ఎవడు రాజు?

ఒక రాజు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. రాజ్యాన్ని రక్షించుకునే ఆలోచనల్తో ఆశాంతిగా ఉండేవాడు. ప్రతిమనిషి అధికారం కోసం అర్రులు చాస్తాడు. అందర్నీ బానిసలు చేసుకున్నవాడు అధికారానికి బానిస అవుతాడు. అహంకారంలో అందుకున్న దానిలో స్వర్గముండదు. నరకముంటుంది. దూరం నించీ చూస్తే అది స్వర్గంలా అనిపిస్తుంది. దగ్గరికి వెళితే సింహాసనంలో ముళ్లుంటాయి. రాత్రింబవళ్లు రాజు నిరంతరం ఆందోళనలో గడిపేవాడు. తన మనసుపడే బాధల నుండి విముక్తి పొందాలని తపించేవాడు. ఈ బాధల నించి విముక్తి పొందాలంటే తను చక్రవర్తి […]

Advertisement
Update:2016-06-26 18:31 IST

ఒక రాజు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. రాజ్యాన్ని రక్షించుకునే ఆలోచనల్తో ఆశాంతిగా ఉండేవాడు. ప్రతిమనిషి అధికారం కోసం అర్రులు చాస్తాడు. అందర్నీ బానిసలు చేసుకున్నవాడు అధికారానికి బానిస అవుతాడు. అహంకారంలో అందుకున్న దానిలో స్వర్గముండదు. నరకముంటుంది. దూరం నించీ చూస్తే అది స్వర్గంలా అనిపిస్తుంది. దగ్గరికి వెళితే సింహాసనంలో ముళ్లుంటాయి. రాత్రింబవళ్లు రాజు నిరంతరం ఆందోళనలో గడిపేవాడు. తన మనసుపడే బాధల నుండి విముక్తి పొందాలని తపించేవాడు. ఈ బాధల నించి విముక్తి పొందాలంటే తను చక్రవర్తి కావాలి, అన్ని ఇతర రాజ్యాల్ని ఆక్రమించుకోవాలి. అప్పుడు తనకు ప్రశాంతత దొరుకుతుందేమో అని ఆ పనిలో పడి యుద్ధాలు చేస్తూ పోయాడు.

కాలం గడుస్తోంది. తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నాడు. దాంతోబాటు అతనికి అశాంతి, ఆందోళన పెరుగుతూ పోతున్నాయి. అతను కలలు కంటూ పోతున్నాడు. లేని భవిష్యత్తు కోసం, రాని భవిష్యత్తు కోసం ఆరాటంతో సాగిపోతున్నాడు. అధికారకాంక్ష అతన్లో అశాంతితో బాటు రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. రాజు నడివయస్సు దాటాడు. బలం తగ్గింది. పెద్దవాడయ్యాడు కదా! అందుకోవలసింది మరణమొక్కటే. ఆ ఆలోచనల్తో అతన్లో మరింత గుబులు రేగింది.

మనిషి యవ్వన దశలో ఏ విత్తనాల్ని నాటుతాడో మలిదశలో ఆ పంటనే అందుకోవాలి. అధికారకాంక్ష, ఆధిపత్యం రాజు యవ్వనాన్ని ఆక్రమించుకుని ఉండేవి. ఇప్పుడు పెద్దవాడయ్యాక అవే విషఫలాల్ని అందిస్తున్నాయి. ఎక్కడో మనసు పొరల్లో దిగులు,బాధ ఏదో సాధించాలని తపన,భౌతికమయిన సంపదలతో, సామ్రాజ్యాలతో ఆ తపన మరింత ఎక్కువవుతోంది. కానీ కాంక్షల్ని వదులుకోవడానికి సిద్దంగా లేడు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ ఆశ అతన్ని చావనివ్వలేదు.ఒక రోజు ఎవరికీ తెలీకుండా ఏకాంతంగా నగరాన్ని వదిలి ఒంటరిగా గ్రామసీమలవేపు వెళ్ళాడు. తనతోబాటు తన ఆలోచనల్ని, ఆరాటాల్ని మోసుకెళ్లాడు. దూరంగా పచ్చికబయల్లో పిల్లంగోవి శబ్ధం వినిపిస్తే అటువేపు వెళ్లాడు. అక్కడ ఆనందంగా ఒక పశువుల కాపరి పిల్లంగోవి ఊదుతూ కనిపించాడు. పశువులు పచ్చిక మేస్తూ ప్రశాంతంగా ఉన్నాయి. రాజు అతన్ని చూసి ”నువ్వు పశువుల కాపరివి. పేదవాడివి. కానీ సామ్రాజ్యాన్ని జయించినంత సంతోషంగా పిల్లంగోవిని ఊదుతున్నావు. ఇంత ప్రశాంతంగా ఆరాటం లేకుండా ఉండడం నీకెలా వీలయింది?” అన్నాడు.

దానికి యువకుడయిన ఆ పశువుల కాపరి ”అయ్యా! నాకు రాజ్యాలు వద్దు. ఇవ్వవద్దని కూడా దేవుణ్ణి కోరుతాను. రాజ్యం లేకుండానే నేను రాజుని. కానీ రాజ్యం వస్తేమటుకు నేను రాజును కాను” అన్నాడు. రాజు ఆశ్చర్యంగా ”నీ మాటల్లో ఏదో అంతరార్థం ఉంది. కానీ నువ్వు రాజును అంటున్నావు. ఏ విధంగా నువ్వు రాజువి!”

పశువుల కాపరి ”అయ్యా! నేను రాజ్యం వల్ల, ఐశ్యర్యం వల్ల రాజుని కాను. స్వేచ్ఛతో, స్వాతంత్య్రంతో రాజునయ్యాను. నేను నేనుగా ఉన్నాను. నా కళ్లతో ఈ మనోహరమయిన ప్రకృతి ఆస్వాదించే వీలు, వెసులుబాటు నాకు ఉంది. హృదయపూర్వకంగా ప్రేమించే నిర్మలత్వం నాదగ్గరుంది. సూర్యుడు రాజుకిచ్చిన కాంతినే నాకూ యిస్తాడు. పూలు రాజుకోసం విచ్చుకున్నట్లే నాకోసం కూడా విచ్చకుంటాయి. వాటిని చూసి ఆనందించిన నా కళ్లు మనసు నాకున్నాయి. కానీ రాజుకు అహంకారంతో వీటిని ఆస్వాదించే సమయముండదు. కారణం అతను రాజ్యకాంక్షలో అన్నీ కోల్పోతాడు. అందువల్ల రాజుకంటే నేనే గొప్పవాణ్ణి” అన్నాడు. పశువుల కాపరి మాటల్తో రాజు అహంకారం అదృశ్యమైంది.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News