రాజీనామా చేయకుండానే.. కారెక్కుతున్న గుత్తా?
అనుకున్నదే అయింది.. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి చేరికకు అడ్డంకులు తొలగిపోయాయి. గుత్తాతోపాటు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతోపాటు మరికొందరు నాయకులు, వారి అనుచరుల చేరికకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా గులాబీ నేతలతో సీఎం కేసీఆర్ జరిపిన చర్చలు సఫలం కావడంతో గుత్తా చేరిక ఇక లాంఛనమే కానుంది. ఇతర పార్టీల నుంచి గెలిచిన నాయకులను మభ్యపెట్టి, టీఆర్ ఎస్ అక్రమంగా చేర్చుకుంటోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న సంగతి […]
Advertisement
అనుకున్నదే అయింది.. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి చేరికకు అడ్డంకులు తొలగిపోయాయి. గుత్తాతోపాటు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతోపాటు మరికొందరు నాయకులు, వారి అనుచరుల చేరికకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా గులాబీ నేతలతో సీఎం కేసీఆర్ జరిపిన చర్చలు సఫలం కావడంతో గుత్తా చేరిక ఇక లాంఛనమే కానుంది. ఇతర పార్టీల నుంచి గెలిచిన నాయకులను మభ్యపెట్టి, టీఆర్ ఎస్ అక్రమంగా చేర్చుకుంటోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న సంగతి తెలిసిందే! గుత్తా చేరికకు ముందు ఈ విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం జరిగింది. తమ పార్టీపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని కొంతలో కొంత తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. ఇందులో భాగంగానే.. కారు పార్టీలోకి చేరేముందు గుత్తా తన పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగానే.. పార్టీలో చేరినందుకు ప్రతిఫలంగా గుత్తాకు కేబినెట్ హోదా, ప్రభుత్వ సలహాదారు లేదా 2018లో రాజ్యసభ సీటు ఇస్తారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఎంపీ రాజీనామా చేస్తారన్న విషయంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే నిజమైంది.
ఏపీలో చేయలేదు కదా?
గుత్తా రాజీనామా విషయంలో ఇప్పటికే కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గుత్తాను రాజీనామా చేయకుండానే.. పార్టీలోకి రావాల్సిందిగా సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. సరిగ్గా ఇక్కడే ఏపీ పంథాను అనుసరించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీకి చెందిన ఎంపీ ఎస్పీవై రెడ్డి, విశాఖ ఎంపీ కొత్తపల్లి గీత సైకిలెక్కారు. దీనిపై వైసీపీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ గుత్తా రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరిగితే.. అదేసమయంలో అటు వైసీపీ కూడా టీడీపీపై ఒత్తిడి పెంచుతుంది. రెండేళ్లుగా వైసీపీ ఒత్తిడి చేస్తున్నా… పట్టించుకోని స్పీకర్ ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకునే పరిస్థితి లేదని.. ఒకవేళ ప్రతిపక్షాల నిరసనలు మరీ ఎక్కువైతే అప్పుడు ఆలోచిద్దామని కేసీఆర్ భరోసా ఇచ్చారని తెలిసింది. అంటే..రాజీనామా చేయకుండా గుత్తా కారెక్కుతాడన్నమాట! మొత్తానికి చంద్రబాబు బాటలో కేసీఆర్ కూడా ఆ విధంగా ముందుకు వెళుతున్నాడు.
Advertisement