స్వేచ్ఛ

మాటల్ని వల్లించడం సత్యం కాదు. శాస్త్రాల్ని తెలిసి ఉండడం సత్యం కాదు. మనిషి మాటల్లో మునిగిపోయాడు. మనిషి చెరసాలలో ఉన్నాడు. కానీ తాను స్వేచ్ఛగా ఉన్నానని అనుకుంటున్నాడు. అట్లాంటి మనిషికి స్వేచ్ఛ ఇచ్చినా అతను దాన్ని అనుభవించలేడు. బానిసత్వానికి అలవాటు పడితే మనిషికి స్వాతంత్య్రమిచ్చినా స్వీకరించలేడు. వాదాలతో, శాస్త్రాలతో, మాటలలో సత్యం మరుగున పడిపోయింది. అందువల్ల మనం వాటికి అలవాటు పడిపోయాం. సత్యాన్ని గుర్తించే అర్హతను కోల్పోయాం. దీన్ని బట్టి ఎవరయితే అస్థిత్వాన్ని గుర్తించలేరో, తమ లోలోతుల్లోకి […]

Advertisement
Update:2016-07-04 18:31 IST

మాటల్ని వల్లించడం సత్యం కాదు. శాస్త్రాల్ని తెలిసి ఉండడం సత్యం కాదు. మనిషి మాటల్లో మునిగిపోయాడు. మనిషి చెరసాలలో ఉన్నాడు. కానీ తాను స్వేచ్ఛగా ఉన్నానని అనుకుంటున్నాడు. అట్లాంటి మనిషికి స్వేచ్ఛ ఇచ్చినా అతను దాన్ని అనుభవించలేడు. బానిసత్వానికి అలవాటు పడితే మనిషికి స్వాతంత్య్రమిచ్చినా స్వీకరించలేడు. వాదాలతో, శాస్త్రాలతో, మాటలలో సత్యం మరుగున పడిపోయింది. అందువల్ల మనం వాటికి అలవాటు పడిపోయాం. సత్యాన్ని గుర్తించే అర్హతను కోల్పోయాం. దీన్ని బట్టి ఎవరయితే అస్థిత్వాన్ని గుర్తించలేరో, తమ లోలోతుల్లోకి వెళ్లి తమ అసలు స్వరూపాన్ని చూడలేరో వాళ్లు సత్యాన్ని గ్రహించలేరు. ఒక పర్వతం మీద ఒక సత్రం ఉండేది. దూర ప్రయాణాలు చేసేవాళ్లు అందులో బస చేసేవాళ్లు. పుణ్యక్షేత్రాలు దర్శించుకునే వాళ్లు ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్లు. ఎందుకంటే ఆ పర్వతం మీద గొప్ప ఆలయముంది. ఆలయాన్ని సందర్శించాలనుకున్న వాళ్లు ఆ సత్రంలో దిగేవాళ్లు.

ఆ సత్రం యజమాని దగ్గర ఒక చిలుక ఉండేది. దాన్ని పంజరంలో పెట్టి సత్రం ముందు పంజరాన్ని వేలాడదీశాడు. దాన్ని ఎంతో ముద్దుగా చూసుకునేవాడు. దానికి పళ్ళు, ఫలాలు తినిపించేవాడు. దానికి స్వేచ్ఛ అన్నమాట నేర్పించాడు. అది ఎప్పుడూ ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటల్ని వల్లిస్తూ ఉండేది. సత్రంలో దిగిన వాళ్లకు గొప్ప వినోదంగా ఉండేది. వాళ్ళు కూడా దానికి తినడానికి ఏమైనా పెట్టేవాళ్లు. వాళ్ళు పెట్టినది తింటూ అది ‘స్వేచ్ఛ,స్వేచ్ఛ’ అని అరుస్తుండేది. రాత్రయినా పగలయినా అవే మాటల్ని వల్లిస్తూ ఉండేది. నిజానికి ఆ పక్షికి స్వేచ్ఛ అనే మాటకు అర్థం తెలీదు. అది ఉన్నది పంజరంలో. తను స్వేచ్ఛగా లేనని, పంజరంలో ఉన్నానని, స్వేచ్ఛ అనే మాటకు తనకు అర్థం తెలీదని దానికి స్పృహ లేదు.

ఇట్లా ఉంటే ఒక సారి వివేకవంతుడయిన ఒక వ్యక్తి ఆ సత్రంలో దిగాడు. చీకటిపడుతుండగా ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వినిపించడంతో చుట్టూ చూశాడు. సతం ముందు పంజరంలో చిలుక ఆ మాటలు వల్లిస్తున్నట్లు తెలుసుకుని విస్తుపోయాడు. పంజరం దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. అతన్ని చూసి చిలుక ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంది. అది స్వేచ్ఛగా లేదని ఆమాటకు దాని అర్థం తెలీదని అది పంజరంలో ఉందని అతనికి తెలుసు. అతనికి స్వేచ్ఛ అంటే ఏమిటో స్వాతంత్య్రమంటే ఏమిటో తెలుసు. అతను వెంటనే పంజరం తలుపు తెరచి చిలుకను బయటకు లాగడానికి ప్రయత్నించాడు. ఆ చిలుక బయటకు రావడానికి ఇష్టపడలేదు. అతను బలవంతంగా బయటకు తీసి వదిలిపెట్టినా మళ్లీ పంజరంలోకి వెళ్లింది. ఎప్పటిలా ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అని అరవడం మొదలుపెట్టింది. రెండుమూడు సార్లు అతను ప్రయత్నించాడు. చివరకు నాలుగోసారి దాన్ని పట్టుకుని దూరంగా వెళ్లి ఆకాశంలోకి వదిలిపెట్టాడు. అది ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంటూ ఎగిరిపోయింది.

ఆవ్యక్తి ఆనందంతో సత్రానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారు జామునే ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వనిపించాయి. నిద్రమత్తు వదిలించుకుని అతను లేచి సత్రం ముందుకు వచ్చి చూశాడు. చిలుక పంజరంలో దూరి ‘స్వేచ్ఛ!స్వేచ్చ!’ అంటూ ఉంది.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News