బౌద్ధమతం

పూర్వం ఒక కాశ్మీర్‌ రాజు బౌద్ధమతం స్వీకరించాడు. రాజ్యమంతా శాంతి సుఖాల్ని నెలకొల్పాడు. బుద్ధుని శాంతిమార్గాన్ని ఆయన అనుసరించాడు. ఆ దయామూర్తితో తీవ్రంగా ప్రభావితుడయ్యాడు. సాధారణంగా యథారాజా తథా ప్రజ అంటారు కదా! రాజును అనుసరించి ఆయన మంత్రి కూడా బౌద్ధమతం స్వీకరించాడు. కానీ మంత్రి కొడుకు బౌద్ధమతాన్ని స్వీకరించడానికి ససేమిరా అన్నాడు. పైగా తను ఇంటినించీ వెళ్ళిపోతానని తండ్రిని హెచ్చరించాడు. మంత్రి ఆందోళనతో రాజు దగ్గరికి వెళ్ళి ‘రాజా! నా కొడుకు బౌద్ధాన్ని స్వీకరించకపోగా తను […]

Advertisement
Update:2016-05-31 18:32 IST

పూర్వం ఒక కాశ్మీర్‌ రాజు బౌద్ధమతం స్వీకరించాడు. రాజ్యమంతా శాంతి సుఖాల్ని నెలకొల్పాడు. బుద్ధుని శాంతిమార్గాన్ని ఆయన అనుసరించాడు. ఆ దయామూర్తితో తీవ్రంగా ప్రభావితుడయ్యాడు.

సాధారణంగా యథారాజా తథా ప్రజ అంటారు కదా! రాజును అనుసరించి ఆయన మంత్రి కూడా బౌద్ధమతం స్వీకరించాడు. కానీ మంత్రి కొడుకు బౌద్ధమతాన్ని స్వీకరించడానికి ససేమిరా అన్నాడు. పైగా తను ఇంటినించీ వెళ్ళిపోతానని తండ్రిని హెచ్చరించాడు. మంత్రి ఆందోళనతో రాజు దగ్గరికి వెళ్ళి ‘రాజా! నా కొడుకు బౌద్ధాన్ని స్వీకరించకపోగా తను ఇంటినించీ వెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు’ అని చెప్పాడు.

రాజు అంతా విని ‘మీరేమీ దిగులు పడకండి. అతని జీవితంలో కాంతి వచ్చేట్లు నేను చేస్తాను’ అని భరోసా ఇచ్చాడు. మంత్రి సంతృప్తిగా ఇంటికి వెళ్ళాడు.

రెండు రోజులు గడిచాయి. భటులు మంత్రి ఇంటికి వచ్చి రాజుగారు నీకు మరణశిక్ష విధించారు. ఈరాత్రి చెరసాలలో గడిపి రేపు ఉదయం ఉరికంబమెక్కడానికి సిద్ధపడు’ అని అతన్ని బంధించి చెరసాలకు తీసుకెళ్ళారు. ఆ సంఘటనతో మంత్రి కుమారుడు వణికిపోయాడు. భయపడిపోయాడు.

ఈ సంగతి తెలిసి దిక్కుతోచని మంత్రి పరిగెత్తుకుంటూ వచ్చి రాజుగారి పాదాలపై పడి ‘మహారాజా! జీవితానికి కాంతి ఇస్తారనుకున్నాను. కాంతి అంటే ఇంత కఠిన శిక్షా?’ అన్నాడు. రాజు ‘మంత్రీ! నెలరోజులు సమయమిస్తున్నా. నీ కొడుకును తీసుకెళ్ళు. తరువాత అతన్ని పంపు’ అన్నాడు.

మంత్రి తన కొడుకును తీసుకుని ఇంటికి వెళ్ళాడు. నెలరోజులు గడిచాయి. మంత్రి కొడుకు రాజు దగ్గరికి వెళ్ళి పాదాలపై పడి ‘మహారాజా! నెలరోజులుగా అనుక్షణం ప్రాణభయంతో నిద్రలేకుండా గడిపాను. జీవితంపట్ల మమకారం మరణమంటేనే వణికిపోయేలా చేసింది’ అన్నాడు.

