కారు లిఫ్ట్‌లోకి దూసుకుపోయిన కారు...ఇద్దరు మృతి!
ఢిల్లీలో కారు యాక్సిడెంట్ చేసి ఓ వ్యక్తి మరణానికి కారణమైన మైనరు కుర్రాడి ఉదంతం మర్చిపోకముందే ముంబయిలో అలాంటిదే మరొక ప్రమాదం చోటు చేసుకుంది. పద్నాలుగేళ్ల కుర్రాడు కారుని, కార్‌లిఫ్ట్‌లోకి దూసుకుపోయేలా చేసి యాక్సిడెంట్ చేశాడు. ఈ యాక్సిడెంట్‌లో అతనితో పాటు ఆ కారు డ్రైవర్ కూడా మరణించాడు. ముంబయిలో కొత్తగా నిర్మించిన 22 అంతస్తుల భవనం ఇక్బాల్ హైట్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం సుమారు 11.30 గం.ల ప్రాంతంలో హఫీజ్ పటేల్ (14), […]
ఢిల్లీలో కారు యాక్సిడెంట్ చేసి ఓ వ్యక్తి మరణానికి కారణమైన మైనరు కుర్రాడి ఉదంతం మర్చిపోకముందే ముంబయిలో అలాంటిదే మరొక ప్రమాదం చోటు చేసుకుంది. పద్నాలుగేళ్ల కుర్రాడు కారుని, కార్‌లిఫ్ట్‌లోకి దూసుకుపోయేలా చేసి యాక్సిడెంట్ చేశాడు. ఈ యాక్సిడెంట్‌లో అతనితో పాటు ఆ కారు డ్రైవర్ కూడా మరణించాడు. ముంబయిలో కొత్తగా నిర్మించిన 22 అంతస్తుల భవనం ఇక్బాల్ హైట్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం సుమారు 11.30 గం.ల ప్రాంతంలో హఫీజ్ పటేల్ (14), వాళ్ల కారు డ్రైవర్ మహమ్మద్ జావేద్ బయటకు వెళ్లడానికి బయలుదేరారు. హఫీజ్ ఈ మధ్యే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. దాంతో అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారుని పార్కింగ్ ప్లేస్ నుండి సెకండ్ ఫ్లోర్లో ఉన్న కారు లిఫ్ట్ వరకు హఫీజ్ నడిపాడు. అక్కడకు వచ్చాక అతను కారుని ఆపడానికి బ్రేక్ వేయబోయి యాక్సిలేటర్ నొక్కడంతో కారు మూసి ఉన్న లిఫ్ట్‌లోకి దూసుకుపోయింది. ఆ వేగానికి లిఫ్ట్ డోర్ తెరుచుకుని కారు రెండవ ఫ్లోర్‌నుండి 35 అడుగుల కిందకు బేస్‌మెంట్‌లోకి పడిపోయింది.
అప్పుడే మరోకారుని తీసుకువస్తున్న లిఫ్ట్, యాక్సిడెంట్ వలన మూడో ఫ్లోర్‌లో ఇరుక్కుపోయింది. ఆ కారు డ్రైవర్ ఫోన్‌ద్వారా ఆ సమాచారం బయటకు అందించడానికి ప్రయత్నించాడు. సిగ్నల్స్ లేకపోవడం వలన కొన్ని గంటల తరువాత అతని ప్రయత్నం ఫలించి అతను బయటకు రాగలిగాడు. మరోపక్క హఫీజ్ ఎక్కడికి వెళ్లాడనే ఆందోళనతో అతని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయంత్రం ఆరుగంటలకు హఫీజ్ దగ్గర ఉన్న సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ని బట్టి వారు పడిపోయిన ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. అప్పటివరకు హఫీజ్, అతని డ్రైవర్‌తో పాటు పడిపోయిన కారు గురించి ఎవరికీ తెలియనే లేదు. గుర్తించిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందారని వైద్యులు తెలిపారు. అయితే కారు పడిపోయిన శబ్దం ఎవరికీ ఎందుకు వినిపించలేదు, అన్ని గంటలపాటు ఎవరూ లిఫ్ట్‌కోసం ఎందుకు ప్రయత్నించలేదు, ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది తదితర విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో మరణించిన డ్రైవర్ మహమ్మద్ కి వచ్చేనెల వివాహం జరగాల్సి ఉంది. అతని ఇంటికి అతనే ఆధారం. ఈవిషయం అతని తల్లికి ఎలా చెప్పాలంటూ అతని సన్నిహిత బంధువు వాపోయాడు.