కాంగ్రెస్ పతనానికి వారిద్దరే కారణమా?
తెలంగాణ పీసీసీ పతనానికి కారణం ఎవరు? వారిని ఆదరించనిది ప్రజలా..? పార్టీని సరైన పంథాలో నడిపించలేని నాయకత్వమా? లేక చేతిగుర్తుపై గులాబీ విజయాలు కేవలం గాలివాటమేనా? తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో ఆదరణ తగ్గుతుండటానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటిలో ఎక్కువ మంది వేలెత్తి చూపించేది కాంగ్రెస్ నాయకత్వంవైపే! తెలంగాణ ఆవిర్భావం తరువాత టీపీసీసీ నాయకులంతా పార్టీని ఇష్టానుసారంగా నడిపించారన్న విమర్శలు ఉన్నాయి. ఓ వైపు ప్రభుత్వాన్ని విమర్శించడంలో విఫలమయ్యారు. మరోవైపు తెలంగాణలో […]
Advertisement
తెలంగాణ పీసీసీ పతనానికి కారణం ఎవరు? వారిని ఆదరించనిది ప్రజలా..? పార్టీని సరైన పంథాలో నడిపించలేని నాయకత్వమా? లేక చేతిగుర్తుపై గులాబీ విజయాలు కేవలం గాలివాటమేనా? తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో ఆదరణ తగ్గుతుండటానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటిలో ఎక్కువ మంది వేలెత్తి చూపించేది కాంగ్రెస్ నాయకత్వంవైపే! తెలంగాణ ఆవిర్భావం తరువాత టీపీసీసీ నాయకులంతా పార్టీని ఇష్టానుసారంగా నడిపించారన్న విమర్శలు ఉన్నాయి. ఓ వైపు ప్రభుత్వాన్ని విమర్శించడంలో విఫలమయ్యారు. మరోవైపు తెలంగాణలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని అంచనావేయడంలో, ఎప్పటికప్పుడు నాయకులను హెచ్చరించడంలో అధిష్టానం విఫలమైంది. కొత్త రాష్ట్రంలో పొన్నాలకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పి చేతులు కాల్చుకుంది. తరువాతైనా ఆకులు పట్టుకుందా? అదీ లేదు. ఈసారి ఉత్తమ్‌కు పగ్గాలు ఇచ్చింది.. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది పార్టీ పరిస్థితి. పార్టీ బాధ్యతలు అప్పజెప్పేముందు అతని బలబలాలు అంచనా వేయడంలో కాంగ్రెస్ అధిష్టానం ఫెయిల్ అయింది. ఇక పగ్గాలు చేపట్టినవారు అందరినీ కలుపుకోవడంలో విఫలమయ్యారు. అంతా కలిసి పార్టీని దెబ్బతీశారని సొంతపార్టీ నేతలే అంటున్నారు. ఒకరిద్దరంటే ఏమో అనుకోవచ్చు గానీ ఒకే జిల్లా నుంచి… మాజీ మంత్రి, ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే జారిపోతున్నా.. ఆపలేకపోవడం పార్టీ అధ్యక్షుని వైఫల్యం కాక మరేంటని కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.
పొన్నాల నోరే కొంపముంచింది..!
టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల బాధ్యతలు చేపట్టడం పార్టీలో మెజారిటీ నాయకులకు ఇష్టం లేదు. ఏనాడూ నోరు తెరిచి తెలంగాణ ఊసెత్తని ఆయన ఈ పదవిలో కొనసాగడం ప్రజలకు, తెలంగాణవాదులకూ రుచించలేదు. 2014 అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రెడ్ల ఆధిపత్యం అధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో వారి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు వచ్చాయి. గెలుపు గుర్రాలనుకాదని బీసీలకే ప్రాధాన్యం ఇచ్చాడని కోమటిరెడ్డి సోదరులు నేరుగానే ఆరోపిస్తున్నారు. రెడ్ల జనాభా అధికంగా ఉన్న నల్లగొండ జిల్లాలో భువనగిరి ఎంపీ స్థానంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న అసెంబ్లీ స్థానాల ఓటమికి ఇతనే కారణమని ఓడినవారితోపాటు, కార్యకర్తలు కూడా పొన్నాల మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తానంటూ శపథం చేసి కేసీఆర్ ను రెచ్చగొట్టాడు పొన్నాల. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసి మిగిలిన విపక్షాలతోపాటు, కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు కేసీఆర్. తీరా టీపీసీసీ పదవి ఊడాక.. ఎమ్మెల్సీ పదవి కోసం ఆయనే.. గులాబీ పార్టీలో చేరతాడంటూ వార్తలు రావడం కొసమెరుపు.
ఉత్తముడిగా మార్కులు అంతంతే..!
పొన్నాల విఫలమైన తరువాత నాలుక కరుచుకుంది అధిష్టానం. ఈసారి రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చింది. అధిష్టానానికి ఆప్తుడిగా పేరొందిన ఉత్తమ్‌కు పగ్గాలు ఇచ్చింది. ఈయన సీనియర్లను కలుపుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. పైగా జానారెడ్డి లాంటి వారిని ఇతరపార్టీలు విమర్శించిన సమయంలో కిమ్మనకుండా ఉండి తప్పుచేసి సీనియర్లకు కంటగింపుగా మారారు. రాజధానిలో పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న దానం లాంటి నేతలు పార్టీలు మారుతున్నారని తెలిసి ఆపడంలో విఫలమయ్యాడు. పార్టీలో బలమైన నేతలను కలుపుకు పోవడానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఫిరాయింపులు పెరిగాయి. ఉప ఎన్నికల్లో పార్టీ అధికార టీఆర్ ఎస్ కు పోటీ మాట అటుంచితే.. కనీసం సొంత స్థానాలైన నారాయణఖేడ్, పాలేరు నియోజకవర్గాలను కారు ఎగరేసుకుపోయినా చేతలుడిగి చూడటం తప్ప మరేం చేయలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆయనను ఆ పదవిలో నుంచి తప్పుకోవాలని ఎందరు డిమాండ్ చేస్తున్నా.. ఆయన పట్టించుకోవడం లేదు.
Advertisement