సన్యాసి " వేశ్య

భౌతికంగా జరిగే మార్పుల వల్ల మనుషుల్లో ఎట్లాంటి పరివర్తనా జరగదు. మానసికమయిన మార్పులవల్లే మనుషుల్లో పరివర్తన కలుగుతుంది. మనసులో కాంతి ఉంటే ఆచరణలో కూడా ఉంటుంది. తమని తాము మార్చుకోవాలని ఆశించే వాళ్లని ఆశ వెంటాడుతుంది. వాళ్లు హృదయ పరివర్తన గురించి ఆలోచించరు. పైపై మార్పులతో తృప్తి పడిపోతారు. మనిషి నిత్యచైతన్యంతో ఉండాలి. తను బాహ్యమయిన మార్పుల్ని కోరుకుంటున్నాడా? అంతరంగికమైన పరివర్తనని కోరుకుంటున్నాడా? అన్న స్పృహతో ఉండాలి. అప్పుడు అంతా సవ్యంగా ఉంటుంది. లేకుంటే అంతా అస్తవ్యస్తమవుతుంది. […]

Advertisement
Update:2016-06-27 18:31 IST

భౌతికంగా జరిగే మార్పుల వల్ల మనుషుల్లో ఎట్లాంటి పరివర్తనా జరగదు. మానసికమయిన మార్పులవల్లే మనుషుల్లో పరివర్తన కలుగుతుంది. మనసులో కాంతి ఉంటే ఆచరణలో కూడా ఉంటుంది. తమని తాము మార్చుకోవాలని ఆశించే వాళ్లని ఆశ వెంటాడుతుంది. వాళ్లు హృదయ పరివర్తన గురించి ఆలోచించరు. పైపై మార్పులతో తృప్తి పడిపోతారు.

మనిషి నిత్యచైతన్యంతో ఉండాలి. తను బాహ్యమయిన మార్పుల్ని కోరుకుంటున్నాడా? అంతరంగికమైన పరివర్తనని కోరుకుంటున్నాడా? అన్న స్పృహతో ఉండాలి. అప్పుడు అంతా సవ్యంగా ఉంటుంది. లేకుంటే అంతా అస్తవ్యస్తమవుతుంది.

ఒక పట్టణంలో ఒకేసారి ఒక సన్యాసి ఒక వేశ్య చనిపోయారు. ఆసన్యాసి ఆశ్రమం చాలా పేరుపొందింది. దేశవిదేశ భక్తులు వచ్చేవాళ్లు. ఆశ్రమంలో ఎన్నో యజ్ఞాలు, యాగాలు జరుగుతూ ఉండేవి. ఆ సన్యాసి గొప్ప జ్ఞానిగా పేరుపొందాడు. ఆయన సర్వశాస్త్ర పారంగతుడు. తన బోధనల్తో జనాల్ని ఊగించేవాడు. తన ప్రతిభతో ఆట్టుకునేవాడు.

అతని ఆశ్రమానికి సమీపంలోనే వేశ్య గృహం ఉండేది. ఎందరో విటులు ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాళ్లు. సన్యాసి ఇదంతా గమనిస్తూఉండేవాడు. తన బోధనలు వినిపిస్తున్నా ప్రార్థనలు చేస్తువున్నా వాటి వెనుక వేశ్యకు సంబంధించిన ఆలోచనలు మెదుల్తూ ఉండేవి. నేను శాస్త్రాల గురించి, సర్వసంగపరిత్యాగం గురించి చెప్పుకుంటూ కాలం గడుపుతూ

ఉంటే… ఈ వేశ్య మాత్రం ఎందరు విటులతో ఆనందాన్ని పొందుతోంది. సుఖాన్ని అనుభవిస్తోంది. జీవితమంటే ఆమెది కదా! అదృష్టమంటే ఆమెది కదా! అని అనుకుంటూ ఉండేవాడు.

ఆ వేశ్య ఎప్పుడయినా ఆ ఆశ్రమం ముందు నడిచిపోతూ ‘ఈ సన్యాసి ఎంత పవిత్ర జీవితం గడుపుతున్నాడు? నిత్యభగవన్నామ సంకీర్తనతో ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. జీవితమంటే ఆయనదే కదా! నాది నీచమయిన బతుకు. హీనమయిన బతుకు. పూర్వజన్మలో పాపం చేసుకుని నేను ఈ వేశ్యజన్మ ఎత్తాను” అని పశ్చాత్తాపంతో కుమిలిపోయేది.

సన్యాసి, వేశ్య ఏకకాలంలో మరణించారు. దేవదూతలు వేశ్యని స్వర్గానికి తీసుకెళ్లారు. యమభటులు సన్యాసిని నరకానికి తీసుకెళ్లారు. అప్పుడు సన్యాసి యమభటుల్ని ఆపి ”ఆగండి! ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిత్య సత్య ప్రవచనాలతో నిర్మలమైన జీవితం గడిపిన యోగిని నేను. నేను ఎట్లాంటి పాపకార్యాలు చెయ్యలేదు. నన్నెందుకు నరకానికి తీసుకెళుతున్నారు? అనునిత్యం వేశ్యావృత్తిలో ఉంటూ పాప పంకిల జీవితం గడిపిన ఆ వేశ్యను దేవదూతలు స్వర్గానికి ఎందుకు తీసుకెళుతున్నారు? నేను దేవదూతలతో స్వర్గానికి, ఆమె యమభటుల్తో నరకానికి వెళ్లాలి” అన్నాడు. యమ భటులు కిందకు చూడమాన్నారు. ఆ సన్యాసి శవాన్ని పూలరథంలో ఊరేగిస్తూ వేలమంది జనం వెంట వెళుతున్నారు. భగవన్నామసంకీర్తతో పరిసరాలు ప్రతిధ్యనిస్తున్నాయి. ఆ దృశ్యం చూసి సన్యాసి ఆనందించాడు. మరోవేపు వేశ్య శరీరాన్ని ఖననం కూడా చెయ్యకుండా శ్మశానంలో ఒక మూల పడేశారు. ఎవరూ పట్టించుకోలేదు. కాకులు,గద్దలు పీక్కుతింటున్నాయి.

సన్యాసి యమ భటుల్తో ”చూశారు కదా నా గొప్పతనం నా పవిత్రత” అన్నాడు. యమభటులు ”ప్రపంచంలో కనిపించడానికి మనసులోపల ఉన్నదానికి చాలా తేడా

ఉంటుంది. ప్రపంచం పైపైన జరిగే దాన్నే పట్టించుకుంటుంది. నువ్వు బతికి ఉన్నన్ని రోజులు వేశ్య గురించే ఆలోచించావు. ఆమె అంతులేని సుఖాలలో ఓలలాడుతుందనే అనుకున్నావు. నీ జీవితంలో ఆనందం లేదని, అర్థం లేదని అనుకుంటూ గడిపావు. కానీ ఆ వేశ్య తాను నీచ వృత్తిలో ఉన్నా పవిత్రమైన హృదయంతో పరితపించింది. నువ్వు పైపైన దేవుణ్ణి భజన చేస్తే ఆమె పరవశంగా భగవంతుణ్ణి కీర్తించింది. నిన్ను అదృష్టవంతుడవని నీది ఉత్తమజీవితమని తలపోసింది. అందుకే ఆమెకు స్వర్గప్రాప్తి. నీకు నరక ప్రాప్తి” అన్నారు.

సన్యాసి స్థాణువైపోయాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News