ఆస్పత్రి కేస్ షీట్‌ను గుర్తించిన పోలీసులు కారులో ఉన్న ఫోన్లోని నంబర్ల ఆధారంగా మృతుడి సోదరుడు రవీందర్‌కు సమాచారమమిచ్చారు. ఆయన వచ్చి మృతులను గుర్తించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంతో బంధువులు తీవ్రంగా విలపించారు. తమ సోదరుడు సత్యనారాయణ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేదని.. ఎక్కడికెళ్లినా కుటుంబ సభ్యులంతా కలిసే వెళ్లేవారని రవీందర్ అన్నారు. కుమార్తెల పెళ్లి చేసేందుకు పలుసార్లు సంబంధాలు తెచ్చినా వారికి నచ్చేవి కాదని, ఏదోఒక వంకతో కాదనేవారని ఆయన అన్నారు.
తండ్రి అనారోగ్యం, ఆపై మరణం, చదువుకున్నా సరైన ఉద్యోగాలు దొరక్కపోవటం, వయసు పెరుగుతున్నా ఆడపిల్లలకు వివాహం కాకపోవడం…ఇవన్నీ వారిని బలవన్మరణానికి ప్రేరేపించి ఉంటాయని భావిస్తున్నారు. రైల్వే, స్థానిక పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సత్యనారాయణతో పాటు ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణల మృతదేహాలకు శనివారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సత్యనారాయణ తండ్రి ప్రకాశం వారందరికీ తలకొరివి పెట్టడం అందరినీ కలచివేసింది.
సత్యనారాయణకు ఇద్దరు సోదరులు ఉండగా.. ఆయన భార్య మీరాకు ఓ సోదరుడు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. కానీ ఆ కుటుంబం ఎవరితోనూ కలిసేది కాదని తెలుస్తోంది. అయితే వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కారుని సైతం ఇటీవలే కొన్నారని బంధువులు పేర్కొన్నారు. కొన్నాళ్లుగా సత్యన్నారాయణ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా…ఆయనకు నయమైతేనే కానీ పిల్లలకు పెళ్లిళ్లు కావనే భావనలో వారు ఉండేవారని తెలిపారు. ఏదిఏమైనా అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా….జీవితం పట్ల కాస్త నమ్మకాన్ని కూడగట్టుకోలేకపోయిన ఆ కుటుంబం ఈ ప్రపంచంలో కుటుంబ పెద్ద లేకుండా బతకలేమనే నిర్ణయానికి రావటం అత్యంత విషాదం.