నీకిది తగునా కోదండరామ్ ?
జేఏసీ చైర్మన్ కోదండరామ్ మాటలు తెలంగాణ రాజకీయాల్లో మంట పెట్టాయి. రెండేళ్లవుతున్నా ఎలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన వ్యాఖ్యానించడంపై పార్టీ అధిష్టానం ఆగ్రహించింది. ఆ వెంటనే మంత్రులంతా ఎవరికి వారు విలేకరుల సమావేశాలు పెట్టి మరీ కోదండరామ్ తీరును ఎండగట్టారు. నిన్నమొన్నటి దాకా తెలంగాణ పథకాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలను బహిరంగ వేదికలపై పొగిడింది మీరే కదా? ఈ పథకాలను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు కాచుకుని ఉన్నాయని, మాకు హితవు […]
జేఏసీ చైర్మన్ కోదండరామ్ మాటలు తెలంగాణ రాజకీయాల్లో మంట పెట్టాయి. రెండేళ్లవుతున్నా ఎలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన వ్యాఖ్యానించడంపై పార్టీ అధిష్టానం ఆగ్రహించింది. ఆ వెంటనే మంత్రులంతా ఎవరికి వారు విలేకరుల సమావేశాలు పెట్టి మరీ కోదండరామ్ తీరును ఎండగట్టారు. నిన్నమొన్నటి దాకా తెలంగాణ పథకాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలను బహిరంగ వేదికలపై పొగిడింది మీరే కదా? ఈ పథకాలను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు కాచుకుని ఉన్నాయని, మాకు హితవు పలికింది మీరే కదా? అని హరీశ్ రావు తో పాలు మంత్రులంతా నిలదీస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ప్రభుత్వానికి మద్దతుగా లేకున్నా.. ఎలాంటి వ్యతిరేక కార్యక్రమం, వ్యాఖ్యలు చేయలేదు. అలాంటిది రెండేళ్లలో సాధించింది శూన్యం? అని ఎలా అంటారని హరీశ్ మండిపడుతున్నారు. మా పాలనకు మెచ్చి ఇండియాటుడే, నీతిఆయోగ్ ఇచ్చిన అవార్డులు మీకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఇక జూపల్లి, తలసాని, ఈటెల, కడియం లాంటి వాళ్లయితే..టీడీపీ- కాంగ్రెస్‌లతో చేతులు కలిపారని నేరుగా ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పిన మీలో ఈ ఆకస్మిక మార్పుకు కారణమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఎంపీల వ్యాఖ్యలు మరింత ఘాటు..!
కోదండరామ్‌ను విమర్శించే క్రమంలో ఎంపీలు మరింత డోసు పెంచారు. కోదండరామ్ ను విషపు నాగుతో పోల్చారు. ఆయన వెనక ఎవరు ఉన్నారో తమకు తెలుసని ఎంపీ బాల్కసుమన్ విమర్శించారు. పోలవరం ముంపు మండలాలు ఆంధ్రలో కలిపితే.. మాట్లాడలేదు..తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీనేతలు దీక్షలు చేస్తుంటే కిమ్మనలేదు. ఉద్యోగుల విభజన, హైకోర్టు విభజనపై ఏనాడూ నోరెత్తలేదు. రాష్ట్రం విడిపోయినా.. చాలా సమస్యలు ఇంకా అలాగే ఉండిపోయాయి. ఇంతలోనే ఇంత అసహనం ఎందుకు? అని ప్రశ్నించారు. మీరు జేఏసీ చైర్మన్‌లా మాట్లాడటం లేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌లా మాట్లాడుతున్నారని ఎంపీ బాల్కసుమన్ ఆరోపించారు. పొరుగురాష్ట్రం పెడుతున్న పేచీలపై ఏనాడూ నోరు తెరవని మీరు,, సొంతరాష్ట్ర సీఎం చేపడుతున్న పనులను విమర్శించడంలోనే మీ అంతరార్థం ప్రజలకు అర్థమవుతుందన్నారు. మీలాంటి వాళ్లెందరొచ్చినా కేసీఆర్ ని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
అయితే మేధావి వర్గాలు, లెఫ్ట్ గ్రూపులు, ఆంధ్రాపాలకుల దోపిడీనుంచి తెలంగాణను రక్షించాలని, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్ననిస్వార్ధపరులైన తెలంగాణవ్యక్తులు కొందరు కోదండరామ్ వ్యాఖ్యలను మెచ్చుకుంటున్నారు. కేసీఆర్ ఎన్నికలలో ఎదురులేని మెజారిటీలు సాధించడం, చంద్రబాబును దారికితెచ్చుకుని అపరచాణిక్యుడిగా గుర్తింపు పొందడం, చంద్రబాబుకన్నా అనేక రెట్లు మంచిపాలనను అందించడం మొదలైన విషయాల్లో కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నా, చాపకింద నీరులా సాగుతున్న అవినీతిని, కేసీఆర్‌లో ఇప్పుడిప్పుడే తల ఎత్తుతున్న నియంతృత్వ ధోరణిని, ప్రభుత్వం అంటే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం అంటే ప్రభుత్వం అన్న మాదిరిగా పార్టీని, ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని కలగలపడం వీళ్లకు జీర్ణం కావడంలేదు. ఏ సామాజిక వర్గం దోపిడీవల్ల అయితే తెలంగాణ దగాపడిందో ఆ సామాజిక వర్గంతో లాలూచీ పడిపోయి వాళ్లను నెత్తినపెట్టుకోవడం, చంద్రబాబు తరహాలో తెలంగాణ రైతులనుంచి వేలాది ఎకరాలను గుంజుకోవాలని చూడడం వీళ్లకు మింగుడుపడడం లేదు.
ఎంతమంది చెబుతున్నా ఎర్రగడ్డ ప్రభుత్వాసుపత్రిని కూల్చాలని చూడడం, సెక్రెటేరియేట్‌ను కూల్చి మళ్లీ నిర్మించాలని చూడడం, కేబీఆర్ పార్క్‌ను నాశనం చేయాలని చూడడం వంటి నియంతృత్వ నిర్ణయాలను చూసి కేసీఆర్‌లో తలెత్తుతున్న నియంతృత్వ ధోరణికి ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే తెలంగాణ చాలా నష్టపోతుందని వీళ్లు భావిస్తున్నారు.
టీఆర్‌ఎస్ నాయకులు, ప్రభుత్వం వల్ల లాభపడుతున్నవాళ్లు, ప్రభుత్వ పదవులకోసం ఎగబడుతున్నవాళ్లు, పదవులను అనుభవిస్తున్నవాళ్లు కేసీఆర్ మెప్పుకోసం కోదండరామ్‌ను తెగ విమర్శిస్తున్నారు. అది వాళ్లకు తప్పదుకూడా. కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్న కోదండరామ్‌కు ఆయన వెనకాల వున్నతెలంగాణ గ్రూపులకు ఈ కథలన్నీ తెలిసినవే. వాళ్లు ఒక స్పష్టమైన లక్ష్యంతోనే ముందుకువెళుతున్నారని తెలంగాణ రాజకీయాలను బాగా అధ్యయనం చేసిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Click on Image to Read: