అతని కారణంగానే మరణిస్తూ...అతని భార్యగానే గుర్తింపు పొందాలని..!
ఓ పక్క సంస్కృతీ సంప్రదాయాలు ఎక్కించిన భావజాలం…దాంతో మగవాడు మోసం చేస్తే తట్టుకోలేని బేలతనం, మరొక పక్క ప్రేమ , పెళ్లి విషయంలో సొంత నిర్ణయాలకు ప్రోత్సహిస్తున్న ఆధునిక సమాజ పరిస్థితులు…ఈ రెండింటి మధ్య ఇప్పుడు చాలామంది ఆడవాళ్లు నలిగిపోతున్నారు. అలాంటి స్థితిలోనే ఓ యువతి తాను మరణిస్తే…తన శవానికి ప్రేమించి మోసం చేసిన యువకుడితో తాళి కట్టించి, అతనితోనే అంత్యక్రియలు జరిపించాలని కోరింది. ఓ పక్క అతని కారణంగానే మరణిస్తూ, మరో పక్క అతని భార్యగా […]
ఓ పక్క సంస్కృతీ సంప్రదాయాలు ఎక్కించిన భావజాలం…దాంతో మగవాడు మోసం చేస్తే తట్టుకోలేని బేలతనం, మరొక పక్క ప్రేమ , పెళ్లి విషయంలో సొంత నిర్ణయాలకు ప్రోత్సహిస్తున్న ఆధునిక సమాజ పరిస్థితులు…ఈ రెండింటి మధ్య ఇప్పుడు చాలామంది ఆడవాళ్లు నలిగిపోతున్నారు. అలాంటి స్థితిలోనే ఓ యువతి తాను మరణిస్తే…తన శవానికి ప్రేమించి మోసం చేసిన యువకుడితో తాళి కట్టించి, అతనితోనే అంత్యక్రియలు జరిపించాలని కోరింది. ఓ పక్క అతని కారణంగానే మరణిస్తూ, మరో పక్క అతని భార్యగా గుర్తింపు పొందాలని ఆరాట పడటం…దీన్ని ఎలా చూడాలో తెలియని స్థితి.
గుంటూరు జిల్లాలోని నిజాం పట్నంకి చెందిన జ్యోతి, బాపట్లకు చెందిన తన్నీరు బాల మురళీ కృష్ణ ప్రేమించుకున్నారు. జ్యోతి ప్రస్తుతం ఏడవనెల గర్భిణి కాగా, అతను మూడునెలల క్రితం మరొక వివాహం చేసుకున్నాడు. జ్యోతికి ఈ విషయం తెలిసి వెళ్లి ప్రశ్నిస్తే, ఆమె గర్భానికి తనకు సంబంధం లేదన్నాడు. దాంతో ఆమె బాలమురళీ కృష్ణ ఇంటిముందే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు వదిలింది. అయితే మరణవాంగ్మూలంలో జ్యోతి తాను కిరోసిన్ పోసుకుని బెదిరిస్తుండగానే బాలమురళీకృష్ణ తల్లి తనకు నిప్పు అంటించిందని తెలిపింది.
పోలీసులు ఆమెరాసిన సూసైడ్ లేఖని స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను మరణిస్తే, బాల మురళీ కృష్ణ చేత తాళి కట్టించి, అతనితోనే అంత్యక్రియలు జరిపించాలని జ్యోతి కోరింది. పోలీసులు మురళీ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కడుపులోని శిశువుతో సహా జ్యోతి ఫలించని ప్రేమకు బలైపోయింది. ఇంతకు ముందు ఓ ప్రొఫెసర్ కూడా ఇలాగే ప్రేమించినవాడికి దూరంగా ఉండలేక ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రేమలో మోసపోతే ఆడవాళ్లు తమని తాము ఎందుకు ఇంతగా హింసించుకుంటున్నారు. ఒక మగవాడికి చెందిన మనిషిగా గుర్తింపు పొందాలనే తపన….మహిళల్లో యధాతథంగా ఉండటమే ఇందుకు కారణం. ప్రేమ నుండి పెళ్లి వరకు ఉన్నది ఒకే ప్రయాణంగా కనబడుతున్నా ఇందులో దశలున్నాయి. ప్రేమిస్తున్నపుడు వారిద్దరూ తమ జీవితాలు తమ ఇష్టం అన్నట్టుగా భావిస్తారు. ప్రేమలో ఉన్న స్త్రీ తాను ప్రేమిస్తున్నవాడి నుండి పూర్తిగా గౌరవాన్ని పొందుతున్నట్టుగా భావిస్తుంది. అతను తనకా స్థానాన్ని ఇవ్వటం లేదనే విషయాన్ని అప్పుడు ఆమె గుర్తించలేకపోతుంది. తీరా తాను మోసపోయానని తెలిసినపుడు…ఇప్పటివరకు అతని దృష్టిలో తన స్థానమేంటి…అనే అనుమానం వస్తుంది…పెళ్లి చేసుకోనపుడు సమాజం కూడా ఇదే ప్రశ్న వేస్తుంది. దాంతో ఆమె అహం దెబ్బతింటోంది…
ప్రేమ విషయంలో స్పష్టత, అవగాహన ఉంటే అప్పుడు ఇద్దరి మధ్య గౌరవం ఉంటుంది. కేవలం భావోద్వేగాల కారణంగా కలిగిన ప్రేమ…కొంతకాలానికి మాయం కాగానే, వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నారు. తమ మనసులో ఉన్నగాఢమైన ఫీలింగ్స్ కి సమాజంలో గౌరవం లేదని, పెళ్లిగా మారకపోతే…వాటి రూపురేఖలు మారిపోతాయనే భయంతో, అవమానంతో, ఉక్రోషంతో, సెల్ఫ్‌పిటీతో ఆడవాళ్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
మోసపోవటం అనేది ఏ మనిషికైనా బాధనే కలిగిస్తుంది. కానీ ఆడవాళ్ల దురదృష్టం ఏమిటంటే….ఆమె జీవితంలో మోసపోకూడదు. మగవాడు మోసపోతే అది అతడి అమాయకత్వం…ఆడవాళ్లు మోసపోతే అది వారి అహంకారానికి పనిష్‌మెంట్‌గా ఇప్పటికీ భావిస్తున్నారు. మోసం చేసిన మగవాడికి ఓ కొత్త జీవితం సిద్ధంగా ఉంటుంది. కానీ మోసపోయిన ఆడదానికి మాత్రం…కొత్త జీవితం కాదు కదా…అసలు జీవితమే లేదేమో అనిపిస్తుంది. ఈ నిరాశే ఆత్మహత్యలకు దారితీస్తోంది. మోసం చేసిన వ్యక్తిని భర్తగా భావించడానికి ఆడవాళ్ల మనసు సహకరిస్తోందంటే…మోసపోయినందుకు అది తమకు తాము విధించుకుంటున్న శిక్షగా భావించాలి. అంటే వాళ్లుకూడా…సమాజంలాగే జరిగిన మోసాన్ని..జీవితం నుండి విడదీసి చూడలేకపోతున్నారు. మోసపోవటం అనేది తమ తప్పుగానే భావిస్తున్నారు.
-వి.దుర్గాంబ