డ్రైవర్ నిద్రపోయాడు...ప్రయాణికుడు క్యాబ్ నడిపాడు!
ఫోన్ చేయగానే అందుబాటులో ఉండే క్యాబ్ సదుపాయం నిజానికి చాలా చక్కని సౌకర్యమే. అయితే ఈ సదుపాయంలోనూ లోటుపాట్లు ఉన్నాయని ఇప్పటికే చాలా సంఘటనలు రుజువు చేశాయి. అలాంటిదే ఇది. ఊబర్ కంపెనీ క్యాబ్‌ని మాట్లాడుకున్న ప్రయాణికుడు ఒకరు తానే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. క్యాబ్ కంపెనీ నిర్లక్ష్యం, ఆ ప్రయాణికుడి ఉదారతని వెల్లడించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని పోస్టుచేసిన ప్రయాణీకుడు ఇషాన్ గిల్ (23) గుర్గావ్కి చెందిన […]
ఫోన్ చేయగానే అందుబాటులో ఉండే క్యాబ్ సదుపాయం నిజానికి చాలా చక్కని సౌకర్యమే. అయితే ఈ సదుపాయంలోనూ లోటుపాట్లు ఉన్నాయని ఇప్పటికే చాలా సంఘటనలు రుజువు చేశాయి. అలాంటిదే ఇది. ఊబర్ కంపెనీ క్యాబ్‌ని మాట్లాడుకున్న ప్రయాణికుడు ఒకరు తానే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. క్యాబ్ కంపెనీ నిర్లక్ష్యం, ఆ ప్రయాణికుడి ఉదారతని వెల్లడించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని పోస్టుచేసిన ప్రయాణీకుడు ఇషాన్ గిల్ (23) గుర్గావ్కి చెందిన ఆర్థిక విశ్లేషకుడు. గిల్ ఈ నెల పదహారున రాత్రి పన్నెండున్నరకు ఊబర్ యాప్ ద్వారా క్యాబ్‌ని బుక్ చేసుకున్నాడు. అతను దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ నుండి డిఎల్ఎఫ్ ఫేస్-2 వరకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ క్యాబ్‌తో వచ్చిన డ్రైవర్ బాగా నిద్ర మత్తులో ఉన్నాడు. అతను డ్రైవింగ్ చేసే స్థితిలో లేడు. దాంతో ఒకసారి రోడ్ డివైడర్‌కి కారుని ఢీకొట్టబోయాడు కూడా. ఆ సమయంలో గిల్ అతడిని గట్టిగా కుదపటంతో అతను బ్రేక్ వేయగలిగాడు. అంతేకాదు, ఇక డ్రైవ్ చేయలేని పరిస్థితుల్లో కారుని ఆపేశాడు కూడా. అలా డ్రైవర్ ఒరిగిపోగానే గిల్ అతడిని నిదానంగా పక్కసీట్లోకి జరిపి, తాను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు. డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లాడు.
అయితే ఈ మధ్యలో ఇంకా చాలా జరిగింది. డ్రైవర్ మత్తుగా తూగుతుండటం చూసి ఏమైందని అడిగాడు గిల్. ఎక్కువ సమయం మేలుకుని ఉండటానికి వీలుగా ట్యాబ్లేట్లు తీసుకున్నట్టుగా అతను చెప్పాడు. గిల్ అతని ఫోన్ తీసుకుని అతని పరిస్థితిని అందులోని ఓ నెంబర్ కి మేసేజ్ చేశాడు. అతనికి మంచినీళ్లు తాగించాడు. డ్రైవర్ ఆరోగ్యం బాగానే ఉన్నదని నిర్దారించుకున్నాక, అతనికి తన డ్రైవింగ్ లేసెన్సు చూపించి తానే కారుని నడిపాడు.
అప్పటికే రాత్రి ఒకటిన్నర అయినందున అప్పుడు మరో క్యాబ్‌ని బుక్‌చేసే పని పెట్టుకోలేదని, ఆ సమయంలో తన ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువగా ఉందని అతను తెలిపాడు. రెండుగంటలకు గిల్ తన ఇల్లు చేరాడు. అయితే డ్రైవర్ మంచి నిద్రలోఉండటంతో చెల్లించాల్సిన 427 రూపాయిల క్యాబ్ ఛార్జికి గానూ ఐదువందల రూపాయలనోటుని అతనికి సమీపంగా ఉంచి వెళ్లిపోయాడు. గిల్ తన పోస్టులో ఈ విషయాలన్నీ చెబుతూ ఊబర్ క్యాబ్ కంపెనీమీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఊబర్ గిల్‌కి ఈ –మెయిల్ ద్వారా సమాధానం చెబుతూ, దీనిపై తగిన చర్య తీసుకుంటామని, మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పింది.
ఇంకెప్పుడూ మీరు అలా సొంతంగా డ్రైవ్ చేయకండి, న్యాయపరమైన చిక్కులు వస్తాయి..అని కూడా ఊబర్ కోరింది. డ్రైవింగ్ చేసినందుకు గిల్‌కి ఛార్జి చెల్లిస్తామని పేర్కొంది. కానీ అది పెద్ద విషయం కాదని, అయితే ఒకవేళ యాక్సిడెంటు అయి ఉంటే, ఆ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారని, ప్రయాణికుల ప్రాణాలకు ఊబర్ భద్రత కల్పించాలని గిల్ కోరారు. మొత్తానికి ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలతో తరచుగా వార్తల్లోకి రావటం ఊబర్కి అలవాటుగా మారినట్టుంది.