బిజెపితో స్నేహం....శివసేనకు 25ఏళ్ల కాలం వృథా! -ఉద్ధవ్ థాకరే
బిజెపితో దోస్తీ కారణంగా శివసేనకు 25ఏళ్ల కాలం వృథా అయిందంటూ… శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ పార్టీ అధికార పత్రిక సామ్నాలో అనేక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. బిజెపి, శివసేన 25ఏళ్లపాటు కలిసిమెలసి ముందుకు సాగాయన్నారు. అయితే గత మహారాష్ట్ర ఎన్నికల్లో రెండింటి మధ్య సయోధ్య కుదరక ఒంటరిగా పోటీ చేసిన పరిణామాలు, ఇంకా ఈ మధ్య కాలంలో ఇరుపార్టీల […]
బిజెపితో దోస్తీ కారణంగా శివసేనకు 25ఏళ్ల కాలం వృథా అయిందంటూ… శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ పార్టీ అధికార పత్రిక సామ్నాలో అనేక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. బిజెపి, శివసేన 25ఏళ్లపాటు కలిసిమెలసి ముందుకు సాగాయన్నారు. అయితే గత మహారాష్ట్ర ఎన్నికల్లో రెండింటి మధ్య సయోధ్య కుదరక ఒంటరిగా పోటీ చేసిన పరిణామాలు, ఇంకా ఈ మధ్య కాలంలో ఇరుపార్టీల మధ్య తలెత్తుతున్న విభేదాలపై వ్యాఖ్యానిస్తూ…శివసేన 25 సంవత్సరాల కాలాన్ని వృథా చేసుకుందన్నారు. ఈ ఇరవై అయిదేళ్ల స్నేహం చివరికి ఫలించని వృథా ప్రయాసగా మిగిలిందన్నారు.
మొదట్లో హిందుత్వ భావన రెండు పార్టీలను దగ్గర చేసిందని, కానీ ఇప్పుడు ఎందుకు కలిసి ఉండాలి…అనే విషయం గురించి ఆలోచించాల్సి ఉందన్నారు. గత ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో మొదలైన విభేదాలు…అనంతర పరిణామాల తరువాత… రెండు పార్టీల మధ్య అగాథం అలాగే ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్నా శివసేన పలు విషయాల్లో తన పంథా వేరని చాటుతూనే ఉంది.
ప్రభుత్వంలో ఉంటూనే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించగా థాకరే… అందుకే మేము ఎందుకు కలిసుండాలి…అనే విషయాన్ని మరొకసారి ఆలోచించుకోవాల్సి వస్తోందన్నారు. నాకుగానీ, నా పార్టీకి గానీ సరైన గౌరవం లేదనిపించినపుడు వెంటనే నేను ప్రభుత్వం నుండి తప్పుకుంటానని థాకరే చెప్పారు. అయితే తానెప్పుడూ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయలేదని, ఉన్నది ఉన్నట్టుగా మొహంమీదే చెప్పామని వెనుక గోతులు తవ్వలేదని ఆయన అన్నారు. తమ రెండు పార్టీలు ఒక స్థిరత్వం లేని వాతావరణాన్ని సృష్టించుకునే ఫ్రెనిమీస్…(ప్రెండ్..ఎనిమి కలిసి) అని ఆయన అభివర్ణించారు. అయినా తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో టచ్‌లోనే ఉంటానని, ఈ మధ్యే తామిద్దరూ కలిసి మాతోశ్రీ (థాకరే ఇల్లు)లో భోజనం చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి అంకితభావాన్ని, ఆయన అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని గమనిస్తూనే ఉంటానని, ఆయన భవిష్యత్తులో మరింత బాగా పనిచేయాలని ఆశిస్తున్నానని థాకరే అన్నారు.