‘బౌద్ధమంటే భయాన్ని పోగొట్టేది. ప్రాపంచిక బంధనాల పరిమితుల్ని చూపేది. అది మనసుకు ఒక స్పష్టతనిస్తుంది. వెలుగిస్తుంది’ అన్నాడు.

ఆమాటల్తో మంత్రి కొడుకుని నిద్రపోతున్న తనని ఎవరో మేలుకొల్పినట్లు అనిపించింది. మరణభయాన్ని పోగొట్టే బౌద్ధంలోని మహిమ పట్ల అతను ఆకర్షితుడయ్యాడు.

‘రాజుగారూ! నాకు ఈ మతాన్ని గురించి మరింతగా తెలుసుకోవాలని ఉంది’ అన్నాడు. రాజుగారు తన అతిథి గృహానికి అతన్ని రమ్మన్నాడు.

మంత్రి కొడుకు రాజు అతిథి గృహానికి వెళ్ళాడు. రాజు అతనికి ఒక దీపాన్నిచ్చి ఊరి చివర ఉన్న మీ ఇంటిదాకా ఈ దీపాన్ని తీసుకెళ్ళు. మళ్ళీ అక్కడినించీ ఈ దీపాన్ని ఇక్కడికి తీసుకురా. ఐతే ఈ దీపం గాలికి ఆరిపోకుండా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ దీపం ఆరిపోతే నిన్ను ఉరితీయడం తథ్యం’ అన్నాడు.

మంత్రి కొడుకు దీపాన్ని పట్టుకున్నాడు. అతని వెనక కత్తులు పట్టుకున్న ఇద్దరు సైనికులు అతన్ని అనుసరించారు. ఆరంభంలోనే గాలికి దీపం దాదాపు ఆరినంత పనయింది. అతను తన కుడిచేతిని దీపం ఆరకుండా అడ్డుపెట్టాడు. అప్రమత్తంగా జాగ్రత్తగా తన ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూసి తండ్రి ఒక్క ఉదుటన లేచి ముందుకు రాబోయాడు. యువకుడు ‘నాన్నా! జాగ్రత్త! మెల్లగా ఆ దీపం ఆరితే నా బతుకే ఆరిపోతుంది. నేను దీపం ఆరిపోకుండా మళ్ళీ రాజుగారి అతిథి గృహానికి వెళ్లాలి’ అని బయల్దేరాడు.

దూరం నించీ మెల్లగా జాగ్రత్తగా వస్తున్న మంత్రి కుమారుణ్ణి చూసి రాజు ఆనందించాడు. మంత్రి కుమారుడు దీపం తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దారిలో నువ్వు ఎవర్ని కలిశావు? అన్నాడు. ఆ యువకుడు రాజుగారూ! నేను దీపం ఎక్కడ ఆరిపోతుందో, ఆరిపోతే కాకు ప్రాణాపాయం. దానిపైన నా దృష్టి ఉండడం వల్ల నేను ఎవర్నీ చూడలేదు, ఏమీ వినలేదు’ అన్నాడు.

ఆసమాధానానికి చిరునవ్వు నవ్వి రాజు ఏకాగ్రతకు సంబంధించిన పాఠమిది. అంటే నువ్వు ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తే నీకు ప్రపంచ స్పృహ ఉండదు. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోవు. బౌద్ధం నువ్వు అత్యున్నతమయిన మంచితనం మీద ఏకాగ్రత నిలిపితే నీకు ప్రాపంచిక విషాదాల పట్ల స్పృహ ఉండదు. సత్యంపై దృష్టి నిలపడం వల్ల నువ్వు జనన మరణ చక్రం నించీ వేరవుతావు. పునర్జన్మ నించీ విముక్తుడవుతావు. ఏకాగ్రతకు సంబంధించి చిన్ని పాఠం నేర్చుకున్నావు! అన్నాడు.

రాజుగారి అపూర్వ బోధనా విధానాన్ని చూసి యువకుడు ఆశ్చర్యపడ్డాడు. రాజుకి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పాడు. బౌద్దమత ఆంతర్యాన్ని గ్రహించాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News