ఇక జనంపై వాస్తు పన్ను?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వాస్తు పిచ్చి నసాళానికి ఎక్కివుంది. మామూలు మనుషులకు వాస్తు పిచ్చివుంటే ఇంట్లో అటువాకిలి తీసి ఇటుపెట్టి, ఇటు గోడ పగులకొట్టి అటుపెట్టి అలాంటి పనులకు తమ డబ్బంతా తగలేస్తూవుంటారు. వాళ్ల సొంతడబ్బు కాబట్టి, వాళ్ల కష్టార్జితం కాబట్టి వాళ్లు ఎలా ఖర్చుపెట్టుకున్నా వాళ్ల ఇష్టం. అభ్యంతరాలేమైనా వుంటే వాళ్ల కుటుంబ సభ్యులకు వుంటాయి. ఆర్ధికంగా నష్టపోతే వాళ్లు నష్టపోతారు. కానీ మన ముఖ్యమంత్రుల పరిస్థితి అలా కాదు. వాళ్లకు వాస్తు నమ్మకాలు […]

Advertisement
Update:2016-06-15 09:11 IST

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వాస్తు పిచ్చి నసాళానికి ఎక్కివుంది. మామూలు మనుషులకు వాస్తు పిచ్చివుంటే ఇంట్లో అటువాకిలి తీసి ఇటుపెట్టి, ఇటు గోడ పగులకొట్టి అటుపెట్టి అలాంటి పనులకు తమ డబ్బంతా తగలేస్తూవుంటారు. వాళ్ల సొంతడబ్బు కాబట్టి, వాళ్ల కష్టార్జితం కాబట్టి వాళ్లు ఎలా ఖర్చుపెట్టుకున్నా వాళ్ల ఇష్టం. అభ్యంతరాలేమైనా వుంటే వాళ్ల కుటుంబ సభ్యులకు వుంటాయి. ఆర్ధికంగా నష్టపోతే వాళ్లు నష్టపోతారు.

కానీ మన ముఖ్యమంత్రుల పరిస్థితి అలా కాదు. వాళ్లకు వాస్తు నమ్మకాలు వాళ్ల ఇళ్లల్లో మార్పులకు పరిమితమైతే మనకేం నష్టంలేదు. కానీ వాళ్ల ఆఫీసులు, క్యాంపు కార్యాలయాలు, అధికారిక నివాసాలు మొదలైన వాటిలో వాళ్ల పేరు బలాలను బట్టి, జన్మ నక్షత్రాలను బట్టి, నమ్మకాలను బట్టి ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కోట్ల రూపాయల ఖర్చుతో మార్పులు చేర్పులు చేస్తానంటే జనం భయపడిపోతున్నారు. ఆ డబ్బు ఎక్కడినుంచి రావాలి? జనం మీద వేసే పన్నులే కదా?

గత ముఖ్యమంత్రుల ఈ వాస్తు పిచ్చి ఖర్చు చాలా తక్కువ వుండేది. ఈసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుల వాస్తుపిచ్చికి వందల కోట్ల ప్రజల సొమ్మును తగలేస్తున్నారు.

బంగారు పంటలు పండే తుళ్లూరు ప్రాంతాన్నిరాజధానిగా ఎంపిక చేయడానికి కారణం ఈ వాస్తునమ్మకమే అంటారు. ఇక్కడ రాజధాని కడితే ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా వుండే అదృష్టం కలిసివస్తుందని ఎవరో చెప్పారట. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని వాస్తుకు అనుగుణంగా మార్చడానికి చాలా డబ్బు ఖర్చుపెట్టారట. అలాగే ఆయన సొంత ఇంటినుంచి బంజారాహిల్స్‌లోని అద్దె ఇంట్లోకి మారినప్పుడు కూడా ప్రభుత్వ ఖర్చుతో వాస్తుకు అనుగుణంగా చాలా మార్పులు చేయించారట. అక్కడినుంచి మరొక చోటికి మారినప్పుడు కూడా ఇదే తంతు. మళ్లీ అక్కడా వాస్తు సరిగ్గా లేదని మళ్లీ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు బస మార్పు. దీనికి రోజుకు లక్షల్లో ఖర్చు. ఇదంతా హైదరాబాద్‌ ఖాతాలో… ఇక విజయవాడలో మొదట బందర్‌ రోడ్‌లో, ఇప్పుడు కృష్ణానది కరకట్ట మీద లింగమనేని ఎస్టేట్‌లో బసకు ఇదే వాస్తు పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మార్పులు… ఇవి కాకుండా వాస్తుపేరుతో తెలియని ఖర్చులెన్నో. ఇవన్నీ చివరకు చెల్లించాల్సింది ప్రజలే.

కేసీఆర్‌ కూడా పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నా ఆయన వాస్తుపిచ్చికి జనం బెంబేలెత్తుతున్నారు. ఆయన క్యాంపు కార్యాలయాన్ని వాస్తుకు అనుగుణంగా అనేక మార్పులు చేయించారు. అది కూడా తనకు కావాల్సిన వాస్తు ప్రకారం లేదని మరో 30 కోట్లు ఖర్చుపెట్టి కొత్తగా క్యాంపు కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. అలాగే సెక్రటేరియట్‌ కూడా వాస్తుప్రకారం లేదని దానిని పడగొట్టి కొత్త సచివాలయం నిర్మించడానికి కృతనిశ్చయుడై వున్నాడు. దీని ఖర్చు నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు వుంటుందని అంచనా వేస్తున్నారు.

ఇరు రాష్ట్రాలలోనూ కొన్ని వేల స్కూళ్లల్లో మరుగుదొడ్లు లేవు. ఇరు రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వ ఆఫీసులు అద్దె ఇళ్లలో వుంటున్నాయి. ఇక తల దాచుకోవడానికి గూడులేని నిరుపేదలు లక్షల సంఖ్యలో వున్నారు. ఇవన్నీ వాళ్లకు తెలియనివి కావు. వాళ్ల ప్రాధాన్యాలు వారివి. ప్రజలకన్నా, వాళ్ల సంక్షేమం కన్నా వాస్తు కలిసొచ్చి ఎక్కువ కాలం తాము అధికారంలో వుండటం ముఖ్యం. అందుకోసం ప్రజల డబ్బును ఎన్నికోట్లయినా తగలేయడానికి సిద్దం. ఈ డబ్బు అంతా ఎక్కడినుంచి వస్తుంది? మళ్లీ పన్నులు వేయాలి. కొత్త టాక్స్‌లు విధించాలి. ఆదాయానికి కొత్త మార్గాలు అన్వేషించాలి…. ఈ శ్రమలన్నీ ఎందుకు? వాస్తు పన్ను వేస్తే పోలేదా? సర్వీస్‌ ట్యాక్స్‌లాగా..! అదీ ముందుగానే ఎన్నికల మ్యానిఫెస్టోలలోనే తాము అధికారంలోకి వస్తే వాస్తు పేరుతో ఎన్నికోట్లు తగలేస్తామో, వాస్తు పన్ను ఎంత విధిస్తామో ముందుగానే చెబితే ప్రజలు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కల్పిస్తే మంచిది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News